Share News

Azam Khan: 23 నెలల తర్వాత జైలు నుంచి విడుదలైన ఆజంఖాన్

ABN , Publish Date - Sep 23 , 2025 | 02:47 PM

ఆజంఖాన్‌ను జైలు బయట రిసీవ్ చేసుకునేందుకు ఆయన కుమార్ అదీబ్ ఆజంఖాన్, పెద్దఎత్తున మద్దతుదారులు ఉదయం 9 గంటలకు జైలు గేట్ల దగ్గరకు చేరుకున్నారు. అయితే వారిని బయటే వేచిచూడాలని పోలీసులు అధికారులు చెప్పారు.

Azam Khan: 23 నెలల తర్వాత జైలు నుంచి విడుదలైన ఆజంఖాన్
Azam Khan

సీతాపూర్: సమాజ్‌వాదీ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎంపీ ఆజంఖాన్ (Azam Khan) ఉత్తరప్రదేశ్ సీతాపూర్ జైలు నుంచి మంగళవారంనాడు విడుదలయ్యారు. 23 నెలలు జైలులో గడిపిన అనంతరం బెయిలుపై ఆయన బయటకు వచ్చారు. షెడ్యూల్ ప్రకారం ఉదయం 9 గంటలకే ఆయన విడుదల కావాల్సి ఉన్నప్పటికీ లీగల్ ప్రక్రియ కారణంగా జాప్యం తలెత్తింది. కోర్టు విధించిన జరిమానా కట్టకపోవడంతో జాప్యం తలెత్తినట్టు జైలు అధికారులు తెలిపారు.


ఆజంఖాన్‌ను రిసీవ్ చేసుకునేందుకు ఆయన కుమార్ అదీబ్ ఆజంఖాన్, పెద్దఎత్తున మద్దతుదారులు ఉదయం 9 గంటలకు జైలు గేట్ల దగ్గరకు చేరుకున్నారు. అయితే వారిని బయటే వేచిచూడాలని పోలీసులు అధికారులు చెప్పారు. ఉదయం పేపర్ వర్క్ సమయంలో రాంపూర్ కోర్టులో పెండింగ్‌లో ఉన్న కేసుకు సంబంధించి ఆయన జరిమానా చెల్లించలేదని అధికారులు గుర్తించారు. ఆ కేసులో రెండు సెక్షన్ల కింద రూ.3,000, రూ.5,000 జరిమానా పడింది. ఉదయం 10 గంటలకు రాంపూర్ కోర్టు తెరిచిన వెంటనే జరిమానా కట్టి, ఆ విషయాన్ని ఫ్యాక్స్ ద్వారా సీతాపూర్‌ జైలుకు తెలియజేయడంతో ఆజంఖాన్ జైలు బయటకు వచ్చారు. ఖాన్ విడుదలకు ముందు సీతాపూర్ సిటీలో సెక్షన్ 144 విధించారు.


అలహాబాద్ హైకోర్టు బెయిలు

క్వాలిటీ బార్ భూఆక్రమణ కేసులో ఈనెల 18న అలహాబాద్ హైకోర్టు ఆజంఖాన్‌కు బెయిలు మంజూరు చేసింది. రాంపూర్ దుంగార్‌పూర్ కాలనీలో నివాసులను బలవంతంగా ఖాళీచేయించారనే ఆరోపణకు సంబంధించిన మరో కేసులో కూడా సెప్టెంబర్ 10న ఆయనకు హైకోర్టు బెయిలు ఇచ్చింది. కాగా, రోడ్డు దిగ్బంధం, ప్రజాఆస్తుల విధ్వంసానికి సంబంధించిన 17 ఏళ్ల క్రితం నాటి కేసులో ఆజంఖాన్‌ను ఎంపీ-ఎమ్మెల్యే కోర్టు నిర్దోషిగా ఈ ఏడాది మొదట్లో ప్రకటించింది. జస్వంత్‌పూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఆరుసార్లు ఎన్నికైన ఆజంఖాన్ బహుజన్ సమాజ్ వాదీ పార్టీలో చేరుతారనే ఊహాగానాలు ఉన్నాయి. అయితే అవన్నీ అబద్ధాలేనని, సమాజ్‌వాదీ పార్టీ పూర్తిగా తనవెంటనే ఉందని ఆయన తెలిపారు.


ఇవి కూడా చదవండి..

ప్రముఖ నటుల నివాసంలో కస్టమ్స్ అధికారులు సోదాలు..

మోదీ ‘స్వదేశీ’ పిలుపు.. జోహోకు మారిన కేంద్ర మంత్రి..

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Sep 23 , 2025 | 02:49 PM