Heavy Rains: ఇంకా శివారును వీడని వాననీరు..
ABN , Publish Date - Dec 06 , 2025 | 01:52 PM
చెన్నై నగర శివారు ప్రాంతాలు ఇంకా వరద నీటిలోనే ఉన్నాయి. భారీ వర్షాలు జనజీవనాన్ని అతలాకుతలం చేశాయి. దిత్వా తుపాన్ నగరాన్ని ముంచెత్తింది. అయితే... ప్రస్తుతం తుపాన్ ప్రభావం లేకున్నా ఎక్కడ చూసినా బురద, చెత్తాచెదారం, దర్శనమిస్తోంది.
- ఐదవరోజూ తప్పని అగచాట్లు
- పాములు సంచరిస్తుండడంతో భయాందోళనలు
చెన్నై: నగర శివారు ప్రాంతాలను ఐదవ రోజైన శుక్రవారం కూడా వాననీరు వదల్లేదు. ‘దిత్వా’ తుపాను కారణంగా నగరం, శివారు ప్రాంతాల్లో గత ఆదివారం నుంచి భారీవర్షాలు కురిశాయి. నగరంలోని రోడ్లు జలమయం కావడంతో వాహనచోదకులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. నగరంలోని రోడ్లు, వీధుల్లోని నీటిని విద్యుత్ మోటార్ల సాయంతో కార్పొరేషన్ కార్మికులు ఎప్పటికప్పుడు తొలగించినా, శివారులోని ముంపు ప్రాంతాలు ఇంకా వరద నీటిలోనే ఉన్నాయి. ముఖ్యంగా, తాంబరం, రెడ్‌హిల్స్, పుళల్, చుట్టుపక్కల ప్రాంతాల్లో మోకాలి లోతున నీరు నిలిచే ఉంది.

తాంబరం సమీపంలోని ఊరపాక్కం, పరిసర ప్రాంతాలు కూడా జలదిగ్బంధంలోనే ఉన్నాయి. మాధవరం నియోజకవర్గం పరిధిలోని పుళల్ పంచాయతీ యూనియన్ పరిధిలోని పలు ప్రాంతాలు కూడా ఐదవ రోజు వరద నీటితో చిన్న చెరువులను తలపిస్తున్నాయి. అళింజివాక్కం ప్రాంతంలోని ముత్తుకుమరన్ నగర్, న్యూ స్టార్ సిటీ, కల్మేడు ప్రాంతంలోని మరో న్యూ స్టార్ సిటీ ప్రాంతాల్లోని గృహాలు వరద నీటిలోనే ఉండడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

పుళల్ నుంచి విడుదల చేస్తున్న అదనపు జలాల తగ్గింపు
పుళల్ జలాశయం నుంచి విడుదల చేస్తున్న అదనపు జలాలను అధికారులు తగ్గించారు. కొద్దిరోజులుగా తిరువళ్లూర్ జిల్లాలో కురుస్తున్న వర్షాల కారణంగా పుళల్ జలాశయానికి నీటి రాక పెరిగింది. ఈ కారణంగా డ్యాం భద్రత దృష్ట్యా ఈ నెల 3వ తేది నుంచి 2,500 ఘనపుటడుగుల అదనపు జలాలను దిగువకు విడుదల చేశారు. ప్రస్తుతం వర్షాలు తగ్గుముఖం పట్టి జలాశయానికి నీటి రాక తగ్గింది.
ఈ కారణంగా, డ్యాం నుంచి విడుదల చేస్తున్న జలాలను 500 ఘనపుటడుగులకు తగ్గించారు. 24 అడుగుల సామర్థ్యం కలిగిన పుళల్ జలాశయంలో శుక్రవారం ఉదయం నీటిమట్టాలు 22.62 అడుగులుగా ఉంది. పైతట్టు ప్రాంతాల నుంచి జలాశయంలోకి 1454 ఘనపుటడుగుల నీరు వచ్చి చేరుతోంది. అలాగే, చెంబరంబాక్కం జలాశయానికి 1150 ఘనపుటడుగులు, పూండి జలాశయానికి 1310 ఘనపుటడుగుల నీరు వచ్చి చేరుతోందని ప్రజాపనుల శాఖ అధికారులు తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి..
గుడ్ న్యూస్.. వెండి ధరలో భారీ కోత
రూ.100తో వారసత్వ భూముల రిజిస్ర్టేషన్
Read Latest Telangana News and National News