Pak Cross Border Terror: పాక్ సరిహద్దు తీవ్రవాదంపై భారత్‌కు చైనా మద్దతు
ABN , Publish Date - Aug 31 , 2025 | 10:00 PM
భారత్, చైనా సైతం ఉగ్రవాద బాధిత దేశాలేనని జిన్‌పింగ్ దృష్టికి మోదీ తీసుకువచ్చారని, దీనిపై చైనా మద్దతు కోరారని విక్రమ్ మిస్రీ తెలిపారు. ఉగ్రవాదంపై పోరులో భారత్‌తో కలిసి వచ్చేందుకు చైనా సుముఖత వ్యక్తం చేసిందన్నారు.
న్యూఢిల్లీ: ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత్ జరుపుతున్న పోరాటానికి చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ నుంచి మద్దతు లభించింది. షాంఘై సహకార సంస్థ వార్షిక సదస్సు కోసం చైనాలో పర్యటిస్తున్న నరేంద్ర మోదీ (Narendra Modi) ఆదివారంనాడు జిన్‌పింగ్ (Jinping)తో ద్వైపాక్షిక చర్చలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పాక్ సరిహద్దు తీవ్రవాదం అంశాన్ని మోదీ ప్రస్తావించగా, జిన్‌పింగ్ భారత్‌కు మద్దతు తెలిపిన్టటు విదేశాంగ శాఖ తెలిపింది. ఇరుదేశాల మధ్య వాణిజ్యం పెంపు, సరిహద్దుల్లో శాంతి నెలకొనడం, ఉభయదేశాల ప్రజల మధ్య సత్సంబంధాలపై ప్రధానంగా మోదీ, జిన్‌పింగ్ చర్చించినట్టు మీడియాతో మాట్లాడుతూ విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రీ తెలిపారు. సుంకాల విషయంలో అమెరికాతో ప్రతిష్ఠంభన తలెత్తిన నేపథ్యంలో మోదీ, జిన్‌పింగ్ సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది.
భారత్, చైనా సైతం ఉగ్రవాద బాధిత దేశాలేనని జిన్‌పింగ్ దృష్టికి మోదీ తీసుకువచ్చారని, దీనిపై చైనా మద్దతు కోరారని విక్రమ్ మిస్రీ తెలిపారు. ఉగ్రవాదంపై పోరులో భారత్‌తో కలిసి వచ్చేందుకు చైనా సుముఖత వ్యక్తం చేసిందన్నారు. పాకిస్థాన్‌తో సన్నిహితంగా ఉండే చైనా గత జూన్‌లో జరిగిన ఎస్‌సీఓ మీట్‌లో పహల్గాం ఉగ్రదాడిని సంయుక్త ప్రకటనలో ప్రస్తావించలేదు. దీంతో సంయుక్త ప్రకటనపై సంతకం చేసేందుకు ఇండియా నిరాకరించింది. ఏప్రిల్ 22న జరిగిన పహల్గాం దాడికి బదులు బలోచిస్థాన్‌లో ఘటనలను ఆ ప్రకటనలో చైనా ప్రస్తావించింది.
కాగా, రష్యా నుంచి చమురు కొనుగోలుపై అక్కసు వెళ్లగక్కుతున్న డొనాల్డ్ ట్రంప్ తొలుత భారత్‌పై 25 శాతం సుంకాలు విధించి, అదనంగా మరో 25 శాతం సుంకాలు పెంచారు. ఈ క్రమంలో ఇండో-చైనా తిరిగి ద్వైపాక్షిక సంబంధాలను మెరుగుపరుచుకునే దిశగా అడుగులు వేస్తున్నాయి. ఈ సందర్భంగా వ్యూహాత్మక స్వయంప్రతిపత్తిని, సంబంధాలను మూడో దేశం కోణం నుంచి ఇరుదేశాలు చూడరాదని కూడా మోదీ-జిన్‌పింగ్ సమావేశంలో ఒక అవగాహనకు వచ్చినట్టు విక్రమ్ మిస్రీ తెలిపారు. ద్వైపాక్షిక, ప్రాంతీయ, గ్లోబల్ అంశాలు, ఉగ్రవాదం వంటి సవాళ్లను సమష్టిగా ఎదుర్కోవాల్సిన అవసరాన్ని కూడా ఉభయనేతలు గుర్తించినట్టు చెప్పారు.
ఇవి కూడా చదవండి..
చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌కు ప్రధాని మోదీ ఆహ్వానం
అమిత్‌షాపై అభ్యంతకర వ్యాఖ్యలు.. మహువా మొయిత్రాపై ఎఫ్ఐఆర్
For More National News And Telugu News