AAI Senior Manager : ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ 'లక్కీ భాస్కర్' అరెస్ట్
ABN , Publish Date - Sep 03 , 2025 | 11:05 AM
ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా నిధులలో రూ.232 కోట్లకు పైగా తన వ్యక్తిగత ఖాతాలోకి మళ్లించారనే ఆరోపణలతో సంస్థ సీనియర్ మేనేజర్‌ను CBI అరెస్టు చేసింది. వాస్తవ అంకెలకు సున్నాలు జోడించి..తన షేర్ మార్కెట్ 'ట్రేడింగ్ ఖాతాలకు' బదిలీ చేశారని..
ఇంటర్నెట్ డెస్క్ : ప్రభుత్వ రంగ సంస్థ నిధులను తారుమారు చేసిన కేసులో ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా సీనియర్ మేనేజర్‌ను అరెస్ట్ చేసినట్లు CBI అధికారులు తెలిపారు. రూ.232 కోట్లకు పైగా ప్రభుత్వ రంగ సంస్థ నిధులను తన వ్యక్తిగత ఖాతాలోకి మళ్లించారనే ఆరోపణలపై కేసులు నమోదు చేసినట్లు చెప్పారు. డెహ్రాడూన్ విమానాశ్రయంలో తన పోస్టింగ్ సమయంలో మూడు సంవత్సరాలలో ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ విభాగంలో పనిచేసే రాహుల్ విజయ్ ఈ అక్రమాలకు పాల్పడ్డారు. బూటకపు అకౌంటింగ్ ఎంట్రీల ద్వారా సంస్థ సొమ్ములు తన వ్యక్తిగత ఖాతాల్లోకి బదిలీ చేశారని అధికారులు తెలిపారు.
అధికారిక, ఎలక్ట్రానిక్ రికార్డులను తారుమారు చేయడం ద్వారా విజయ్ ఈ మోసానికి పాల్పడ్డారు. ఒక క్రమ పద్ధతిలో, ప్లాన్ ప్రకారం AAI నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారని CBI ప్రతినిధి ఒక ప్రకటనలో తెలిపారు.'దర్యాప్తు సమయంలో, 2019-20 నుండి 2022-23 మధ్య కాలంలో, నిందితుడు డెహ్రాడూన్ విమానాశ్రయంలో విధులు నిర్వర్తిస్తుండగా ఈ మోసాలకు పాల్పడినట్టు తేల్చారు. నకిలీ, కల్పిత ఆస్తులను సృష్టించడంతో పాటూ ఎంట్రీలకు సున్నాలను జోడించడం ద్వారా ఎలక్ట్రానిక్ రికార్డులను తారుమారు చేసినట్లు తేలింది' అని ఆమె చెప్పారు.
బ్యాంకు లావాదేవీల ప్రాథమిక విశ్లేషణలో తేలిన విషయం ఏంటంటే.. విజయ్ అలా జమ చేసిన నిధులను 'ట్రేడింగ్ ఖాతాలకు' బదిలీ చేశారని, తద్వారా ప్రజా ధనాన్ని స్వాహా చేశారని ఏజెన్సీ కనుగొంది. సంస్థ నిర్వహించిన అంతర్గత ఆడిట్‌లో అవకతవకలు బయటపడ్డ తర్వాత AAI ఒక కమిటీని ఏర్పాటు చేసింది. కల్పిత అకౌంటింగ్ ఎంట్రీల ద్వారా అధికారిక ఖాతాల నుండి విజయ్ వ్యక్తిగత ఖాతాలకు అనధికార నిధుల బదిలీల విషయాన్ని కమిటీ బయటపెట్టింది. దీంతో AAI సీనియర్ మేనేజర్ (ఫైనాన్స్) చంద్రకాంత్ ఆగస్టు 18న CBIకి అధికారిక ఫిర్యాదు చేశారు. దీంతో సీబీఐ రంగంలోకి దిగి ఈ వ్యవహారంపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపట్టింది.
ఈ వార్తలు కూడా చదవండి..
మణిపూర్‌లో పర్యటించనున్న ప్రధాని మోదీ..!
ఏపీ మహేష్ బ్యాంక్‌కు షాక్ ఇచ్చిన ఈడీ
For More National News And Telugu News