Share News

Maha Kumba Mela 2025 : బ్రేకింగ్ న్యూస్.. కుంభమేళాలో భారీ అగ్నిప్రమాదం..

ABN , Publish Date - Jan 19 , 2025 | 04:47 PM

బ్రేకింగ్ న్యూస్.. మహా కుంభమేళాలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది.

Maha Kumba Mela 2025 : బ్రేకింగ్ న్యూస్.. కుంభమేళాలో భారీ అగ్నిప్రమాదం..
Fire Accident at Maha Kumba Mela

Prayagraj : ఉత్తర్‌ప్రదేశ్‌లోని ప్రయాగ్‍‌రాజ్‌లో జరుగుతున్న కుంభమేళాలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. భక్తుల గుడారాల్లో పెద్ద ఎత్తున మంటలు చెలరేగడంతో భయభ్రాంతులకు గురైన భక్తులు శిబిరాల నుంచి బయటకు పరుగులు తీశారు. వెంటనే ఫైర్ సిబ్బంది అక్కడకు చేరుకుని మంటలు అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.


ప్రయాగ్‌రాజ్‌లోని మహాకుంభమేళాలో సెక్టార్ 5లో మంటలు చెలరేగాయి. వారణాసిలోని వివేకానంద సేవా సమితి టెంట్‌లో భోజనం వండుతుండగా మంటలు చెలరేగినట్లు సమాచారం. ఇది అధికారికంగా ధృవీకరించలేదు. గ్యాస్ సిలిండర్లలో పేలుళ్లు సంభవించడంతో టెంట్లను మంటలు చుట్టుముట్టి పెద్ద ఎత్తున నల్లటి పొగ ఎగసిపడుతోంది. 20 నుంచి 25 టెంట్లు కాలి బూడిదైనట్లు తెలుస్తోంది. మంటలను అదుపు చేసేందుకు ఆరు అగ్నిమాపక యంత్రాలు రంగంలోకి దిగాయి. అయినా మంటలు అన్ని వైపులా విస్తరిస్తున్నందున పోలీసులు, ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు పరిసర ప్రాంతాలను ఖాళీ చేయిస్తున్నారు. మహాకుంభమేళా పరిధిలోకి వచ్చే శాస్త్రి బ్రిడ్జి, రైల్వే బ్రిడ్జి మధ్య ప్రాంతంలో మంటలు చెలరేగాయని అనధికారిక సమాచారం.


సెక్టార్ 5లో చెలరేగిన మంటలు క్రమంగా సెక్టార్ 19, 20కి కూడా వ్యాపించాయి. బలమైన గాలి కారణంగా మంటలు వేగంగా వ్యాపిస్తున్నాయి. సమీపంలోని టెంట్‌లను కూడా చుట్టుముట్టడంతో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. అగ్నిప్రమాదం తర్వాత జాతర ప్రాంతమంతా గందరగోళ పరిస్థితి నెలకొంది. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరిగినట్లు ఇంకా సమాచారం అందలేదు. ప్రస్తుతం మంటలు అదుపులోకి వచ్చాయని, భక్తులు ఆందోళన చెందాల్సిన పనిలేదని అధికార యంత్రాంగం ప్రకటించింది. పుకార్లను పట్టించుకోవద్దని భక్తులను విజ్ఞప్తి చేసింది. ప్రమాదం తీవ్రత, వాటిల్లిన నష్టంపై సమాచారం వెల్లడించలేదు.


అగ్ని ప్రమాదం ఎలా సంభవించిందంటే..

భక్తులు బస చేసేందుకు జాతర ప్రాంతంలో గుడారాల ఏర్పాట్లు చేశారు. టెంట్‌లో బస, భోజనానికి సంబంధించిన పూర్తి ఏర్పాట్లు ఉంటాయి. ఇక్కడ ఏదొక టెంట్‌లో ఉంచిన సిలిండర్ పేలడంతో మంటలు చెలరేగినట్లు భావిస్తున్నారు. గుడారాలు ఒక వరుసలో ఏర్పాటు చేయడంతో ప్రమాదం తర్వాత మంటలు ఒకదాని తర్వాత మరొకదానిని చుట్టుముట్టాయి.


ఇప్పటివరకూ అందిన సమాచారం ప్రకారం, ఈ ఘటన జరిగిన ప్రాంతం నుంచిపెద్ద ఎత్తున నల్లటి పొగలు ఎగసిపడుతున్నాయి. సంబంధిత వీడియోలో ఆ దృశ్యాలను చూడవచ్చు. అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేసిన అధికారిక సమాచారం ప్రకారం ఆదివారం ఉదయం 8 గంటల వరకూ 17 లక్షలకు పైగా యాత్రికులు మహాకుంభమేళాను సందర్శించారు.

Breaking..This is an Updating Article..

Updated Date - Jan 19 , 2025 | 05:27 PM