Share News

Aadhaar Update New Charges: పెరిగిన ఆధార్ అప్‌డేట్ ఛార్జీలు.. ఏ సేవకి ఎంత చెల్లించాలంటే

ABN , Publish Date - Oct 03 , 2025 | 09:26 PM

ప్రతి భారత పౌరుడికి ఆధార్ కార్డు అత్యవసరమైన గుర్తింపుగా మారిపోయింది. ఎందుకంటే బ్యాంకింగ్, సబ్సిడీలు, రేషన్ సహా అనేక స్కీమ్స్ కోసం ఆధార్ కీలకంగా మారింది. అయితే దీని అప్‌డేట్ ఛార్జీలను ఇటీవల పెంచుతున్నట్లు ప్రకటించారు. అవి ఎలా ఉన్నాయో ఇక్కడ తెలుసుకుందాం.

Aadhaar Update New Charges: పెరిగిన ఆధార్ అప్‌డేట్ ఛార్జీలు.. ఏ సేవకి ఎంత చెల్లించాలంటే
Aadhaar Update New Charges

ఆధార్ కార్డు మన దేశంలో ప్రతి పౌరుడికి కీలకమైన గుర్తింపు కార్డుగా ఉంది. కానీ అడ్రస్, ఫోన్ నెంబర్‌ సహా పలు వివరాలు మారితే మాత్రం ఆధార్ డేటాను అప్‌డేట్ (Aadhaar Update New Charges) చేసుకోవాలి. ఇది వరకు దీని సర్వీసులు తక్కువ ధరకే అందుబాటులో ఉండేవి.

కానీ UIDAI (యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా) ఆధార్ అప్‌డేట్ ఛార్జీలను పెంచింది. కొత్త ధరలు అక్టోబర్ 1, 2025 నుంచి అమలులోకి వచ్చాయి. ఈ ధరలు సెప్టెంబర్ 30, 2028 వరకు అమలులో ఉంటాయి. ఈ అప్‌డేట్‌లలో వ్యక్తిగత వివరాలు, వేలిముద్రలు, కంటి స్కాన్, ఫొటో వంటి వివరాల అప్‌డేట్‌ కోసం కొత్త ఫీజులు ఎలా ఉన్నాయనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.


1. వ్యక్తిగత వివరాల అప్‌డేట్

మీ పేరు, చిరునామా, పుట్టిన తేదీ, మొబైల్ నంబర్, మెయిల్ వంటి వ్యక్తిగత వివరాలను మార్చడానికి ఇప్పుడు రూ. 75 చెల్లించాలి. గతంలో ఈ ఫీజు రూ.50 మాత్రమే ఉండేది. ఒకవేళ మీరు బయోమెట్రిక్ అప్‌డేట్‌తోపాటు వ్యక్తిగత వివరాలు అప్‌డేట్ చేస్తే, రూ.75 అదనపు ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.

2. బయోమెట్రిక్

వేలిముద్రలు, కంటి స్కాన్ (ఐరిస్) లేదా ఫొటో వంటి బయోమెట్రిక్ వివరాలను అప్‌డేట్ చేయడానికి ఇప్పుడు రూ.125 చెల్లించాలి. 2028 అక్టోబర్ నుంచి ఈ ఫీజు రూ.150కి పెరుగుతుంది. ఈ అప్‌డేట్‌లు సాధారణంగా ఎన్‌రోల్‌మెంట్ కేంద్రాల్లో చేసుకోవాలి.


3. డాక్యుమెంట్ అప్‌డేట్స్

గుర్తింపు లేదా చిరునామా రుజువు డాక్యుమెంట్లను అప్‌డేట్ చేయడానికి కొన్ని అవకాశాలు ఉన్నాయి. మై ఆధార్ పోర్టల్‌లో జూన్ 14, 2026 వరకు ఈ అప్‌డేట్లు ఉచితం. అంటే ఆన్‌లైన్‌లో డాక్యుమెంట్లను అప్‌లోడ్ చేస్తే ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. ఎన్‌రోల్‌మెంట్ కేంద్రాలలో మీ డాక్యుమెంట్ అప్‌డేట్‌కు రూ. 75 చెల్లించాలి (గతంలో రూ. 50).

4. ఆధార్ ప్రింటౌట్ ఫీజు

ఆధార్ కార్డు ప్రింటౌట్ తీసుకోవడానికి లేదా ఈ-కేవైసీ ద్వారా వివరాలను పొందడానికి ఇప్పుడు రూ.40 చెల్లించాలి. రెండో దశలో (2028 అక్టోబర్ నుంచి) ఈ ఫీజు రూ.50కి పెరుగుతుంది.


పిల్లలకు ఉచిత బయోమెట్రిక్ అప్‌డేట్స్

  • పిల్లల ఆధార్ వివరాలను సకాలంలో అప్‌డేట్ చేయడాన్ని ప్రోత్సహించడానికి UIDAI కొన్ని ఫీజులను మాఫీ చేసింది

  • 5-7 సంవత్సరాలు & 15-17 సంవత్సరాల వయస్సు గల పిల్లలకు మొదటి బయోమెట్రిక్ అప్‌డేట్ ఉచితం

  • 7-15 సంవత్సరాల వయస్సు వారికి బయోమెట్రిక్ అప్‌డేట్‌కు రూ.125 ఫీజు ఉంటుంది. కానీ 2026 సెప్టెంబర్ 30 వరకు ఈ ఫీజు మాఫీ చేయబడింది.

హోమ్ ఎన్‌రోల్‌మెంట్ ఛార్జీలు

  • కొందరు వ్యక్తులు ఎన్‌రోల్‌మెంట్ సెంటర్లకు వెళ్లలేని పరిస్థితుల్లో ఉంటారు. అలాంటి వారి కోసం UIDAI హోమ్ ఎన్‌రోల్‌మెంట్ సేవలను కూడా అందిస్తోంది

  • ఒక వ్యక్తికి హోమ్ ఎన్‌రోల్‌మెంట్ కోసం రూ.700 (GSTతో సహా) చెల్లించాలి.

  • ఒకే చిరునామాలో ఒకరి కంటే ఎక్కువ మంది ఈ సేవను ఉపయోగించినట్లయితే, అదనపు వ్యక్తికి రూ.350 చెల్లించాలి.

ఎందుకు ఈ ఫీజులు పెరిగాయి?

ఆధార్ సేవలను నిర్వహించడానికి, ఎన్‌రోల్‌మెంట్ కేంద్రాలన నడపడానికి, సాంకేతిక వ్యవస్థలను అప్‌డేట్ చేయడానికి UIDAIకి ఖర్చులు ఉంటాయి. ఈ ఖర్చులను భర్తీ చేయడానికి ఫీజులను సవరించినట్లు తెలుస్తోంది.


ఇవి కూడా చదవండి

మరో స్కామ్‌ అలర్ట్.. మీ డబ్బు, ఫోన్‌ను ఇలా కాపాడుకోండి

రూ.485కే 72 రోజుల ప్లాన్..అన్‌లిమిటెడ్ కాలింగ్, 2 జీబీ డేటా

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Oct 03 , 2025 | 09:52 PM