Share News

Air India Crash Lawsuit: బోయింగ్, హనీవెల్‌పై ఎయిర్ ఇండియా ప్రయాణికుల ఫ్యామిలీ న్యాయ పోరాటం

ABN , Publish Date - Sep 18 , 2025 | 12:05 PM

అహ్మదాబాద్‌లో ఈ ఏడాది జరిగిన ఎయిర్ ఇండియా ఫ్లైట్ ప్రమాదం దేశవ్యాప్తంగా విషాదాన్ని నింపింది. ఈ ప్రమాదంలో 260 మంది ప్రాణాలు కోల్పోయారు. మరణించిన వారిలో నలుగురు ప్రయాణికుల కుటుంబ సభ్యులు తాజాగా అమెరికాలో బోయింగ్, హనీవెల్ సంస్థలపై దావా వేశారు.

Air India Crash Lawsuit: బోయింగ్, హనీవెల్‌పై ఎయిర్ ఇండియా ప్రయాణికుల ఫ్యామిలీ న్యాయ పోరాటం
Air India Crash Lawsuit

అహ్మదాబాద్‌లో జరిగిన ఎయిర్ ఇండియా ఫ్లైట్ 171 విమాన ప్రమాదంలో 260 మంది ప్రాణాలు కోల్పోయిన దుర్ఘటన అందరికీ తెలిసిందే. ఈ దుర్ఘటనలో మరణించిన నలుగురు ప్రయాణికుల కుటుంబాలు అమెరికాలోని డెలావేర్ సుపీరియర్ కోర్టులో బోయింగ్, హనీవెల్ కంపెనీలపై దావా వేశాయి (Air India Crash Lawsuit). ఈ కంపెనీల నిర్లక్ష్యం, లోప భూయిష్ట ఫ్యూయల్ కటాఫ్ స్విచ్ కారణంగానే ఈ విషాదం సంభవించిందని ఆరోపిస్తున్నారు.


దావా వివరాలు

బుధవారం దాఖలైన ఈ ఫిర్యాదు ప్రకారం, బోయింగ్ 787-8 డ్రీమ్‌లైనర్ విమానంలో ఉన్న ఫ్యూయల్ కటాఫ్ స్విచ్‌ను బోయింగ్ సంస్థ ఏర్పాటు చేసింది. అయితే దాన్ని తయారు చేసిన హనీవెల్ కంపెనీ ఈ లోపానికి బాధ్యత వహించాలని ఫిర్యాదు తెలిపింది. స్విచ్‌లోని లాకింగ్ మెకానిజం సరిగ్గా పనిచేయకపోవడం, అది సులభంగా తొలగిపోయే అవకాశం ఉండటం వల్ల ఇంధన సరఫరా నిలిచిపోయింది. దీంతో టేకాఫ్ సమయంలో అవసరమైన థ్రస్ట్ లభించలేదని ఫిర్యాదుదారులు చెబుతున్నారు.


చర్యలు తీసుకోలేదని..

2018లో యూఎస్ ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (FAA) బోయింగ్ విమానాల్లోని స్విచ్‌ల లాకింగ్ మెకానిజంలో సమస్య ఉందని చెప్పిన విషయాన్ని ప్రస్తావించారు. ఈ కంపెనీలు దాన్ని సరిచేయడానికి తగిన చర్యలు తీసుకోలేదని ఫిర్యాదులో పేర్కొన్నారు. థ్రస్ట్ లివర్ల వెనుక ఈ స్విచ్‌లను ఏర్పాటు చేయడం వల్ల, కాక్‌పిట్‌లో సాధారణ కార్యకలాపాల సమయంలో స్విచ్ ఆన్ లేదా ఆఫ్ అయ్యే ప్రమాదం ఉందని వారు ఆరోపిస్తున్నారు.


దావా లక్ష్యం

ఈ దావాలో కాంతాబెన్ ధీరూభాయ్ పఘడాల్, నావ్య చిరాగ్ పఘడాల్, కుబేర్‌భాయ్ పటేల్, బబీబెన్ పటేల్‌ల మరణాలకు నష్టపరిహారం కోరుతున్నారు. ఈ నలుగురు 229 మంది ప్రయాణికులతో పాటు మరణించారు. వారి కుటుంబ సభ్యులు భారత్, బ్రిటన్ పౌరులని తెలుస్తోంది. ఈ విమాన ప్రమాదంపై అమెరికాలో దాఖలైన మొదటి దావా ఇదేనని భావిస్తున్నారు. అయితే నష్టపరిహారం ఎంత మొత్తం అనేది స్పష్టంగా తెలియలేదు.


తాత్కాలిక నివేదిక

భారత్, యూకే, యునైటెడ్ స్టేట్స్ అధికారులు ఈ ప్రమాదానికి కచ్చితమైన కారణాన్ని ఇంకా నిర్ధారించలేదు. భారతదేశ ఎయిర్‌క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (AAIB) జులైలో విడుదల చేసిన తాత్కాలిక నివేదిక ప్రకారం, టేకాఫ్ సమయంలో రెండు ఫ్యూయల్ కంట్రోల్ స్విచ్‌లు కటాఫ్ స్థానానికి మారాయి. దీనివల్ల ఇంజన్లకు ఇంధన సరఫరా ఆగిపోయింది. 10 సెకన్లలో స్విచ్‌లను మళ్లీ రన్ స్థానానికి మార్చినప్పటికీ, ఇంజన్లు సకాలంలో థ్రస్ట్‌ను తిరిగి పొందలేకపోయాయి.

కాక్‌పిట్ వాయిస్ రికార్డింగ్‌లో ఒక పైలట్ మరొకరిని ఫ్యూయల్ స్విచ్ గురించి అడిగిన సంభాషణ రికార్డ్ అయింది. రెండో పైలట్ దాన్ని తాను ఆపరేట్ చేయలేదని చెప్పారు. ఈ క్రమంలో సమాచార లోపం లేదా సిస్టమ్ సమస్య వల్ల మారాయా అని AAIB పరిశీలిస్తోంది. ఈ దావా బోయింగ్, హనీవెల్ కంపెనీల బాధ్యతను ప్రశ్నిస్తూ, విమాన భద్రతా ప్రమాణాలపై మరోసారి చర్చను రేకెత్తిస్తోంది.


ఇవి కూడా చదవండి

మరో స్కామ్‌ అలర్ట్.. మీ డబ్బు, ఫోన్‌ను ఇలా కాపాడుకోండి

సెప్టెంబర్ 2025లో బ్యాంక్ సెలవుల పూర్తి లిస్ట్..

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Sep 18 , 2025 | 01:55 PM