Operation Sindoor: చదరంగంలా ఆపరేషన్ సిందూర్
ABN , Publish Date - Aug 11 , 2025 | 03:07 AM
ఆపరేషన్ సిందూర్ వంటి సైనిక చర్య తమకు కొత్త అనుభవం అని, సంప్రదాయ యుద్ధాలకు ఈ తరహా
సంప్రదాయ యుద్ధాలకు ఇది భిన్నం: ఆర్మీ చీఫ్ ద్వివేది
న్యూఢిల్లీ, ఆగస్టు 10: ఆపరేషన్ సిందూర్ వంటి సైనిక చర్య తమకు కొత్త అనుభవం అని, సంప్రదాయ యుద్ధాలకు ఈ తరహా ఆపరేషన్లు భిన్నవైనవని ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది అన్నారు. ఆపరేషన్ కొనసాగిన నాలుగు రోజులూ తమకు పరిస్థితి కొత్తగానూ, సంక్లిష్టంగానూ అనిపించిందన్నారు. ఎత్తుకు పైఎత్తు వేస్తూ ఒకరకంగా చదరంగంలాగా ఈ ఆపరేషన్ సాగిందని ఉపేంద్ర ద్వివేది వ్యాఖ్యానించారు. ‘‘సంప్రదాయ యుద్ధంలో సర్వశక్తులు ఒడ్డి పోరాడతాం. ఉన్న అన్ని వనరులను ఉపయోగిస్తాం. తిరిగి వస్తే వచ్చినట్లు... లేదంటే లేదు. కానీ... ఆపరేషన్ సిందూర్ అలా కాదు! శత్రువు తదుపరి అడుగు ఏమిటో తెలియదు. మనం ఏం చేస్తామో వాళ్లకూ తెలియదు. వాళ్లు ఒక ఎత్తు వేస్తే... మనం దానికి పైఎత్తు వేశాం. ఇది సరికొత్త పోరాట పంథా!’’ అని ద్వివేది పేర్కొన్నారు. యుద్ధం సుదీర్ఘకాలంపాటు కొనసాగుతుందని భావించినప్పటికీ... టెస్ట్ మ్యాచ్ నాలుగు రోజులకే ముగిసిందని వ్యాఖ్యానించారు. అదే సమయంలో... మనమంతా త్వరలోనే మరో ‘యుద్ధం’ చేయాల్సి ఉంటుందని... అందుకు సిద్ధంగా ఉండాలని.. బహుశా అది ‘కాలు కదపకుండా చేసేది’ అని నర్మగర్భంగా వ్యాఖ్యానించారు.
సిందూర్ వేళ సైన్యానికి సంపూర్ణ స్వేచ్ఛ
ఆపరేషన్ సిందూర్ విషయంలో సైన్యానికి పూర్తి స్వేచ్ఛ ఇచ్చారని, ప్రభుత్వంవైపు నుంచి ఇలాంటి స్పష్టత, విశ్వాసం చూడటం ఇదే మొదటిసారని, దీంతో... క్షేత్రస్థాయిలో సమర్థంగా వ్యవహరించే అవకాశం లభించిందని ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది అన్నారు. ‘‘ఏప్రిల్ 25న మేం ఉత్తర కమాండ్‌ను సందర్శించాం. ఆపరేషన్ సిందూర్ ప్రణాళికను రూపొందించాం. 9ఉగ్ర స్థావరాలను లక్ష్యంగా ఎంచుకున్నాం. అందులో... ఏడింటిని ధ్వంసం చేశాం. ఈ దాడిలో పెద్దసంఖ్యలో ఉగ్రవాదులు మరణించారు. ఈ దాడులను వాళ్లూ ఊహించలేదు’’ అని ఆయన వివరించారు. ‘‘పాకిస్థాన్‌తో ఎలాంటి పరిస్థితి వచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలి. జవాను స్థాయిలో సాంకేతికత అందుబాటులోకి రావాలి. ఇండియన్ ఆర్మీలో 12 లక్షల మంది సైనికులున్నారు. ప్రతి ఒక్కరి చేతిలో డ్రోన్ ఉండాలి. ఇదే... ‘ఈగల్ ఆన్ ది ఆర్మ్’’’ అని ఆయన పేర్కొన్నారు.