Sensex Nifty Rally: మూడో రోజు కూడా దుమ్మురేపిన స్టాక్ మార్కెట్..లాభాల జోరు
ABN , Publish Date - Sep 18 , 2025 | 10:20 AM
భారత స్టాక్ మార్కెట్ సెప్టెంబర్ 18న కూడా లాభాల జోరును కొనసాగించింది. ఇది వరుసగా మూడో రోజు కావడం విశేషం. అమెరికా ఫెడ్ రిజర్వ్ తాజా నిర్ణయం ఈ జోరుకు ప్రధాన కారణమని నిపుణులు చెబుతున్నారు.
భారత స్టాక్ మార్కెట్ వరుసగా మూడో రోజూ (సెప్టెంబర్ 18, 2025న) లాభాలతో దూసుకెళ్లింది. అమెరికా ఫెడరల్ రిజర్వ్ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించి 4–4.25 శాతం తీసుకొచ్చిన నేపథ్యంలో ఈ ఉత్సాహం కనిపించింది. ఫెడ్ చైర్మన్ జెరోమ్ పావెల్ మరో రెండు రేటు కోతల సూచనలు ఇవ్వడం, 2026 వరకు ఈ ధోరణి కొనసాగవచ్చని చెప్పడం మార్కెట్‌కు సానుకూల సంకేతాలను పంపింది.
ఇండియా విక్స్
ఉదయం వేళలో సెన్సెక్స్ 260.21 పాయింట్లు, అంటే 0.31 శాతం, ఎగసి 82,953.92 స్థాయికి చేరుకుంది. నిఫ్టీ కూడా 72.90 పాయింట్లు, అంటే 0.29 శాతం, పెరిగి 25,403.15కు చేరింది. దీంతో మార్కెట్‌లో సానుకూల వాతావరణం నెలకొంది. ఈ క్రమంలో 1,656 షేర్లు లాభపడగా, 979 షేర్లు నష్టపోయాయి, 156 షేర్లు స్థిరంగా ఉన్నాయి. ఇండియా VIX సూచీ మరో రెండు శాతం తగ్గి, మార్కెట్ అస్థిరత తగ్గుముఖం పట్టినట్లు సూచించింది.
టెక్ షేర్లు స్టార్ పెర్ఫార్మర్లు
నిఫ్టీ ఐటీ సూచీ అద్భుత ప్రదర్శనతో ముందంజలో నిలిచింది. అమెరికా రేటు కోతలు ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన అమెరికా ఆర్థిక వృద్ధికి తోడ్పడతాయని, ఇది భారత ఐటీ ఎగుమతి సంస్థలకు శుభవార్త అని నిపుణులు చెబుతున్నారు. TCS, ఇన్ఫోసిస్, HCL టెక్, విప్రో, LTI మైండ్‌ట్రీ వంటి దిగ్గజ ఐటీ షేర్లు ఉదయం ట్రేడింగ్‌లో 2 శాతం వరకు లాభపడ్డాయి.
ఫైనాన్షియల్, ఫార్మా, రియల్ ఎస్టేట్ రంగాలు కూడా ఈ ఉత్సాహంలో భాగమయ్యాయి. అయితే, మెటల్, PSU బ్యాంక్ షేర్లు మాత్రం వెనుకబడ్డాయి. హిందుస్థాన్ జింక్, హిందాల్కో, SBI వంటి సంస్థల షేర్లు ఒత్తిడిని ఎదుర్కొన్నాయి.
టెక్నికల్ విశ్లేషణ ఏం చెబుతోంది?
ఈ క్రమంలో మార్కెట్ 25,400–25,600 రేంజ్ దిశగా కదిలే అవకాశం ఉందని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్‌కి చెందిన ఆనంద్ జేమ్స్ అన్నారు. మార్కెట్‌కి పటిష్టమైన సపోర్ట్ 25,280 వద్ద ఉందన్నారు. అయితే, 25,200కు దిగితే మాత్రం 24,800 వరకు పడే అవకాశం ఉందని హెచ్చరించారు. మొత్తం మీద మార్కెట్‌కు ప్రస్తుతం విదేశీ సంకేతాలు సపోర్టుగా నిలుస్తున్నాయి.
నోట్: స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలని ఆంధ్రజ్యోతి సూచించదు. సమాచారం మాత్రమే అందిస్తుంది.
ఇవి కూడా చదవండి
మరో స్కామ్ అలర్ట్.. మీ డబ్బు, ఫోన్‌ను ఇలా కాపాడుకోండి
సెప్టెంబర్ 2025లో బ్యాంక్ సెలవుల పూర్తి లిస్ట్..
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి