Bihar Assembly Elections: బిగ్ బ్రదర్ ఎవరూ లేరు... ఆ రెండు పార్టీలకు చెరి సగం
ABN , Publish Date - Oct 07 , 2025 | 05:20 PM
చిరాగ్ పాశ్వాన్ ఎల్‌జేపీకి 25 సీట్లు, హెచ్ఏఎం నేత జితిన్ రామ్ మాంఝీకి 7 సీట్లు, ఉపేంద్ర కుష్వాహ ఆర్ఎల్ఎంకు 6 సీట్లు బీజేపీ ఆఫర్ చేసినట్టు చెబుతున్నారు. తమ పార్టీ నేతలకు నిర్దిష్ట నియోజకవర్గాలు కేటాయించాలని చిరాగ్ పాశ్వాన్ కోరుతుండటంతో చర్చలు కొనసాగుతున్నాయి.
పాట్నా: బిహర్ అసెంబ్లీ ఎన్నికల (Bihar Assembly Elections) తేదీలను ఎన్నికల కమిషన్ ప్రకటించడంతో ఎన్డీయే (NDA)లో సీట్ల షేరింగ్ ఫార్ములాపై ఆసక్తి నెలకొంది. కీలక భాగస్వామ్య పక్షాలైన జేడీయూ (JDU), బీజేపీ (BJP)లు ఎక్కువ తక్కువల ప్రసక్తి లేకుండా సమంగా సీట్లు పంచుకుని సమష్టిగా పోటీకి దిగుతాయని ఆయా పార్టీ వర్గాల సమాచారం. ప్రస్తుతం సీట్ల షేరింగ్‌కు సంబంధించిన చర్చలు జరుగుతున్నాయని, ఎన్ని సీట్లలో పోటీ చేస్తారనే దానిపై త్వరలోనే తుది నిర్ణయం ఉంటుందని చెబుతున్నారు. మొత్తం 243 సీట్లకు గాను 205 సీట్లను బీజేపీ-జేడీయూ సమంగా పంచుకుంటాయని, తక్కిన 38 సీట్లు ఎన్డీయే భాగస్వామ్య పక్షాలైన లోక్ జన్‌శక్తి పార్టీ (LJP), హిందుస్థానీ అవామ్ మోర్చా (HAM), రాష్ట్రీయ లోక్ సమత పార్టీ (RLM)కు కేటాయించనున్నాయని తెలుస్తోంది.
చిరాగ్ పాశ్వాన్ ఎల్‌జేపీకి 25 సీట్లు, హెచ్ఏఎం నేత జితిన్ రామ్ మాంఝీకి 7 సీట్లు, ఉపేంద్ర కుష్వాహ ఆర్ఎల్ఎంకు 6 సీట్లు బీజేపీ ఆఫర్ చేసినట్టు చెబుతున్నారు. తమ పార్టీ నేతలకు నిర్దిష్ట నియోజకవర్గాలు కేటాయించాలని చిరాగ్ పాశ్వాన్ కోరుతుండటంతో చర్చలు కొనసాగుతున్నాయి. మరిన్ని సీట్లకు కూడా ఆయన పట్టుబడుతున్నారు. ఎల్‌జేపీకి మరిన్ని సీట్లు కేటాయిస్తే మాంఝీ, కుష్వాహలకు తక్కువ కేటాయింపులు జరుగుతాయి. చిన్న భాగస్వామ్య పార్టీలకు సీట్లు తగ్గితే వారికి రాజ్యసభ, లెజిస్లేటివ్ కౌన్సిల్ సీట్లు ఇస్తామని బీజేపీ ఆఫర్ చేసే అవకాశముందని చెబుతున్నారు.
ఎన్నికల కమిషన్ నవంబర్ 6, 11 తేదీల్లో రెండు విడతలుగా పోలింగ్ ప్రక్రియను ప్రకటించింది. నవంబర్ 14న ఫలితాలు వెల్లడవుతాయి. ప్రస్తుత అసెంబ్లీ గడువు నవంబర్ 22తో ముగియనుండటంతో ఈలోపు ఎన్నికలు పూర్తిచేయడం ద్వారా సజావుగా అధికార మార్పిడి జరిగేందుకు ఈసీ పట్టుదలగా ఉంది. బిహార్ తొలి విడత పోలింగ్ గ్రామీణ, వరద ప్రభావిత ప్రాంతాలతో సహా సెంట్రల్ బిహార్‌లోని 121 నియోజకవర్గాల్లో జరుగనుండగా, రెండో విడతలో 122 నియోజకవర్గాలకు పోలింగ్ జరుగుతుంది. ఈ విడతలో ప్రధానంగా సరిహద్దు ప్రాంతాలు ఉన్నాయి. నితీష్ కుమార్ సారథ్యంలోని ఎన్డీయే, ఆర్జేడీ సారథ్యంలోని 'ఇండియా' కూటమి మధ్య ప్రధాన పోటీ ఉండే అవకాశాలుండగా, ప్రశాంత్ కిషోర్ 'జన్ సురాజ్' సైతం ఎన్నికల బరిలో ఉంది. తొలిసారి ఆమ్ ఆద్మీ పార్టీ సైతం బిహార్‌లోని 243 నియోజకవర్గాల్లో పోటీకి సిద్ధమవుతోంది.
ఇవి కూడా చదవండి..
ఏడాది తర్వాత కేజ్రీవాల్‌కు ప్రభుత్వ బంగ్లా కేటాయింపు
కరూర్ తొక్కిసలాట ఘటనపై సుప్రీంకోర్టులో పిటిషన్..
Read Latest Telangana News and National News