IRDAI Bima Sugam: బీమా సుగమ్ పోర్టల్.. అనేక రకాల సేవలు మొత్తం ఒకేచోట
ABN , Publish Date - Sep 18 , 2025 | 09:56 AM
దేశంలో బీమా వ్యవస్థను మరింత పారదర్శకంగా అందరికీ అందుబాటులోకి తెచ్చే లక్ష్యంతో IRDAI కొత్తగా బీమా సుగమ్ (Bima Sugam) పోర్టల్‌ను ప్రకటించింది. దీనిని ఎందుకు ప్రకటించారు, ఇది ఎలా పనిచేస్తుందనే తదితర వివరాలను ఇక్కడ చూద్దాం.
భారతదేశంలో బీమా కొనుగోలు, క్లెయిమ్, సేవల ప్రక్రియలను మరింత సులభంగా, పారదర్శకంగా అందరికీ చేరువయ్యే ఉద్దేశంతో భారత బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ(IRDAI) కీలక నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో కొత్తగా బీమా సుగమ్ (Bima Sugam) అనే డిజిటల్ పోర్టల్‌ను ప్రకటించింది. త్వరలో అందుబాటులోకి రానున్న ఈ పోర్టల్ ద్వారా జీవిత బీమా, ఆరోగ్య బీమా, వాహన బీమా వంటి అన్ని రకాల బీమాలను ఒకే చోట నుంచి కొనుగోలు చేయవచ్చు.
డిజిటల్ వేదిక
దీంతోపాటు పాలసీ వివరాలు తెలుసుకోవడం, క్లెయిమ్ చేయడం కూడా సులభమవుతుంది. బీమా ప్రక్రియల్లో ఉండే ఇబ్బందులను తొలగించి వినియోగదారులకు ఒక డిజిటల్ వేదికగా బీమా సుగమ్ (Bima Sugam) ఉపయోగపడనుంది. ఈ ఏడాది డిసెంబర్‌లో దీని మొదటి దశ ప్రారంభం కానుంది. గతంలో జనరల్ ఇన్సూరెన్స్ కౌన్సిల్ (GIC) నివేదికల ప్రకారం, ఈ పోర్టల్ ఏప్రిల్‌లో ప్రారంభం కావాల్సి ఉంది. కానీ కొన్ని కారణాల వల్ల ఇది వాయిదా పడింది.
బీమా సుగమ్ అంటే ఏంటి?
బీమా సుగమ్ అనేది భారతదేశ బీమా రంగంలో పారదర్శకత, సహకారాన్ని పెంపొందించే ఒక ఆన్‌లైన్ వేదిక. ఈ పోర్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ కౌన్సిల్, జనరల్ ఇన్సూరెన్స్ కౌన్సిల్ ఆధ్వర్యంలో రూపొందించబడింది. 2024 మార్చి 20న జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్ ప్రకారం బీమా సుగమ్ అనేది బీమా హోల్డర్లు, బీమా కంపెనీలు, మధ్యవర్తులు, ఏజెంట్ల కోసం పనిచేయనుంది. ఈ పోర్టల్ వినియోగదారులకు బీమా ప్రక్రియను సరళీకరించి, సౌకర్యవంతమైన అనుభవాన్ని అందించనుంది.
బీమా సుగమ్ ఎలా పనిచేస్తుంది?
వినియోగదారులు వివిధ బీమా పాలసీలను ఒకే చోట సరిపోల్చుకుని, తమ అవసరాలకు తగిన విధంగా ఒక దానిని ఎంపికను ఎంచుకోవచ్చు.
బీమా పాలసీలను ఆన్‌లైన్‌లో సులభంగా కొనుగోలు చేయవచ్చు
క్లెయిమ్ ప్రక్రియను ఈ పోర్టల్ ద్వారా తెలుసుకోవచ్చు. ఇది వినియోగదారులకు సమయం, శ్రమను ఆదా చేస్తుంది
పాత పాలసీలను రెన్యూ చేయడం ఈ వేదిక ద్వారా ఈజీ అవుతుంది.
ఈ పోర్టల్ దశలవారీగా అమలు చేయబడుతుంది. మొదటి దశలో భద్రత, నియమ నిబంధనలు నిర్ధారించడంపై ఫోకస్ చేస్తారు. ఆ తర్వాత నెలల్లో బీమా కంపెనీలతో ఇంటిగ్రేషన్ పూర్తైన తర్వాత ఈ పోర్టల్‌లో లావాదేవీలు ప్రారంభమవుతాయి.
ఇవి కూడా చదవండి
మరో స్కామ్ అలర్ట్.. మీ డబ్బు, ఫోన్‌ను ఇలా కాపాడుకోండి
సెప్టెంబర్ 2025లో బ్యాంక్ సెలవుల పూర్తి లిస్ట్..
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి