Bomb Threat: బాంబే హైకోర్టుకు సైతం బాంబు బెదిరింపులు, పరుగులు తీసిన సిబ్బంది
ABN , Publish Date - Sep 12 , 2025 | 03:14 PM
ఢిల్లీ హైకోర్టుకు బాంబు బెదిరింపుల అనంతరం ఇవాళ బాంబే హైకోర్టుకూ బాంబు బెదిరింపులు వచ్చాయి. దీంతో, న్యాయవాదులు, ఇతర కోర్టు సిబ్బంది బయటకు పరుగులు తీశారు.
ముంబై (మహారాష్ట్ర), సెప్టెంబర్ 12: ఢిల్లీ హైకోర్టుకు బాంబు బెదిరింపుల అనంతరం ఇవాళ (శుక్రవారం) బాంబే హైకోర్టు(Bombay High Court)కు కూడా బాంబు బెదిరింపులు వచ్చాయి. దీంతో, న్యాయవాదులు, ఇతర కోర్టు సిబ్బందిని కోర్టు ప్రాంగణాన్ని ఖాళీ చేయమని అధికారులు కోరారు. దీనిపై దర్యాప్తు జరుగుతోందని తెలిపారు. బాంబే హైకోర్టు న్యాయవాది మంగళ వాఘే మాట్లాడుతూ.. 'ఈరోజు బాంబే హైకోర్టుకు బాంబు బెదిరింపులు వచ్చాయి. దీంతో కోర్టును ఖాళీ చేశారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు' అని తెలిపారు.
బాంబే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆదేశాల మేరకు కోర్టు ప్రాంగణాన్ని ఖాళీ చేయమని పోలీసులు కోరినట్లు మరో న్యాయవాది తెలిపారు. బాంబు బెదిరింపు హెచ్చరికతో కోర్టు ప్రాంగణం, చుట్టుపక్కల పరిసరాల్లో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. హెచ్చరికలు వచ్చిన వెంటనే హైకోర్టులోని అన్ని బెంచీలు వెంటనే లేచి బయటకు పరుగులు తీశారు. దీంతో కోర్టులో గందరగోళ పరిస్థితులు తలెత్తాయి. న్యాయ మూర్తులు, న్యాయవాదులు, ప్రజలు భయంతో కోర్టు కాంప్లెక్స్ నుంచి బయటకు పరుగులు తీశారు. బాంబు డిస్పోజల్ స్క్వాడ్‌లు సహా భద్రతా దళాలు ఆ ప్రాంతానికి హుటాహుటీన చేరుకుని చర్యలు చేపట్టాయి. ముందు జాగ్రత్త చర్యగా అగ్నిమాపక వాహనాలు, అంబులెన్స్‌లను రంగంలోకి దించారు. స్నిఫర్ డాగ్‌లతో కూడిన బృందాలు కోర్టు ప్రాంగణాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేశాయి.
అటు, ఢిల్లీ హైకోర్టు (Delhi High Court)కు నేడు బాంబు బెదిరింపులు రావడంతో కోర్టు ప్రాంగణంలో టెన్షన్ వాతావరణం నెలకొంది. హైకోర్టులో బాంబులు పెట్టినట్లు సెక్యూరిటీ సిబ్బందికి బెదిరింపు (Bomb Threat) మెయిల్ వచ్చింది. అగంతకులు పంపిన మెయిల్‌లో హైకోర్టు ఆవరణలో మూడు ప్రదేశాల్లో RDX అమర్చినట్లు పేర్కొన్నారు.
బాంబు పెట్టిన నిందితులకు పాక్, ఐసిస్‌తో సంబంధాలున్నట్లు ప్రస్తావించారు. దీంతో ఈ వ్యవహారం మరింత టెన్షన్ క్రియేట్ చేసింది. వెంటనే అలర్ట్ అయిన అధికారులు రంగంలోకి దిగారు. కోర్టు కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేశారు. పోలీసులు, బాంబ్ స్క్వాడ్(Bomb Disposal Squads), డాగ్ స్క్వాడ్ తనిఖీలు నిర్వహిస్తున్నాయి. బాంబు బెదిరింపులతో స్థానిక ప్రజలు సైతం తీవ్ర భయాందోళనకు గురయ్యారు.
అయితే ఇప్పటివరకూ ఎటువంటి అనుమానాస్పద వస్తువును స్వాధీనం చేసుకోలేదు. బెదిరింపు ఈ-మెయిల్ ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసుకోవడానికి, దాని వెనుక ఉన్న వారిని గుర్తించడానికి దర్యాప్తు జరుగుతోందని అధికారులు తెలిపారు. 'పవిత్ర శుక్రవారం పేలుళ్లకు పాకిస్థాన్ కుట్ర పన్నింది. జడ్జి గది/కోర్టు ప్రాంగణంలో 3 బాంబులు అమర్చారు. మధ్యాహ్నం 2 గంటలలోపు ఖాళీ చేయండి. మధ్యాహ్నం ఇస్లామిక్ ప్రార్థనల తర్వాత జడ్జి ఛాంబర్ పేలిపోతుంది' అనే సబ్జెక్ట్‌తో సదరు ఈమెయిల్ ఉంది. పంపినవారి ఈ-మెయిల్ ఐడీ 'kanimozhi.thevidiya@outlook.com' గా గుర్తించారు.
Also Read:
సింగపూర్‌కు ధర్మవరం విద్యార్థినులు
వీళ్ల క్రియేటివిటీ తగలెయ్య.. ఐ ఫోన్‌ను ఎలా సెట్ చేశారో చూస్తే..
For More Latest News