Share News

Chhattisgarh: దండకారణ్యంలో ఎన్‌కౌంటర్.. మావోయిస్టులకు భారీ దెబ్బ

ABN , Publish Date - Feb 09 , 2025 | 03:59 PM

Chhattisgarh: కాల్పుల మోతతో దండకారణ్యం మళ్లీ దద్దరిల్లింది. మావోయిస్టులకు మళ్లీ గట్టి దెబ్బ తగిలింది. ఈ ఎన్‌కౌంటర్‌లో 31 మంది మావోయిస్టులు మరణిస్తే.. ఇద్దరు భద్రత సిబ్బంది సైతం కన్నుమూశారు. మరో ఇద్దరు భద్రతా సిబ్బంది గాయపడ్డారు.

Chhattisgarh: దండకారణ్యంలో ఎన్‌కౌంటర్.. మావోయిస్టులకు భారీ దెబ్బ

రాయ్‌పూర్, ఫిబ్రవరి 09: చత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లాలో జరిగిన ఎన్ కౌంటర్‌లో 31 మంది మావోయిస్టులు హతమయ్యారు. ఇద్దరు భద్రత సిబ్బంది సైతం మరణించారు. ఆదివారం.. బీజాపూర్ జిల్లాల్లోని ఇంద్రావతి జాతీయ పార్క్ సమీపంలో మావోయిస్టులు సమావేశమయ్యారంటూ భద్రతా దళాలకు నిఘా వర్గాల నుంచి సమాచారం అందింది. దీంతో ఆ పరిసర ప్రాంతాల్లో భద్రతా దళాలు కూబింగ్ చేపట్టాయి. ఈ విషయాన్ని గమనించిన మావోయిస్టులు.. భద్రతా దళాలపై కాల్పులకు తెగబడ్డారు.

దీంతో భద్రతా దళాలు ఎదురు కాల్పులకు దిగాయి. దీంతో దాదాపు ఐదు గంటల పాటు ఇరు వైపులా హోరా హోరీ కాల్పులు జరిగాయి. అనంతరం ఘటన స్థలంలో 31 మావోయిస్టుల మృత దేహాలను భద్రత సిబ్బంది గుర్తించారు. అలాగే సంఘటన స్థలంలో ఆయుధాలతోపాటు భారీగా పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. అయితే ఈ ఏడాది జనవరి నుంచి నేటి వరకు ఛత్తీస్‌గఢ్‌లో వివిధ ప్రాంతాల్లో.. పలు సమయాల్లో జరిగిన ఎన్‌కౌంటర్లలో మొత్తం 81 మంది మావోయిస్టులు మరణించారు.


మరోవైపు ఈ ఎన్‌కౌంటర్‌లో మరణించిన ఇద్దరు భద్రతా సిబ్బంది.. ఛత్తీస్‌గఢ్‌ ప్రభుత్వానికి చెందిన జిల్లా రిజర్వ్ గార్డ్‌తోపాటు స్పెషల్ టాస్క్ ఫోర్స్‌కు చెందిన వారని బస్తర్ ఐజీ సుందర్ రాజ్ వెల్లడించారు. ఈ కాల్పుల్లో మరో ఇద్దరు గాయపడ్డారని చెప్పారు. వీరిని ఆసుపత్రికి తరలించామన్నారు. అయితే వారికి ఎటువంటి ప్రాణాపాయం లేదని వైద్యులు చెప్పారన్నారు. వారికి మెరుగైన వైద్య చికిత్స కోసం జిల్లా కేంద్రంలోని ఆసుపత్రికి తరలించామని ఐజీ సుందర్ రాజ్ చెప్పారు.

Also Read: ఢిల్లీ సీఎం అభ్యర్థి ఫిక్స్.. అధిష్టానం చూపు అతడి వైపే


ఇంకోవైపు మావోయిస్టుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతోన్నాయన్నారు. 2026, మార్చి నాటికి దేశంలో మావోయిస్టులను నిర్మూలిస్తామని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ప్రకటించారు. ఆ క్రమంలో మావోయిస్టులు లొంగిపోవాలని ఆయన సూచించారు. అయితే దేశంలోని వివిధ రాష్ట్రాల్లో మావోయిస్టుల కార్యకలాపాలు దాదాపుగా తగ్గిపోయాయి.


కానీ ఛత్తీస్‌గఢ్‌లోని దండకారణ్యం ప్రాంతంలో మాత్రం వారి కదలికలు చురుగ్గా ఉన్నాయి. ఈ నేపథ్యంలో భద్రతా దళాలు.. మావోయిస్టుల కోసం గాలింపు చర్యలు చేపట్టాయి. ఆ క్రమంలో తరుచూ ఆ రాష్ట్రంలో ఎన్ కౌంటర్లు చోటు చేసుకొంటున్నాయి. ఇప్పటికే ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన పలు ఎన్‌కౌంటర్లలో భారీగా మావోయిస్టులకు ఎదురుదెబ్బ తగిలిన సంగతి తెలిసిందే.

For National News And Telugu News

Updated Date - Feb 09 , 2025 | 05:38 PM