Supreme Court: సుప్రీంకోర్టులో అనూహ్య ఘటన.. సీజేఐపై చెప్పుతో దాడికి లాయర్ యత్నం
ABN , Publish Date - Oct 06 , 2025 | 02:44 PM
హిందూ దేవుళ్లపై సీజేఐ చేసిన వ్యాఖ్యలే ఈ దాడికి దారితీసి ఉండవచ్చని సుప్రీంకోర్టు న్యాయవాది రోహిత్ పాండే తెలిపారు. దాడి యత్నాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని, నిందితునిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు (Supreme Court)లో సోమవారం నాడు అనూహ్య ఘటన చోటుచేసుకుంది. ప్రధాన న్యాయమూర్తి (CJI) బీఆర్ గవాయ్ (BR Gavai)పై లాయర్ ఒకరు చెప్పుతో దాడికి యత్నించారు. తోటి లాయర్లు అడ్డుకుని అతనిని పోలీసులకు అప్పగించారు. నిందితుని న్యాయవాది రాకేష్ కిషోర్‌గా గుర్తించారు. ఈ ఘటనకు ముందు 'సనాతన ధర్మాన్ని కించపరిస్తే సహించేది లేదు' అని లాయర్ కేకలు వేయడం కనిపించింది. అయితే ఇలాంటి వాటికి తాను భయపడేది లేదని ఘటన అనంతరం సీజేఐ అన్నారు. యథాప్రకారం కోర్టు ప్రొసీడింగ్స్ కొనసాగించారు. నిందితుడిని ఢిల్లీ డీసీపీ, సుప్రీంకోర్టు భద్రతా అధికారులు ప్రస్తుతం ప్రశ్నిస్తున్నారు.
హిందూ దేవుళ్లపై సీజేఐ చేసిన వ్యాఖ్యలే ఈ దాడికి దారితీసి ఉండవచ్చని సుప్రీంకోర్టు న్యాయవాది రోహిత్ పాండే తెలిపారు. దాడి యత్నాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని, నిందితునిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.
గవాయ్ ఏమన్నారు?
జవారి ఆలయంలోని ఏడడుగులు విష్ణుమూర్తి విగ్రహాన్ని పునర్నిర్మించి, పునఃప్రతిష్టించేలా ఆదేశించాలని కోరుతూ వేసిన ఒక పిటిషన్‌ను సెప్టెబర్ 16న సీజేఐ తోసిపుచ్చారు. ఇది ప్రచారం కోసం వేటిన పిటిషన్‌గా ఆయన పేర్కొన్నారు. 'ఇది కచ్చితంగా పబ్లిసిటీ ఇంట్రెస్ట్ లిటిగేషన్. ఏదైనా చేయమని ఆయననే వెళ్లి అడగండి. ఇది చేస్తే మీరు విష్ణువుకు మంచి భక్తుడనిపించుకుంటారు. ఆయనను ప్రార్థించి, మెడిటేషన్ చేయండి' అని సీజేఐ పేర్కొన్నట్టు తెలుస్తోంది. ఇది పూర్తిగా భారత పురావస్తు పరిశోధనా సంస్థ (ASI) పరిధిలోకి వస్తుందని, ఏఎస్ఐ అనుమతి ఇస్తుందో లేదో తెలియదని సీజేఐ అన్నారు. 'ఈలోపు మీరు శైవానికి వ్యతిరేకం కాకుంటే అక్కడికి వెళ్లి ప్రార్థించండి. అక్కడ చాలా పెద్ద శివలింగం ఉంది. అది ఖజరహోలోనే అతిపెద్దది' అని సీజేఐ వ్యాఖ్యానించారు. కాగా, ఆయన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో దుమారం రేపాయి. అయితే తన వ్యాఖ్యలను వక్రీకరించారని, అన్ని మతాలను తాను గౌరవిస్తానని సీజేఐ ఆ తర్వాత వివరణ ఇచ్చారు.
ఇది కూడా చదవండి..
జైపూర్ ప్రమాదంపై అమిత్ షా విచారం, సిబ్బంది నిర్లక్ష్యం వల్లేనని బాధితుల మండిపాటు
ఆస్పత్రి ఐసీయూలో అగ్ని ప్రమాదం.. 6 మంది పేషంట్లు మృతి..
Read Latest Telangana News and National News