Khagen Murmu Attacked: జల్‌పాయ్‌గురిలో బీజేపీ ప్రతినిధి బృందంపై దాడి.. గాయపడిన ఎంపీ
ABN , Publish Date - Oct 06 , 2025 | 03:46 PM
సహాయక చర్యలు పర్యవేక్షించేందుకు వెళ్తున్న తమ పార్టీ ప్రతినిధి బృందంపై దాడి వెనుక తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ఉందని బీజేపీ ఐటీ సెల్ చీఫ్ అమిత్ మాలవీయ ఆరోపించారు.
కోల్‌కతా: పశ్చిమబెంగాల్ (West Bengal)లో భారీ వర్షాలు, వరదలు సంభవించడంతో సహాయక చర్యలను పర్యవేక్షించేందుకు వెళ్లిన బీజేపీ ప్రతినిధి బృందం (BJP delegation) పై సోమవారంనాడు దాడి జరిగింది. జల్‌పాయ్‌గురి జిల్లాలో బీజేపీ ప్రతినిధుల కాన్వాయ్‌పై కొందరు గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేశారు. ఈ దాడిలో మాల్దా ఉత్తర్ ఎంపీ ఖగెన్ ముర్ము (Khagen Murmu) తీవ్రంగా గాయపడ్డారు. సిలిగురి ఎమ్మెల్యే శంకర్ ఘోష్ సైతం గాయపడ్డారు. వీరిని చికిత్స కోసం స్థానిక ఆసుపత్రికి తరలించారు. దాడిలో ఈ ఇద్దరు నేతలు ప్రయాణిస్తున్న వాహనాలు సైతం దెబ్బతిన్నాయి.
టీఎంసీ పనే: బీజేపీ
సహాయక చర్యలు పర్యవేక్షించేందుకు వెళ్తున్న తమ పార్టీ ప్రతినిధి బృందంపై దాడి వెనుక తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ఉందని బీజేపీ ఐటీ సెల్ చీఫ్ అమిత్ మాలవీయ ఆరోపించారు. 'టీఎంసీ గూండాలు నార్త్ మాల్దాకు రెండుసార్లు ఎంపీగా ఉన్న ఖగెన్ ముర్ముపై దాడి చేశారు. కోల్‌కతా కార్నివాల్‌లో మమతా బెనర్జీ మునిగిపోయారు. టీఎంసీ, రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం ఏమాత్రం వరద సహాయక చర్యలను పట్టించుకోవడం లేదు. బీజేపీ నేతలు, కార్యకర్తలు మాత్రమే బాధితులను ఆదుకుంటున్నారు. టీఎంసీ బెంగాల్‌లో క్రూరత్వం రాజ్యమేలుతోంది' అని సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో ఆయన పేర్కొన్నారు.
ఖగెన్ ముర్ము ఎవరు?
మాల్దా ఉత్తర్ లోక్‌సభ నియోజకవర్గానికి ఎంపీగా ఆయన రెండోసారి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 2006 నుంచి 2019 వరకూ హబీబ్‌పూర్ నియోజకవర్గం ఎమ్మెల్యేగా ఆయన సేవలందించారు. నిజానికి ఆయన సీపీఎం సభ్యుడైనప్పటికీ 2019లో ఆయన పార్టీని విడిచిపెట్టారు. ఆ తర్వాత బీజేపీలో చేరారు.
ఇవి కూడా చదవండి..
సుప్రీంకోర్టులో అనూహ్య ఘటన.. సీజేఐపై చెప్పుతో దాడికి లాయర్ యత్నం
జైపూర్ ప్రమాదంపై అమిత్ షా విచారం, సిబ్బంది నిర్లక్ష్యం వల్లేనని బాధితుల మండిపాటు
Read Latest Telangana News and National News