BJP State President: మా కూటమి పటిష్ఠంగానే ఉందిగా..
ABN , Publish Date - Sep 12 , 2025 | 12:26 PM
అన్నాడీఎంకే-బీజేపీ కూటమి ఎలాంటి విభేదాలు లేకుండా పటిష్ఠంగా ఉందని, అసెంబ్లీ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పయనిస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నయినార్ నాగేంద్రన్ మరోమారు స్పష్టంచేశారు.
- బీజేపీ అధ్యక్షుడు నయినార్ నాగేంద్రన్
చెన్నై: అన్నాడీఎంకే-బీజేపీ కూటమి ఎలాంటి విభేదాలు లేకుండా పటిష్ఠంగా ఉందని, అసెంబ్లీ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పయనిస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నయినార్ నాగేంద్రన్(BJP state president Nainar Nagendran) మరోమారు స్పష్టంచేశారు. పరమకుడిలో స్వాతంత్ర సమరయోధుడు ఇమ్మానుయేల్ శేఖరన్ స్మారక మందిరానికి వెళ్లేందుకు గురువారం ఉదయం మదురై చేరుకున్న నయినార్ నాగేంద్రన్ అక్కడ మీడియాతో మాట్లాడారు.
దేశ స్వాతంత్ర కోసం ఆంగ్లేయులతో పోరాడి ప్రాణత్యాగం చేసిన సమరయోధులకు ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం మరింత ఘనత చేకూర్చుతోందని, వారి స్మారక మందిరాల అభివృద్ధికి అవసరమైన నిధులను కూడా మంజూరు చేస్తోందన్నారు. అన్నాడీఎంకేను చీల్చాల్సిన ఆవశ్యకత బీజేపీకి రాలేదని, తాము ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిస్వామి(Edappadi Palaniswami)ని సీఎం అభ్యర్థిగా అంగీకరించామన్నారు.

ప్రధాని, కేంద్రమంత్రులను మర్యాదపూర్వకంగా ఎవ్వరైనా సంప్రదించవచ్చని, ఇటీవల మాజీమంత్రి సెంగోటయ్యన్ అమిత్‌షాను కలవడంలో ఎలాంటి రాజకీయం లేదన్నారు. ప్రధాని మోదీ, కేంద్రహోంమంత్రి అమిత్‌షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తనపట్ల సదాభిప్రాయంతో ఉన్నారని, అందువల్ల రాష్ట్ర బీజేపీ అధ్యక్ష పదవి నుంచి తప్పుకోవాల్సిన అవసరం తనకు రాలేదని నయినార్ నాగేంద్రన్ స్పష్టం చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
967 డిగ్రీ కళాశాలల్లో 2.41 లక్షల సీట్లు
లాకర్ తాళాల కోసం చిత్ర హింసలు పెట్టి..
Read Latest Telangana News and National News