Violent Crime: లాకర్ తాళాల కోసం చిత్ర హింసలు పెట్టి..
ABN , Publish Date - Sep 12 , 2025 | 04:26 AM
ఆ ఇద్దరూ ఇంట్లో పనివాళ్లు.. బంగారం, నగదు దోచుకోవాలని ప్రణాళిక వేశారు.. ఒంటరిగా ఉన్న యజమాని భార్యను...
చెప్పకపోవడంతో కుక్కర్‌తో కొట్టి..అయినా ఆగ్రహం తగ్గక గొంతుకోసి..
రేణు అగర్వాల్ హత్యఘటనలో విస్తుపోయే అంశాలు వెలుగులోకి
హత్య చేసినది ఇంట్లో పనికి కుదిరినవారే..
హైదరాబాద్ సిటీ/ కేపీహెచ్‌బీ కాలనీ, సెప్టెంబరు 11 (ఆంధ్రజ్యోతి): ఆ ఇద్దరూ ఇంట్లో పనివాళ్లు.. బంగారం, నగదు దోచుకోవాలని ప్రణాళిక వేశారు.. ఒంటరిగా ఉన్న యజమాని భార్యను కాళ్లు, చేతులు కట్టేశారు.. లాకర్ తాళం ఎక్కడుందని అడిగారు.. చెప్పకపోవడంతో ఆమెను చిత్రహింసలు పెట్టారు.. ప్రెషర్ కుక్కర్‌తో తలపై మోదారు.. అప్పటికీ నోరు విప్పకపోవడంతో ఆగ్రహంతో గొంతుకోసి పరారయ్యారు. కూకట్‌పల్లిలో జరిగిన రేణు అగర్వాల్ (50) దారుణహత్య కేసులో విస్తుపోయే అంశాలివి. ఆమెను హత్య చేసింది ఇంట్లో పనికి చేరిన హర్ష, రోషన్‌లేనని పోలీసులు నిర్ధారించారు. హత్య తర్వాత వారు యజమాని స్కూటీపైనే హఫీజ్‌పేట రైల్వేస్టేషన్‌కు వెళ్లి, అక్కడ స్కూటీని వదిలేసి రైల్లో పారిపోయినట్టు తేల్చారు.
పక్కాగా ప్లాన్ వేసుకుని..
పశ్చిమబెంగాల్‌కు చెందిన రాకేశ్ అగర్వాల్, రేణు అగర్వాల్ దంపతులు కొన్నేళ్లుగా హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలో ఉంటున్నారు. రాకేశ్ తన సోదరుడితో కలిసి ఫతేనగర్‌లో స్టీల్ హోల్‌సేల్ వ్యాపారం నడిపిస్తున్నారు. రేణు అగర్వాల్ ఇటీవల అనారోగ్యానికి గురవడంతో సర్జరీ జరిగినట్టు తెలిసింది. ఈ క్రమంలో ఆమెకు సహాయంగా ఉండేందుకు కోల్‌కతాకు చెందిన శంకర్ ప్రైవేట్ ఏజెన్సీ ద్వారా.. ఇంట్లో కేర్ టేకర్, వంట మనిషిగా హర్ష అనే యువకుడిని 11 రోజుల క్రితం పనిలో పెట్టుకున్నారు. అదే భవనంలోని మరో అంతస్తులో రాకేశ్ అగర్వాల్ సోదరుడు ఉంటున్నారు. ఆయన ఇంట్లో 9నెలలుగా రోషన్ అనే పనిచేస్తున్నాడు. హర్ష, రోషన్ ఇద్దరూ జార్ఖండ్‌లోని ఒకే ప్రాంతానికి చెందిన స్నేహితులు. అయితే రాకేశ్ అగర్వాల్ స్టీల్ హోల్‌సేల్ వ్యాపారం చేస్తుండటంతో.. వారి ఇంట్లో నగదు, బంగారం ఎక్కువగా ఉంటుందని, అవి దోచుకుందామని హర్ష, రోషన్ ప్లాన్ వేసుకున్నారు. బుధవారం మధ్యాహ్నం రేణు అగర్వాల్ ఒంటరిగా ఉన్న సమయంలో తమ పథకాన్ని అమలు చేశారు. రేణు అగర్వాల్‌ను కట్టేసి.. లాకర్ తాళాలు ఇవ్వాలని, డబ్బు, బంగారం ఎక్కడున్నాయో చెప్పాలని చిత్రహింసలు పెట్టారు. ఆమె చెప్పకపోవడంతో హత్య చేశారు. ఆమె ఒంటిపై ఉన్న బంగారు గొలుసు, కొంత నగదు తీసుకుని పారిపోయారు. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. కోల్‌కతాకు చెందిన శంకర్ ఏజెన్సీని సంప్రదించి, నిందితుల వివరాలు సేకరించారు. వారిని అరెస్టు చేసేందుకు ప్రత్యేక బృందాలను పంపారు. వివిధ ప్రాంతాల్లో స్థిరపడ్డ అగర్వాల్ కుటుంబాల వద్ద వెయ్యి మందిపైగా పనివాళ్లు, కేర్ టేకర్లు, వంటవాళ్లు, డ్రైవర్లు ఈ ఏజెన్సీ ద్వారా పనిచేస్తున్నట్టు తెలిసింది.