Karur Stampede: విజయ్‌కు చేరువయ్యేందుకు బీజేపీ పావులు.. సమీకరణలు మారనున్నాయా..
ABN , Publish Date - Oct 04 , 2025 | 08:38 PM
టీవీకే ఒంటరిగా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తుందని విజయ్ ఇటీవల ప్రకటించారు. అయితే ఇటీవల జరిగిన పరిణామాలతో ఆయన తన రాజకీయ వ్యూహాలలో మార్పులు చేసుకునే అవకాశాలున్నాయని అంటున్నారు.
న్యూఢిల్లీ: తమిళనాడులోని కరూర్‌లో టీవీకే చీఫ్ విజయ్ (Vijay) నిర్వహించిన ర్యాలీలో తొక్కిసలాట అనంతర నేపథ్యంలో రాజకీయ సమీకరణలు వేగంగా మారుతున్నట్టు కనిపిస్తోంది. విజయ్ పార్టీ టీవీకే (TVK)కు చేరువయ్యేంతకు బీజేపీ (BJP) పావులు కదుపుతోందని విశ్వసనీయ వర్గాల సమాచారం. విజయ్‌కు ఉన్న విస్తృతమైన అభిమానుల ఫాలోయింగ్‌ను 2026 అసెంబ్లీ ఎన్నికల్లో ఉపయోగించుకునే ఆలోచనలో బీజేపీ ఉందని అంటున్నారు. ఇందులో భాగంగా విజయ్‌ను డీఎంకే అన్యాయంగా టార్గెట్ చేసినప్పటికీ అతను ఒంటరి అయినట్టు కాదని బీజేపీ సీనియర్ నేత ఒకరు టీవీకే నాయకత్వానికి సంకేతాలు పంపారని తెలుస్తోంది. డీఎంకేను అన్నిరకాలుగా కార్నర్ చేయాలని తాము కూడా కోరుకుంటున్నందున విజయ్‌ను సహనంతో ఉండాలని బీజేపీ సూచించినట్టు చెబుతున్నారు.
కరూర్ తొక్కిసలాట సంక్షోభం అనంతరం విజయ్ భవిష్యత్ పొలిటికల్ ర్యాలీలపై అనిశ్చితి ఏర్పడింది. ఇది తన జీవితంలో ఎన్నడూ చూడని విషాదకర ఘటన అని, ఇది తనను ఎంతో బాధించిదనీ, ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో తనకు బాసటగా నిలిచిన రాజకీయ పార్టీలకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నానని ఇటీవల విజయ్ ఒక వీడియో సందేశంలో పేర్కొన్నారు.
సోలోగానే..
టీవీకే ఒంటరిగా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తుందని విజయ్ ఇటీవల ప్రకటించారు. అయితే ఇటీవల జరిగిన పరిణామాలతో ఆయన తన రాజకీయ వ్యూహాలలో మార్పులు చేసుకునే అవకాశాలున్నాయని అంటున్నారు. ఇక.. అధికార డీఎంకే ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత ఉందని బీజేపీ బలంగా నమ్ముతోంది. ఈ నేపథ్యంలో టీవీకేను కూడా తమతో కలుపుకొని వెళ్లిన పక్షంలో వ్యతిరేక ఓట్లు చీలకుండా గంపగుత్తుగా ఎన్డీయే కూటమికే పడే అవకాశాలు ఉంటాయని విశ్వసిస్తోంది. సెప్టెంబర్ 27 తొక్కిసలాట ఘటన అనంతరం బీజేపీ సారథ్యంలోని ఎన్డీయే బృందం కరూర్‌లో పర్యటించింది. 41 మంది మరణానికి దారితీసిన తొక్కిసలాటకు కేవలం టీవీకేనే తప్పుపట్టడం సరికాదని, ప్రభుత్వ నిర్వహణా లోపాలే ప్రధాన కారణమని బీజేపీ చెబుతోంది.
మరోవైపు తొక్కిసలాటకు తప్పంతా టీవీకేదేనని డీఎంకే చెబుతుండగా, ఇతర పార్టీలు ముఖ్యంగా ఎన్డీయే భాగస్వామ్య పక్షాలు విజయ్ ప్రస్తావన పెద్దగా చేయకుండా.. ఎన్నికైన ప్రభుత్వంగా స్టాలిన్ సారథ్యంలోని డీఎంకే తన బాధ్యత నుంచి తప్పించుకోలేదంటూ విమర్శలు చేస్తున్నాయి. ఇదే సమయంలో అన్నాడీఎంకేతో పొత్తుకు ఎలాంటి అవాంతరం లేకుండా బీజేపీ ఆచితూచి అడుగులు వేస్తోంది. అన్నాడీఎంకే సంస్థాగతంగా బలంగా ఉందని, మంచి క్యాడర్ ఉండని బీజేపీ బలంగా నమ్ముతోంది. విజయ్‌కున్న అభిమానుల బలం తోడయితే దక్షిణాదిలో పట్టు సాధించాలనే ఎన్డీయే ఆశలకు బలం చేకురుతుందని కూడా విశ్వసిస్తోంది.
బ్లేమ్ గేమ్..
కాగా, తొక్కిసలాట ఘటనపై టీవీకే, అధికార డీఎంకే మధ్య 'బ్లేమ్ గేమ్' నడుస్తోంది. చెప్పిన సమయానికి ఏడుగంటలు ఆలస్యంగా సభావేదిక వద్దకు విజయ్ రావడం వల్లే తొక్కిసలాట జరిగి ఘోర విషాదం చోటుచేసుకుందని పోలీసులు ఆరోపిస్తున్నారు. పోలీసుల లాఠీచార్జి కారణంగానే తొక్కిసలాట జరిగిందని విజయ్ పార్టీ ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలో మద్రాసు హైకోర్టు ఈ ఘటనపై సిట్ విచారణకు ఆదేశించింది.
ఇవి కూడా చదవండి..
నక్సల్స్‌తో చర్చల్లేవ్.. లొంగిపోండి.. అమిత్‌షా హెచ్చరిక
సోషల్ మీడియా ట్రోల్స్‌తో జన్‌నాయక్‌లు కాలేరు.. రాహుల్‌పై మోదీ విసుర్లు
Read Latest Telangana News and National News