Stray Dogs : ఢిల్లీ వీధుల్లో ఒక్క కుక్క కూడా ఉండకూడదన్న సుప్రీంకోర్టు
ABN , Publish Date - Aug 11 , 2025 | 03:28 PM
ఢిల్లీ వీధుల్లో ఒక్క కుక్క కూడా ఉండటానికి వీళ్లేదని సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది. 8 వారాల్లోపు అన్ని వీధి కుక్కలను షెల్టర్లకు తరలించాలని స్పష్టం చేసింది. తమ ఆదేశాలకు వ్యతిరేకంగా జంతు ప్రేమికులు, ఇతర పార్టీలు, సంస్థలు వేసిన పిటిషన్లను విచారించబోమని..
ఢిల్లీ, ఆగష్టు 11 : ఢిల్లీ వీధుల్లో ఒక్క కుక్క(Stray Dogs) కూడా ఉండటానికి వీళ్లేదని సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఎన్సీఆర్ NCR(National Capital Region)లోని అన్ని వీధి కుక్కలను షెల్టర్లకు తరలించాలని అధికారులకు ఆదేశాలిచ్చింది. 8 వారాల్లోపు అన్ని వీధి కుక్కలను షెల్టర్లకు తరలించాలని స్పష్టం చేసింది. వీధి కుక్కల దాడుల వల్ల ఢిల్లీ, ఎన్సీఆర్‌ల పరిధిలో రేబిస్ మరణాల సంఖ్య పెరుగుతోందని వస్తున్న నివేదికల్ని పరిగణనలోకి తీసుకున్న జస్టిస్ పార్దివాలా, జస్టిస్ ఆర్. మహదేవన్‌లతో కూడిన ధర్మాసనం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ప్రజాప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ఈ ఆదేశాలు జారీ చేశామని చెప్పిన అత్యున్నత ధర్మాసనం.. ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వ వాదనలు మాత్రమే వింటామని చెప్పింది. తమ ఆదేశాలకు వ్యతిరేకంగా జంతు ప్రేమికులు, ఇతర పార్టీలు, సంస్థలు వేసిన పిటిషన్లను విచారించబోమని తేల్చి చెప్పింది.
వీలైనంత త్వరగా ఢిల్లీలోని అన్ని ప్రాంతాల నుంచి కుక్కలను దూర ప్రాంతాలకు తరలించాలని అధికారులకు అదేశాలు జారీచేసింది. ఈ చర్యలను అడ్డుకోవడానికి ఏవైనా సంస్థలు ప్రయత్నిస్తే కఠిన చర్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించింది. వీధికుక్కల తరలింపు ప్రదేశాలపై జస్టిస్ పార్దివాలా.. సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా అభిప్రాయాన్ని కోరగా.. ఇందుకోసం ఇప్పటికే ఓ ప్రదేశాన్ని గుర్తించారని తుషార్ మెహతా కోర్టుకు విన్నవించారు. జంతు హక్కుల కార్యకర్తలు స్టే ఆర్డర్ పొందడంతో ఆ పనులు నిలిచిపోయాయని న్యాయస్థానానికి వివరించారు. దీంతో ఆగ్రహించిన జస్టిస్ పార్దివాలా.. ఆ జంతు ప్రేమికులందరూ కలిసి రేబిస్‌తో ప్రాణాలు కోల్పోయిన వారిని తిరిగి తీసుకురాగలుతారా? అని సూటిగా ప్రశ్నించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
For More AndhraPradesh News And Telugu News