Actor Raza Murad Files Police Complaint: 'నేను బ్రతికే ఉన్నా.. నా మరణ పుకార్లు అడ్డుకోండి' పోలీసులకు నటుడు రజా మురాద్ ఫిర్యాదు
ABN , Publish Date - Aug 22 , 2025 | 06:25 PM
'నేను బ్రతికే ఉన్నా.. నా మరణ పుకార్లు అడ్డుకోండి' అంటూ ప్రముఖ నటుడు రజా మురాద్ పోలీసులను ఆశ్రయించాల్సి వచ్చింది. ఆ పుకార్లపై పదే పదే స్పష్టత ఇవ్వడం వల్ల తాను అలసిపోయానని..
ముంబై, ఆగస్టు 22 : 'నేను బ్రతికే ఉన్నా.. నా మరణ పుకార్లు అడ్డుకోండి' అంటూ ప్రముఖ నటుడు రజా మురాద్ పోలీసులను ఆశ్రయించాల్సి వచ్చింది. తన మరణం గురించి సోషల్ మీడియాలో తప్పుడు పోస్ట్ పెట్టి ఆన్‌లైన్‌లో ప్రసారం జరుగుతోందని.. ఆ పుకార్లపై పదే పదే స్పష్టత ఇవ్వడం వల్ల తాను అలసిపోయానని చెబుతూ నటుడు రజా మురాద్ ఇవాళ (శుక్రవారం) ముంబైలోని అంబోలి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
ఈ 'పుకారు' తనను తీవ్ర కలతకు గురిచేసిందని, తాను బతికే ఉన్నానని పదే పదే స్పష్టం చేయాల్సి వస్తోందని నటుడు రజా మురాద్ అన్నారు. తాను చనిపోయానని ప్రకటిస్తూ ఎవరో సోషల్ మీడియా పోస్ట్‌ను షేర్ చేశారని రజా మురాద్ పేర్కొన్నారు. ఆ పోస్ట్‌లో తన పుట్టిన తేదీ 'నకిలీ మరణ తేదీ'తో పాటు నివాళి కూడా ఉందని ఆయన అన్నారు.
అంతేకాదు, నేను చాలా సంవత్సరాలు నటుడిగా పనిచేశానని, కానీ ఇప్పుడు నన్ను గుర్తుంచుకోవడానికి ఎవరూ లేరని కూడా సదరు పోస్ట్‌లో రాశారు. ఆ పోస్ట్‌లో నా పుట్టినరోజు, నకిలీ మరణ తేదీని కూడా పేర్కొన్నారు. ఇది చాలా తీవ్రమైన విషయం అని మురాద్ అన్నారు. తప్పుడు సమాచారంపై వివరణ ఇవ్వాల్సి రావడం తనకు నిరంతరం బాధ కలిగిస్తోందని నటుడు ఆవేదన వ్యక్తం చేశారు.

'నేను బతికే ఉన్నానని పదే పదే ప్రజలకు చెప్పడం వల్ల నా గొంతు, నాలుక, పెదవులు ఎండిపోయాయి. ఈ తప్పుడు వార్త ప్రతిచోటా వ్యాపించింది. ప్రపంచవ్యాప్తంగా నాకు కాల్స్, సందేశాలు వస్తున్నాయి. ప్రజలు నాకు పోస్ట్ కాపీలను కూడా పంపుతున్నారు' అని రజా మురాద్ తన కంప్లైంట్‌లో పేర్కొన్నారు. ఈ ఘటనను 'సిగ్గుచేటు' అని పేర్కొంటూ, ఈ పుకారు వెనుక ఉన్న వ్యక్తిని మురాద్ విమర్శించారు. 'ఇలా చేసిన వ్యక్తి చాలా చెడ్డ మనస్తత్వం కలిగి ఉండాలి. అతను చాలా చిన్న వ్యక్తిలా ఉన్నాడు, జీవితంలో ఎప్పుడూ మంచి విజయాలు సాధించని వ్యక్తి. అందుకే అతను ఇలాంటి చౌకబారు పనులు చేయడాన్ని ఆనందిస్తాడు' అని మురాద్ తన ఆగ్రహాన్ని వెళ్లగక్కారు.
పోలీసులు తన ఫిర్యాదును తీవ్రంగా పరిగణిస్తున్నారని మురాద్ చెప్పారు. 'వారు నా ఫిర్యాదును స్వీకరించి ఎఫ్ఐఆర్ దాఖలు చేస్తున్నారు. వారు దీని లోతులకు వెళ్లి బాధ్యులను పట్టుకుంటామని నాకు హామీ ఇచ్చారు. అతనిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటారు' అని మురాద్ చెప్పారు. ఇటువంటి అబద్ధాలను వ్యాప్తి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. 'ఇది ఇప్పుడే ఆపాలి. ఇది నా గురించి మాత్రమే కాదు. సెలబ్రిటీలు బతికి ఉండగానే చనిపోయినట్లు ప్రకటిస్తారు. ఇది తప్పు, ఇలా చేసిన వారిని శిక్షించాలి' అని ఆయన అన్నారు.
1970ల నుండి హిందీ, భోజ్‌పురితో పాటు వివిధ ప్రాంతీయ భాషలలో 250కి పైగా చిత్రాలలో చేసిన అద్భుతమైన నటనకు రజా మురాద్ ఎంతో గుర్తింపు పొందారు. తనకే సొంతమైన బారిటోన్ స్వరానికి ఆయన ఎంతో ప్రసిద్ధి. పెద్ద విలన్ గా, సానుభూతిగల పాత్రల్లో, సోదర పాత్రలకు ఆయన ఫేమస్. 'ప్రేమ్ రోగ్', 'పద్మావత్' వంటి చిత్రాలలో తన నటనతో మురాద్ ప్రేక్షక హృదయాల్లో చెరగని ముద్ర వేశారు.
ఇవి కూడా చదవండి:
తిన్న తర్వాత చేసే ఈ ఒక్క పొరపాటులో గ్యాస్ ప్రాబ్లెం..?
బ్రోకలీ ఆరోగ్యానికి మంచిదే... కానీ వీరికి మాత్రం కాదు!