Kolkata Law College Incident: కోల్‌కతా లా కాలేజీ అత్యాచార ఘటన.. సెక్యూరిటీ గార్డు అరెస్టు
ABN , Publish Date - Jun 28 , 2025 | 12:45 PM
కోల్‌కతా లా కాలేజీ విద్యార్థినిపై అత్యాచార ఘటనలో స్థానిక పోలీసులు కళాశాల సెక్యూరిటీ గార్డును తాజాగా అరెస్టు చేశారు. ఘటన గురించి ఫిర్యాదు చేయడంలో అతడు విఫలమయ్యాడని తేల్చారు.
ఇంటర్నెట్ డెస్క్: దేశవ్యాప్తంగా సంచలనం రేపుతున్న దక్షిణ కోల్‌కతా లా కాలేజీ సామూహిక అత్యాచార ఘటనలో పోలీసులు తాజాగా సెక్యూరిటీ గార్డును అరెస్టు చేశారు. ఈ కేసుకు సంబంధించి ఇది నాలుగో అరెస్టు. అంతకుమునుపు, ప్రధాన నిందితుడితో పాటు మరో ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు.
పోలీసు వర్గాల కథనం ప్రకారం, విద్యార్థినిపై లైంగిక దాడి జరిగిన సమయంలో సెక్యూరిటీ గార్డు ఆ పరిసరాల్లోనే ఉన్నాడు. నిందితుడి సూచనల మేరకు అతడు గార్డు రూమ్‌లో బాధితురాలిని ఒంటరిగా వదిలి వెళ్లిపోయాడు. సహాయం కోసం ఆమె పలుమార్లు వేడుకున్నా అతడు జోక్యం చేసుకోలేదు. ఈ ఘటన గురించి కాలేజీ అధికారులకు లేదా పోలీసులకు ఫిర్యాదు చేయడం సెక్యూరిటీ గార్డు బాధ్యత. కానీ అతడు ఇవేవీ చేయలేదని పోలీసులు చెబుతున్నారు. ఈ విషయంలో నిర్లక్ష్యం ప్రదర్శించిన విషయం సెక్యూరిటీ గార్డును ప్రశ్నించినప్పుడు స్పష్టమైందని అన్నారు. ఈ నేపథ్యంలో అతడిని అరెస్టు చేసినట్టు తెలుస్తోంది.
జూన్ 25న సెక్యూరిటీ గార్డు గదిలో నిందితురాలిపై కొన్ని గంటల పాటు లైంగిక దాడి జరిగింది. కాలేజీకి చెందిన తృణమూల్ కాంగ్రెస్ ఛాత్ర పరిషత్ విభాగం మాజీ ప్రెసిడెంట్ మోనోజిత్ మిశ్రా ఈ దారుణానికి పాల్పడగా మిగతా ఇద్దరు అతడికి సహకరించారు. శుక్రవారం ఈ ఘటన వెలుగులోకి రావడంతో కలకలం రేగింది. కాలేజీ మెయిన్ గేట్‌ను లాక్ చేశాక, సెక్యూరిటీ గార్డును గది బయట కూర్చోబెట్టి తనపై దారుణానికి ఒడిగట్టారని బాధితురాలు పేర్కొన్నారు. సెక్యూరిటీ గార్డు అక్కడే ఉన్నా సాయం చేయలేదని తెలిపారు. ప్రధాన నిందితుడైన మోనోజిత్ మిశ్రాను బుధవారం పోలీసులు అరెస్టు చేశారు. సహ నిందితులు జైబ్ అహ్మద్ (19), ప్రమిత్ ముఖర్జీని పోలీసులు గురువారం అరెస్టు చేశారు.
ఇవీ చదవండి:
విమాన ప్రమాదం తరువాత పార్టీ.. ఎయిర్ ఇండియా-ఎస్ఏటీఎస్ సీనియర్ ఉద్యోగులకు ఉద్వాసన
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి