Rahul Gandhi vs EC: ఓటర్ల పేర్ల తొలగింపు ప్రజాస్వామ్యంపై పడిన హైడ్రోజన్ బాంబ్
ABN , Publish Date - Sep 18 , 2025 | 11:23 AM
కాంగ్రెస్ ఎంపీ, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఓటర్ల జాబితా నుంచి పేర్ల తొలగింపు గురించి సంచలన ఆరోపణలు చేశారు. ఈ చర్యలను హైడ్రోజన్ బాంబుతో పోల్చిన ఆయన తీవ్ర విమర్శలు చేశారు.
లోక్ సభలో ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ (Rahul Gandhi) మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓటర్ల జాబితాలో పేర్ల తొలగింపుపై తీవ్ర ఆరోపణలు చేశారు. ఎన్నికల సంఘం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందంటూ ఘాటైన వ్యాఖ్యలతో విరుచుకుపడ్డారు. అంతేకాదు.. అక్రమంగా తొలగించిన ఓటర్ల జాబితాలోని వ్యక్తులను మీడియా ముందుంచారు రాహుల్ గాంధీ. ఇదే అంశంపై గురువారం మీడియాతో మాట్లాడిన రాహుల్.. ఇది కేవలం ఓట్ల జాబితా సమస్య కాదని, లక్షలాది మంది ఓటర్ల హక్కులపై జరుగుతున్న కుట్రగా అభివర్ణించారు. ఎన్నికల ప్రక్రియలో తేడాలు, అక్రమాలు సరిచేయాల్సిన సమయం వచ్చిందని, ఈ చీకటి రాజకీయం గురించి ప్రజలకు తెలియాల్సిన అవసరం ఎంతైనా ఉందని స్పష్టం చేశారు.
కర్ణాటకలో ఓట్ల తొలగింపు..
కర్ణాటకలోని ఆలంద్ నియోజకవర్గంలో 6,000 ఓట్లను నకిలీ లాగిన్‌ల ద్వారా తొలగించారు. ఈ ప్రక్రియలో సాఫ్ట్‌వేర్‌ను దుండగులు హైజాక్ చేశారు. నకిలీ అప్లికేషన్‌లు, తప్పుడు ఫోన్ నంబర్లు ఉపయోగించి ఓట్ల తొలగింపునకు అప్పీల్ చేశారని రాహుల్ తెలిపారు. కాంగ్రెస్ పార్టీ విజయం సాధించే అవకాశం ఉన్న బూత్‌లను లక్ష్యంగా చేసుకుని ఈ ఓట్ల తొలగింపు జరిగిందని రాహుల్ గాంధీ అన్నారు. ఈ చర్యలు తమ పార్టీని బలహీనపరచడానికి జరిగాయని ఆయన వ్యాఖ్యానించారు. అంతేకాదు ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ అలాంటి ప్రజాస్వామ్య విధ్వంసకులను రక్షిస్తున్నారని రాహుల్ గాంధీ ఆరోపించారు.
ఓట్ల మోసంపై రాహుల్ గాంధీ ఆధారాలు..
రాహుల్ గాంధీ కర్ణాటకలో ఓట్ల మోసం జరిగిందని ఆరోపిస్తూ కొన్ని ఆధారాలు చూపించారు. కాంగ్రెస్ ఆధిక్యంలో ఉన్న బూత్‌లలో ఈ మోసం జరిగిందని, గోదాబాయ్ పేరుతో ఫేక్ లాగిన్ ఉపయోగించి 12 ఓట్లను తొలగించే ప్రయత్నం జరిగిందని ఆయన తెలిపారు. ఓట్ల తొలగింపు కోసం ఆటోమేటెడ్ ప్రోగ్రామ్ ఉపయోగించారని, ప్రతి బూత్‌లో మొదటి ఓటరును దరఖాస్తుదారుగా చూపేలా చేశారని వెల్లడించారు. ఎక్కువ ఓట్లు తొలగించిన టాప్ 10 బూత్‌లన్నీ కాంగ్రెస్ పార్టీ బలమైన ప్రాంతాల్లో ఉన్న చోటనే జరిగాయని రాహుల్ తెలిపారు.
ఫిర్యాదు చేసినా..
మహారాష్ట్ర, కర్ణాటక, హర్యానా, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో పెద్దఎత్తున ఓటర్లను లిస్ట్ నుంచి తొలగించారని రాహుల్ గాంధీ ఆరోపించారు. ఈ తొలగింపులు వ్యక్తుల ద్వారా కాకుండా, ఓ సాఫ్ట్‌వేర్ ద్వారా కేంద్రీకృతంగా జరిగిందన్నారు. ప్రతి బూత్‌లో మొదటి పేరును ఆ ఆటోమేటెడ్ ప్రోగ్రాం తీసుకుని తొలగించేలా రూపొందించారని తెలిపారు. అంతేకాకుండా ఈ ప్రక్రియలో రాష్ట్రానికి చెందిన వారు కాకుండా ఇతర ప్రాంతాల ఫోన్లు ఉపయోగించి OTPలతో అప్లికేషన్లు దాఖలు చేసినట్లు ఆయన ఆరోపించారు. వీటి గురించి కర్ణాటకలో సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఈసీకి తెలిపినా పట్టించుకోలేదన్నారు.
విడుదల చేయాలి
ఈ మొత్తం వ్యవహారం చిన్న స్థాయిలో కాకుండా, పెద్ద ఎత్తున జరిగిందని గాంధీ పేర్కొన్నారు. ఈ తొలగింపులపై ఎన్నికల సంఘం స్పందించకపోతే, అది ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీసే వారిని కాపాడుతున్నట్టు అవుతుందని ఆయన హెచ్చరించారు. ఎన్నికల సంఘం ఒక వారంలోపు తీసివేసిన ఓటర్ల వివరాలు, వాటికి ఉపయోగించిన ఫోన్లు, OTPల సమాచారం విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. లేకపోతే, ఇది మరోసారి ఓట్ల చోరీకి నిదర్శనమవుతుందని రాహుల్ గాంధీ అన్నారు.
ఇవి కూడా చదవండి
మరో స్కామ్ అలర్ట్.. మీ డబ్బు, ఫోన్‌ను ఇలా కాపాడుకోండి
సెప్టెంబర్ 2025లో బ్యాంక్ సెలవుల పూర్తి లిస్ట్..
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి