Anna Hazare: జనవరి 30 నుంచి నిరాహార దీక్ష.. ప్రకటించిన అన్నా హజారే
ABN , Publish Date - Dec 12 , 2025 | 05:48 PM
లోకాయుక్త చట్టం క్షేత్రస్థాయిలో అమలు కావడం లేదంటూ సామాజిక కార్యకర్త అన్నా హజారే తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ విషయంపై మహారాష్ట్ర ప్రభుత్వం దృష్టిసారించాలని కోరుతూ జనవరి 30 నుంచి నిరాహార దీక్ష ప్రారంభిస్తున్నట్టు తెలిపారు.
ఇంటర్నెట్ డెస్క్: ప్రముఖ సామాజిక కార్యకర్త అన్నా హజారే మరోసారి నిరాహార దీక్షకు సిద్ధమయ్యారు. మహారాష్ట్రలో లోకాయుక్త చట్టం అమల్లో జాప్యం జరుగుతున్నందుకు నిరసనగా వచ్చే ఏడాది జనవరి 30న తన స్వగ్రామం రాలేగావ్ సిద్ధిలో నిరాహార దీక్ష చేపట్టనున్నారు (Anna Hazare Hunger Strike).
లోకాయుక్త చట్టం అమలులో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని అన్నా హజారే మండిపడ్డారు. ప్రజాసంక్షేమానికి కీలకమైన ఈ చట్టాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారని అన్నారు. చట్టం అమలుకు గతంలో ఇచ్చిన హామీలను పక్కనపెట్టారని ఆరోపించారు.
లోకాయుక్త చట్టాన్ని తీసుకురావాలంటూ హజారే 2022లో నిరాహార దీక్ష చేపట్టారు. అయితే, అప్పటి ముఖ్యమంత్రి జోక్యంతో ఆయన దీక్షను విరమించారు. అనంతరం మహారాష్ట్ర అసెంబ్లీ లోకాయుక్త బిల్లుకు ఆమోదం కూడా తెలిపింది.
అయితే, క్షేత్రస్థాయిలో మాత్రం చట్టం అమలు జరగట్లేదని హజారే అన్నారు. ముఖ్యమంత్రి ఫడణవీస్‌కు ఈ విషయంలో 7 లేఖలు రాసినా స్పందన కరువైందని ఆక్షేపించారు. ‘ఈ చట్టం ప్రజాసంక్షేమానికి ఎంతో అవసరం. నేను ఈ విషయంపై ఏడు లేఖలు రాశాను. కానీ అవతలి వైపు నుంచి ఎటువంటి స్పందనా లేదు. ఇలా ఎందుకో నాకు అర్థం కావట్లేదు. ప్రభుత్వం ఉన్నదే ప్రజాసంక్షేమానికి, కేవలం ప్రదర్శనకు కాదు’ అంటూ హజారే ఘాటు వ్యాఖ్యలు చేశారు. పరిస్థితి ముదరక మునుపే ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తాను ఆశిస్తున్నట్టు చెప్పారు.
ఇవి కూడా చదవండి
డీజీసీఏ తరువాత సీసీఐ.. మరిన్ని చిక్కుల్లో ఇండిగో
నైట్ క్లబ్స్‌లో బాణసంచాపై నిషేధం.. గోవా కీలక నిర్ణయం
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి