Share News

PM Modi: సోషల్ మీడియా ట్రోల్స్‌తో జన్‌నాయక్‌లు కాలేరు.. రాహుల్‌పై మోదీ విసుర్లు

ABN , Publish Date - Oct 04 , 2025 | 03:11 PM

నైపుణ్యాలు, నూతన ఆవిష్కరణలతో దేశాన్ని ముందుకు నడిపించే యువశక్తిని సన్నద్ధం చేసేందుకు తమ ప్రభుత్వం కృతనిశ్యంతో ఉందని ప్రధాని మోదీ అన్నారు.

PM Modi: సోషల్ మీడియా ట్రోల్స్‌తో జన్‌నాయక్‌లు కాలేరు.. రాహుల్‌పై మోదీ విసుర్లు
PM Modi

న్యూఢిల్లీ: బీహార్ విద్యా వ్యవస్థలో గణనీయమైన మార్పులు తీసుకువచ్చిన ఘనత ముఖ్యమంత్రి నితీష్ కుమార్, ఎన్డీయే ప్రభుత్వానికి దక్కుతుందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) అన్నారు. ఆర్జేడీ-కాంగ్రెస్ హయాంలో విద్యావ్యవస్థను నిర్లక్ష్యం చేశారని ఆరోపించారు. నైపుణ్యాలు, నూతన ఆవిష్కరణలతో దేశాన్ని ముందుకు నడిపించే యువశక్తిని సన్నద్ధం చేసేందుకు తమ ప్రభుత్వం కృతనిశ్యంతో ఉందన్నారు. సోషల్ మీడియా ట్రోల్స్‌తో ఎవరూ 'జన్‌నాయక్' కాలేరని, ప్రజల ప్రేమాభిమానాలు, గౌరవం చూరగొంటేనే అది సాధ్యమని పరోక్షంగా రాహుల్‌గాంధీపై విమర్శలు గుప్పించారు. రూ.62,000 కోట్ల విలువైన విద్యా ప్రాజెక్టులను ప్రధానమంత్రి బుధవారంనాడిక్కడ నుంచి ప్రారంభించారు.


ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ, బిహార్‌లో నేడు మారుమూల గ్రామాల్లో కూడా పాఠశాలలు ఉన్నాయని, ప్రభుత్వ పాఠశాలలను పునర్నిర్మిస్తూ, ఉన్నత విద్యా సంస్థలను విస్తరిస్తూ, యువకులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తోందన్నారు. ఆర్జేడీ హయాంలో విద్యావకాశాలు లేక ప్రజలు వలసల బాట పట్టేవారని, లెక్కకు మిక్కిలిగా కుటుంబాలు తమ పిల్లలను చదువుల కోసం, పనుల కోసం ఇతర రాష్ట్రాలకు పంపేవారని చెప్పారు. బీహార్ మాజీ ముఖ్యమంత్రి, ఓబీసీల ఆరాధ్యదైవం జననాయక్ కర్పూరి ఠాకూర్ వారసత్వాన్ని ఆపాదించుకునేందుకు కొందరు నేతలు ప్రయత్నిస్తున్నారని, సోషల్ మీడియా ట్రోల్స్‌తో ఎవరూ జన్‌నాయక్‌లు కాలేరని, ప్రజల మనస్సులో స్థిరమైన ముద్ర వేసుకున్న నేతలకే ఆ పేరు చెల్లుతుందని అన్నారు. గత ఏడాది కర్పూరి ఠాకూర్‌కు తమ ప్రభుత్వం భారతరత్న పురస్కారంతో గౌరవించుకుందని, సామాజిక న్యాయం, విద్య ద్వారా సాధికారతకు పాటుపడిన కర్పూరి ఠాకూర్ పేరు చిరస్థాయిగా నిలిపేందుకు బిహార్‌లో జన్ నాయక్ కర్పూర్ ఠాకూర్ స్కిల్ యూనివర్శిటీని ప్రారంభించామని చెప్పారు.


రూ.62,000 కోట్లతో..

ఢిల్లీ విజ్ఞాన్ భవన్‌లో పీఎం-సేతు పథకాన్ని ప్రధాని ప్రారంభించారు. ఇది విద్యార్థుల విద్య, నైపుణ్యాభివృద్ధికి తోడ్పడుతుందని చెప్పారు. ఈ పథకం కింద దేశవ్యాప్తంగా 1,000 ప్రభుత్వ ఐటీఐలను అప్‌గ్రేడ్ చేస్తారు. బిహార్‌లో 'ముఖ్యమంత్రి నిశ్చయ్ స్వయం సహాయతా భట్ట యోజన'ను కూడా ప్రధాని ప్రారంభించారు. ఈ పథకం కింద సుమారు 5 లక్షల మంది గ్రాడ్యుయేట్లకు ఉచిత స్కిల్ ట్రైనింగ్‌తో పాటు రెండేళ్ల పాటు రూ.1,000 చొప్పున అలవెన్స్‌ ఇస్తారు. రీడిజైన్డ్ బిహార్ స్టూడెంట్ క్రెడిట్ కార్డ్ స్కీమ్‌ను కూడా ప్రధాని ఈ సందర్భంగా ప్రారంభించారు. ఈ పథకం కింద విద్యార్థులకు ఉన్నత విద్యాభ్యాసం కోసం రూ.4 లక్షల వరకూ వడ్డీలేని విద్యా రుణాలు ఇస్తారు.


ఐదేళ్లలో రెట్టింపు ఉపాధి

బిహార్ ప్రభుత్వం గత రెండు దశాబ్దాల్లో కల్పించిన ఉద్యోగావకాశాలకు రెట్టింపు ఉద్యోగావకాశాలు రాబోయే ఐదేళ్లలో కల్పించనున్నట్టు ప్రధాని చెప్పారు. ప్రభుత్వం ఇప్పటికే 10 లక్షల శాశ్వత ఉద్యోగాలు, 50 లక్షల మంది యువతకు ఉపాధి కల్పించినట్టు తెలిపారు. బిహార్ ప్రభుత్వం కల్పిస్తున్న పలు పథకాలు, ముఖ్యంగా విద్య, స్కిల్ డవలప్‌మెంట్ అవకాశాలను యువత ఉపయోగించుకుని తమ జీవితాలను, భవిష్యత్తును ఉన్నతంగా తీర్చిదిద్దుకోవాలని కోరారు.


ఇవి కూడా చదవండి..

ఐటీఐలు ఆత్మనిర్భర్ భారత్ వర్క్‌షాప్‌లు: పీఎం మోదీ

పెరిగిన ఆధార్ అప్‌డేట్ ఛార్జీలు.. ఏ సేవకి ఎంత చెల్లించాలంటే

Read Latest Telangana News and National News

Updated Date - Oct 04 , 2025 | 04:00 PM