Share News

Rains: భారీ వర్షాలు.. 9 మంది గల్లంతు

ABN , Publish Date - Jun 29 , 2025 | 08:03 AM

ఉత్తరాఖండ్‌లో కుంభవృష్టి కారణంగా 9 మంది గల్లంతయ్యారు. వారి కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు జిల్లా ఉన్నతాధికారులు వెల్లడించారు. ఇక పాకిస్థాన్‌లో సైతం భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాల కారణంగా 32 మంది మరణించారు.

Rains: భారీ వర్షాలు.. 9 మంది గల్లంతు

నైనిటాల్, జూన్ 29: ఉత్తరాఖండ్‌లోని ఉత్తర కాశీ జిల్లాలో భారీ వర్షాల కారణంగా తొమ్మిది మంది గల్లంతయ్యారు. బార్‌కోట్ - యమునోత్రి రహదారిపై బాలీఘడ్ సమీపంలో ఆదివారం ఉదయం భారీ వర్షం కురిసింది. దీంతో బాలీఘడ్‌లో హోటల్ నిర్మాణ పనుల్లో పాల్గొన్న ఈ కార్మికులు ఆ వర్ష ప్రవాహంలో కొట్టుకుపోయారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న జిల్లా కలెక్టర్ ప్రశాంత్ ఆర్య సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు పర్యవేక్షిస్తున్నారు. కార్మికులు కోసం గాలింపు చర్యలు చేపట్టారు. స్థానిక పోలీసులు, రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ సిబ్బంది, జాతీయ విపత్తు నిర్వహణ సిబ్బంది ఈ గాలింపు చర్యల్లో పాల్గొన్నారని ఆయన వెల్లడించారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని చెప్పారు. ఉత్తరాఖండ్‌లోని ఈ ప్రాంతంలో గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. అయితే ఆదివారం, సోమవారం ఈ ప్రాంతంలో భారీ నుంచి అతి బారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం ఇప్పటికే వెల్లడించింది. ఈ నేపథ్యంలో రెడ్ అలర్ట్ జారీ చేసింది.


భారీ వర్షాలతో పాక్ అతలాకుతలం..

pakistan.jpg

మరోవైపు వర్షాకాలం కావడంతో గత వారం రోజులుగా పాకిస్థాన్‌‌లోని వివిధ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో పలు ప్రాంతాల్లో వరద పోటెత్తింది. దీంతో 32 మంది ప్రజలు మరణించగా.. వారిలో 16 మంది చిన్నారులు ఉన్నారు. ఈ మేరకు ఖైబర్ ఫక్త్వ్ ప్రావిన్స్‌లోని విపత్తు నిర్వహణ సంస్థ అధికారులు వివరించారు. గడిచిన 36 గంటల్లో భారీ వరదలు, ఇంటి పైకప్పు, గోడలు కుప్పకూలిన ఘటనల్లో 19 మంది మరణించారని తెలిపారు. ఈ భారీ వర్షాలు, వరదల కారణంగా.. వేలాది ఇళ్లు దెబ్బతిన్నాయని పేర్కొన్నారు. మంగళవారం వరకు దేశంలోని వివిధ ప్రాంత్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని పాకిస్థాన్ వాతావరణ కేంద్రం స్పష్టం చేసింది.

ఈ వార్తలు కూడా చదవండి..

విమాన ప్రమాదం దర్యాప్తు అధికారికి ఎక్స్ కేటగిరి భద్రత

కోల్‌కతా లా కాలేజీ అత్యాచార ఘటన.. సెక్యూరిటీ గార్డు అరెస్టు

For More National News And Telugu News

Updated Date - Jun 29 , 2025 | 08:06 AM