CCI-IndiGo: డీజీసీఏ తరువాత సీసీఐ.. మరిన్ని చిక్కుల్లో ఇండిగో
ABN , Publish Date - Dec 12 , 2025 | 05:06 PM
ఇండిగోపై సీసీఐ కూడా దృష్టి సారించింది. మార్కెట్‌లో తనకున్న ఆధిపత్యాన్ని దుర్వినియోగ పరిచిందో లేదో తేల్చేందుకు ప్రాథమిక స్థాయిలో పరిశీలన చేపట్టినట్టు జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి.
ఇంటర్నెట్ డెస్క్: ఫ్లైట్‌ల రద్దుతో దేశీయ విమాన రంగంలో కలకలం రేపిన ఇండిగో ఎయిర్‌లైన్స్ సంస్థపై కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) దృష్టి సారించింది. మార్కెట్‌లో న్యాయబద్ధమైన పోటీకి సంబంధించి ఇండిగో ఏవైనా నిబంధనలు ఉల్లంఘించిందా? లేదా? అనే విషయాన్ని తేల్చేందుకు ప్రాథమిక పరిశీలన ప్రారంభించింది.
జాతీయ మీడియా కథనాల ప్రకారం, ఇండిగో విషయంలో సీసీఐ సుమోటోగా దృష్టి సారించింది. మార్కెట్‌లో అతిపెద్ద ఎయిర్‌లైన్స్‌గా ఉన్న ఇండిగో తన స్థాయిని దుర్వినియోగ పరిచిందా అనే అంశాన్ని పరిశీలిస్తోంది. అయితే, ఈ అంశంలో ఇప్పటివరకూ ఎలాంటి ఫిర్యాదు దాఖలు కాలేదు. స్థూలంగా మార్కెట్‌లో ఇండిగోకు ఉన్న ఆధిపత్యంతో పాటు వివిధ మార్గాల్లో సంస్థ స్థితిని కూడా పరిశీలిస్తున్నామని అధికారి ఒకరు తెలిపారు. అధిక ధరలు, ఇతరులకు మార్కెట్‌లో స్థానం దక్కకుండా చేయడం వంటి ఉల్లంఘనలు జరిగాయో లేదో తేల్చేందుకు రంగంలోకి దిగారు. మార్కెట్‌లో ఆధిపత్య సంస్థగా ఉండటంలో తప్పు లేదని, ఈ స్థానాన్ని దుర్వినియోగ పరిస్తేనే తప్పు అవుతుందని అధికార వర్గాలు తెలిపాయి.
నిబంధనల ప్రకారం, సీసీఐ తొలుత ప్రాథమిక సమాచారం ఆధారంగా పరిశీలన నిర్వహిస్తుంది. ఉల్లంఘన జరిగినట్టు ప్రాథమికంగా తేలితే పూర్తి స్థాయి దర్యాప్తు మొదలవుతుంది.
ఇప్పటికే ఇండిగోపై డీజీసీఏ దృష్టి పెట్టింది. ఫ్లైట్‌ల రద్దుకు గల కారణాలను తెలుసుకునే ప్రయత్నం చేస్తోంది. పైలట్ డ్యూటీ, విశ్రాంతికి సంబంధించిన కొత్త నిబంధనలకు అనుగుణంగా ప్లానింగ్ లేదన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ప్రధాన కారణం ఇదే అయి ఉండొచ్చన్న అంచనాకు అధికార వర్గాలు వచ్చాయి. ఇక డీజీసీఏ ఇప్పటికే ఇండిగో ప్రధాన కార్యాలయంలో కార్యకలాపాల పర్యవేక్షణకు ఇద్దరు ప్యానల్ సభ్యులను పంపించింది. ఫ్లైట్ ఆపరేషన్స్, చెల్లింపులు, ప్యాసెంజర్‌లకు సహాయం అందించడం తదితర అంశాలను పర్యవేక్షిస్తోంది.
ఇక ఇండిగో వ్యవహారాలను పర్యవేక్షించేందుకు డిప్యుటేషన్‌పై వెళ్లిన నలుగురు ఫ్లైట్ ఆపరేషన్ ఇన్‌స్పెక్టర్‌లపై కూడా వేటు పడింది. దీంతో పాటు సంస్థలోని సిబ్బంది నిర్వహణ, విధుల కేటాయింపు, డ్యూటీలకు సంబంధించిన కొత్త నిబంధనల కోసం సంస్థ ఏమేరకు సంసిద్ధంగా ఉందో తేల్చేందుకు నలుగురు సభ్యులతో ఓ కమిటీని కూడా ఏర్పాటయ్యింది.
ఇవి కూడా చదవండి
నైట్ క్లబ్స్‌లో బాణసంచాపై నిషేధం.. గోవా కీలక నిర్ణయం
మహారాష్ట్రలో చిరుత కలకలం.. భవనాల మధ్య దూకుతూ..
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి