Bihar Pind Daan Politics : బీహార్ ఎన్నికల్లో 'పిండ ప్రదానం' పాలిటిక్స్
ABN , Publish Date - Sep 10 , 2025 | 05:06 PM
బీహార్‌లో వింత రాజకీయాలు నడుస్తున్నాయి. నరేంద్ర మోదీ, గయాలో చేయబోతున్న 'పిండ ప్రదానం'.. నితీష్ కుమార్ రాజకీయ జీవితానికి 'పిండ ప్రదానం' చేయడానికే అంటూ లాలూ ప్రసాద్ యాదవ్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
గయా(బీహార్) సెప్టెంబర్ 10 : బీహార్‌లో ఎన్నికలు సమీపిస్తున్న వేళ పితృదేవతలకి సమర్పించే 'పిండ ప్రదానం' మీద కూడా రాజకీయాలు నడుస్తున్నాయి. ఇదే అంశాన్ని విమర్శనాస్త్రంగా చేసుకుని బీహార్‌లోని రాష్ట్రీయ జనతా దళ్ (RJD) అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్, ప్రధాని నరేంద్ర మోదీపై తీవ్ర విమర్శలకు దిగారు. ప్రధాని మోదీ గయాలో తన మాతృమూర్తికి చేయదల్చిన ‘పిండ ప్రదానం’ కార్యక్రమం మీద లాలూ యాదవ్ విమర్శలు గుప్పించారు.
ఇది.. జనతా దళ్ (యునైటెడ్) అధ్యక్షుడు నీతీష్ కుమార్ రాజకీయ జీవితానికి ‘పిండ ప్రదానం’ చేయడానికి ఉద్దేశించిందంటూ లాలూ యాదవ్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు బీహార్ రాజకీయ వాతావరణాన్ని మరింత వేడెక్కిస్తున్నాయి. కాగా, ప్రధాని నరేంద్రమోదీ తన పుట్టిన రోజైన సెప్టెంబర్ 17వ తేదీన తల్లి దివంగత మీరాబెన్‌కి గయాలో పిండప్రదానం చేయాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే లాలూ యాదవ్ ఈ వ్యాఖ్యలు చేశారు.
లాలూ ప్రసాద్ యాదవ్ సోషల్ మీడియా మాధ్యమం ఎక్స్‌లో ఒక వీడియో షేర్ చేస్తూ, మోదీపై 'ఓట్ చోరీ' ఆరోపణలు చేశారు. గయాలో మోదీ 13,000 కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసి, రెండు రైళ్లను జెండా ఊపి ప్రారంభించండం ఓట్ చోరీలో భాగమేనని లాలూ యాదవ్ ఆరోపించారు. మోదీ రాష్ట్రంలో ఎన్నికల ముందు రాజకీయ లబ్ధి పొందేందుకు పలు రకాలుగా ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. తల్లికి గయాలో పిండ ప్రదానం కూడా ఇలాంటిదేనన్నారు.'పిండ ప్రదానం' అనే హిందూ సంప్రదాయాన్ని రాజకీయ కోణంలో ఉపయోగించడం ద్వారా మోదీ, బీహార్ లో కొత్త రాజకీయాలు చేస్తున్నారని లాలూ ప్రసాద్ యాదవ్ ఎద్దేవా చేశారు. నితీష్ కుమార్‌ను బీజేపీ, తన నీడలోకి లాగేసుకుందని కూడా లాలూ యాదవ్ అన్నారు.
కాగా, ఈ వివాదం బీహార్ ఎన్నికల్లో ఎన్డీయే (BJP-JDU), RJD-కాంగ్రెస్ మహాగఠబంధన్ మధ్య మరింత రాజకీయ వేడిని రేకెత్తించింది. బీహార్ ఎన్నికల్లో మహిళలు, ముస్లిం ఓటర్లు, కుల గణాంకాలు కీలక పాత్ర పోషిస్తాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. తాజా పొలిటికల్ డ్రామా బీహార్‌లో ఎన్నికల యుద్ధాన్ని మరింత ఆసక్తికరంగా మార్చింది. ఇక్కడ సాంప్రదాయం, రాజకీయాలు ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నాయి.

ఈ వార్తలు కూడా చదవండి..
భారీగా పెరిగిన బంగారం ధర.. ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
సీఎం రేవంత్ ఇంటి ప్రహరీ కూల్చివేత
Read Latest Telangana News and National News