Share News

CM Stalin: ఓట్ల కోసం కాదు.. ప్రజల కోసమే మా పథకాలు

ABN , Publish Date - Sep 16 , 2025 | 10:18 AM

రాష్ట్రంలోని ద్రావిడ తరహా డీఎంకే ప్రభుత్వం ఓట్ల కోసం పథకాలను అమలు చేయడం లేదని, అన్ని వర్గాలవారు అన్ని సదుపాయాలు పొందాలనే లక్ష్యంతోనే కొత్త పథకాలను అమలు చేస్తోందని ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ పేర్కొన్నారు.

CM Stalin: ఓట్ల కోసం కాదు.. ప్రజల కోసమే మా పథకాలు

- ‘అన్బుకరంగళ్‌’ ప్రారంభోత్సవ సభలో సీఎం స్టాలిన్‌

చెన్నై: రాష్ట్రంలోని ద్రావిడ తరహా డీఎంకే ప్రభుత్వం ఓట్ల కోసం పథకాలను అమలు చేయడం లేదని, అన్ని వర్గాలవారు అన్ని సదుపాయాలు పొందాలనే లక్ష్యంతోనే కొత్త పథకాలను అమలు చేస్తోందని ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌(Chief Minister MK Stalin) పేర్కొన్నారు. చేపాక్‌ కలైవానర్‌ అరంగంలో సామాజిక సంక్షేమం, మహిళా సాధికార శాఖల ఆధ్వర్యంలో సోమవారం ‘అన్బుకరంగళ్‌’ అనే కొత్త పథకాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటైన సభలో సీఎం మాట్లాడుతూ.. డీఎంకే వ్యవస్థాపకుడు, మాజీ ముఖ్యమంత్రి దివంగత అన్నాదురై జయంతి సందర్భంగా చిన్నారుల కోసం అన్బుకరంగళ్‌ పథకాన్ని ప్రారంభించడం తనకెంతో సంతోషంగా ఉందన్నారు.


‘పేదల చిరునవ్వుల్లోనే దేవుడిని చూడగలం’ అని అన్నాదురై చెబుతుండేవారని, అలాంటి నిరుపేద కుటుంబాల్లో కాసింత చిరునవ్వును తెప్పించడం కోసమే ఈ పథకాన్ని రూపొందించామని, జిల్లా కలెక్టర్లందరూ శ్రమించి అర్హుల వివరాలు సేకరించి 6082 మంది లబ్దిదారులను ఎంపిక చేశారని చెప్పారు. తానెప్పుడూ సీఎం పదవిని ప్రజలు అప్పగించిన బాధ్యతగానే భావిస్తానన్నారు. కానీ ఇతరులు మాత్రం ఆ పదవిని తమ విలాసాల కోసం వాడుకుని, ప్రజా సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించి, ఎన్నికల సమయంలో ఒకటీరెండు ఆకర్షణీయమైన హామీలు ప్రకటించి మళ్ళీ అధికారంలోకి రావాలని తాపత్రయపడుతుంటారని విమర్శించారు.


కార్యక్రమంలో భాగంగా తల్లిదండ్రులను కోల్పోయిన, తల్లిదండ్రుల్లో ఒకరిని కోల్పోయి, ఆర్థికస్థితి లేని తల్లి లేదా తండ్రి సంరక్షణలో ఉన్న చిన్నారులను 18 యేళ్ల వరకు చదివించేందుకు ప్రతినెలా రూ.2000 చెల్లించే ప్రస్తుతం అమలులో ఉన్న ‘తాయుమానవర్‌ పథకం’తో పాటు ఈ కొత్త పథకానికి శ్రీకారం చుట్టి, కొంతమంది చిన్నారులకు ఆయన రూ.2వేల చెక్కులను అందజేశారు. ఇదే విధంగా తల్లిదండ్రులను కోల్పోయి ప్లస్‌-2 (12వ తరగతి) ఉత్తీర్ణులై ఉన్నత విద్య చదువుతున్న 1340 మంది విద్యార్థులకు ఉచితంగా లాప్‌టా్‌పలను స్టాలిన్‌ అందజేశారు. డీఎంకే ప్రభుత్వం ఓట్ల కోసం పథకాలను అమలు చేయదని, ప్రజల దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకునే ప్రతిపథకాన్ని ఆచితూచి అమలు చేస్తుందన్నారు. ఆర్థికంగా వెనుబడిన హిజ్రాల బ్రతుకులో వెలుగు నింపే పథకాలను అమలు చేశామని,


nani1.2.jpg

ఇక మహిళలు ఆర్థికపరంగా ఉన్నతస్థితికి చేర్చాలనే సత్సంకల్పంతోనే కలైంజర్‌ మహిళా సాధికారిక పధకం క్రింద అర్హులైన గృహిణులకు ప్రతినెలా రూ.1000లు వారి బ్యాంక్‌ ఖాతాల్లోనే జమ చేస్తున్నామని గుర్తు చేశారు. రాబోవు ఎన్నికల్లో మళ్ళీ అధికారంలోకి రావాలనే ఆశతో తమ ప్రభుత్వం ఇలాంటి పథకాలను అమలు చేయడం లేదని, అందరికీ అన్ని సదుపాయా లు అనే ఏకైక లక్ష్యాన్ని సాధించడం కోసమే అమలు చేస్తున్నామని చెప్పారు. ఎన్నికల్లో ఓట్లు తమ ప్రభుత్వంపై, తనపైనా ప్రజలకున్న నమ్మకాన్ని తెలియజేస్తాయన్నారు.


అన్బుకరంగళ్‌ పథకం లబ్దిదారులు ఉన్నత చదువుల్లోనూ రాణించి ఐపీఎస్‌, ఐఏఎస్‌ అధికారులుగా రాష్ట్రానికి సేవలందించాలని ఆశపడుతున్నానని, ఆ ఆశను బాలబాలికలు నెరవేరుస్తారనే నమ్మకం తనకుందని స్టాలిన్‌ పేర్కొన్నారు. కార్యక్రమానికి ముందు గా సామాజిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వస్తు ప్రదర్శనను సందర్శించారు. కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి, మంత్రులు కేఎన్‌ నెహ్రూ, పీకే శేఖర్‌బాబు, గీతా జీవన్‌, ఎం.సుబ్రమణ్యం, చెన్నై మేయర్‌ ప్రియ, ఎమ్మెల్యేలు ఇ.పరంథామన్‌, తాయగం కవి, డిప్యూటీ మేయర్‌ ఎం.మహే్‌షకుమార్‌, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎన్‌.మురుగానందం, సామాజిక సంక్షేమ శాఖ కార్యదర్శి జయశ్రీ మురళీధరన్‌, శిశుసంక్షేమం, ప్రత్యేకసేవల శాఖ సంచాలకులు శిల్పా ప్రభాకర్‌ సతీష్‌, సామాజిక సంక్షేమ సంస్థ సంచాలకులు ఎంఎస్‌ సంగీతా, రాష్ట్ర ఆదర్శ పాఠశాలల విభాగం మెంబర్‌ సెక్రటరీ ఇరా సుదన్‌ తదితరులు పాల్గొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

మళ్లీ తగ్గిన బంగారం ధరలు..కానీ వెండి మాత్రం

మొదటి పావుగంటలో రిజర్వేషన్లకు ఆధార్‌

ప్రైవేటు కాలేజీల ఆందోళనలకు సంపూర్ణ మద్దతు

Read Latest Telangana News and National News

Updated Date - Sep 16 , 2025 | 10:18 AM