Share News

Punaura Dham Janki Mandir: సీతమ్మ వారి ఆలయానికి రూ.882 కోట్లు

ABN , Publish Date - Jul 01 , 2025 | 09:46 PM

సీతమ్మ వారి జన్మస్థలమైన పునౌరా థామ్ సీతామఢి సర్వోతోముఖాభివృద్ధికి రూ.882.87 కోట్లతో సమగ్ర ప్లాన్‌కు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలపడం చాలా సంతోషంగా ఉందని నితీష్ కుమార్ సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో తెలిపారు.

Punaura Dham Janki Mandir: సీతమ్మ వారి ఆలయానికి రూ.882 కోట్లు

పాట్నా: అయోధ్యలో భవ్య రామాలయ నిర్మాణానికి దీటుగా సీతమ్మ వారి జన్మస్థలమైన బీహార్‌ (Bihar)లోని సీతామఢీ జిల్లా (Sitamarhi district)లో 'జానకీ మందిర్' నిర్మాణం జరగాలన్న బీహార్ వాసుల ఆకాంక్షలను ముఖ్యమంత్రి నితీష్ కుమార్ (Nitish Kumar) ప్రభుత్వం సాకారం చేయనుంది. ఈ దిశగా నితీష్ అధ్యక్షతన మంగళవారంనాడు జరిగిన మంత్రివర్గం సమావేశంలో కీలక నిర్ణయం తీసుకుంది. 'జానకి మందిర్' సమగ్ర అభివృద్ధికి రూ.882 కోట్లు వెచ్చించే ప్రతిపాదనకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది.


సీతమ్మ వారి జన్మస్థలమైన పునౌరా థామ్ సీతామఢి సర్వోతోముఖాభివృద్ధికి రూ.882.87 కోట్లతో సమగ్ర ప్లాన్‌కు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలపడం చాలా సంతోషంగా ఉందని నితీష్ కుమార్ సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో తెలిపారు. ప్లాన్‌లో భాగంగా భవ్య మందిరం, ఇతర కట్టడాల నిర్మాణం ఉంటుందన్నారు. ఆగస్టులో ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన జరుగుతుందని, అధికారులకు ఈ మేరకు ఆదేశాలిచ్చామని చెప్పారు. సాధ్యమైనంత త్వరగా పునౌరా థామ్ సీతామఢిలో భవ్య ఆలయ నిర్మాణం పూర్తి చేయడానికి కట్టుబడి ఉన్నామని తెలిపారు. అయోధ్యలోని శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర్ తరహాలోనే ఈ ఆలయ నిర్మాణం కూడా ఉంటుందని వివరించారు. మాతా జానకీ మందిర నిర్మాణం దేశ ప్రజలకు, ముఖ్యంగా బీహార్ ప్రజలకు గర్వకారణంగా నిలుస్తుందని అన్నారు.


కాగా, కేబినెట్ ఆమోదించిన ప్లాన్ వివరాలను పర్యాటక శాఖ వివరిస్తూ, మొత్తం అంచనా వ్యయంలో రూ.137కోట్లు సీతమ్మ వారి పాత మందిరం పునరుద్ధరణ వెచ్చిస్తారని, ఆలయం చుట్టూ మౌలిక సదుపాయల అభివృద్ధికి రూ.728 కోట్లు ఖర్చు చేయనున్నారని తెలిపింది. తక్కిన మొత్తాన్ని పదేళ్ల పాటు మౌలిక సదుపాయాల మెయింటనెన్స్‌కు వెచ్చిస్తారని పేర్కొంది. సీతామఢి జిల్లాకు పశ్చిమంగా 5 కిలోమీటర్లదూరంలో పునౌరా థామ్ ఉంది. మందిర అభివృద్ధి పథకం ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రాంతంలో 'సీతా-వాటిక', 'లవ కుశ వాటిక'ను అభివృద్ధి చేయనుంది. పరిక్రమ మార్గ్‌, కేఫటేరియా, పిల్లలకు ఆటస్థలం వంటి సౌకర్యాలను ఏర్పాటు చేయనుంది. ఈ ఏడాది అక్టోబర్-నవంబర్‌లో బీహార్ అసెంబ్లీ ఎన్నికల జరుగనున్న తరుణంలో నితీష్ సర్కార్ తాజా నిర్ణయం ప్రాధాన్యతను సంతరించుకుంది.


ఇవి కూడా చదవండి..

సిద్ధరామయ్య సర్కార్‌కు ఎదురుదెబ్బ.. సీబీఐ దర్యాప్తునకు హైకోర్టు ఆదేశం

వన్ వరల్డ్ వన్ ఫ్యామిలీ మిషన్‌కు ఏఆర్ రెహమాన్ ప్రత్యేక గీతం.. సాయి సంఫనీ ఆర్కెస్ట్రా‌పై ప్రశంసలు

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jul 01 , 2025 | 09:49 PM