Kejriwal Dare To PM: మోదీజీ ధైర్యం ఉంటే.. ట్రంప్ సుంకాలపై కేజ్రీవాల్
ABN , Publish Date - Sep 07 , 2025 | 07:33 PM
అమెరికా కాటన్ దిగుమతులపై 2025 డిసెంబర్ 31 వరకూ 11 శాతం ఎక్సైజ్ డ్యూటీని మినహాయిస్తూ మోదీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని కేజ్రీవాల్ తప్పుపట్టారు. ఈ చర్యతో స్థానిక రైతులు ప్రతికూల పరిణామాలు ఎదుర్కొంటారని, అమెరికా రైతులు సంపన్నులు అవుతారని అన్నారు.
న్యూఢిల్లీ: భారత్ వస్తువులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన 50 శాతం సుంకాలకు భారత్ గట్టి జవాబివ్వాలని ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) అన్నారు. ట్రంప్ 50 శాతం సుంకాలకు ప్రతిగా అమెరికా నుంచి వచ్చే దిగుమతులపై 75 శాతం సుంకాలు విధించడం ద్వారా ప్రధాని తన ధైర్యం చాటుకోవాలని అన్నారు.
'ప్రధాని మంత్రి కాస్త ధైర్యం చూపించాలని మేము కోరుతున్నాం. యావద్దేశం మీకు బాసటగా నిలుస్తుంది. ఇండియా ఎగుమతులపై అమెరికా 50 శాతం సుంకాలు విధించింది. మీరు అమెరికా నుంచి వచ్చే దిగుమతులపై 75 శాతం సుంకం విధించండి. దేశం ఇందుకు సిద్ధంగా ఉంది. మీరు సుంకం విధిస్తే చాలు. అప్పుడు ట్రంప్ దిగివస్తారో లేదో చూడండి' అని కేజ్రీవాల్ ఆదివారంనాడిక్కడ మీడియాతో మాట్లాడుతూ అన్నారు.
కాటన్‌పై నిర్ణయం తప్పు
అమెరికా కాటన్ దిగుమతులపై 2025 డిసెంబర్ 31 వరకూ 11 శాతం ఎక్సైజ్ డ్యూటీని మినహాయిస్తూ మోదీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని కేజ్రీవాల్ తప్పుపట్టారు. ఈ చర్యతో స్థానిక రైతులు ప్రతికూల పరిణామాలు ఎదుర్కొంటారని, అమెరికా రైతులు సంపన్నులు అవుతారని అన్నారు. అమెరికా కాటన్ ఇక్కడకు వస్తే ఇక్కడి రైతులకు మార్కెట్‌లో రూ.900 కంటే తక్కువ వస్తుందని, అమెరికాలో రైతుల సంపన్నులు అవుతారని, గుజరాత్ రైతులు పేదలుగా మారుతారని అన్నారు. అక్టోబర్-నవంబర్ పంట సీజన్‌లో సరైన రేటుకు రైతులు మార్కెట్లో తమ ఉత్పత్తులను అమ్ముకోలేరని అన్నారు. రుణభారంతో రైతులు ఆత్మహత్యలకు పాల్పడే అవకాశాలుంటాయని హెచ్చరించారు.
కాటన్‌పై 100 శాతం టారిఫ్ విధించాలని, అప్పుడు ట్రంప్ దిగివస్తారని అన్నారు. ట్రంప్‌ను పిరికివాడని కూడా కేజ్రీవాల్ అభివర్ణించారు. అమెరికా కాటన్ దిగుమతులపై తిరిగి 11 శాతం డ్యూటీ విధించాలని డిమాండ్ చేసారు. దీనికి తోడు మన రైతులకు కనీస మద్దతు ధర ప్రకటించాలని, రైతులకు ఆర్థిక సాయం అందించాలని అన్నారు. అమెరికా సుంకాల ప్రభావం వ్యవసాయ రంగంపైనే కాకుండా ఇండియాలోని డైమండ్ వర్కర్లపైన కూడా ఉంటుందన్నారు.
ఇవి కూడా చదవండి..
నోట్లో యాసిడ్ పోస్తా.. బీజేపీ నేతపై రెచ్చిపోయిన టీఎంసీ ఎమ్మెల్యే
ప్రజ్వల్ రేవణ్ణకు జైలులో పని, వేతనం ఎంతంటే
For More National News And Telugu News