Farmers in Us-Paar villages: భూమిలోపల 60 బైకులు.. అసలేమైందంటే..
ABN , Publish Date - Sep 03 , 2025 | 09:05 AM
పాకిస్థాన్ సరిహద్దుల్లో పంజాబ్‌లోని ఉస్ పార్ గ్రామాల్లో దారుణ పరిస్థితులు నెలకొన్నాయి. రావినది పొంగి ప్రవహించడంతో పంటలు ఇప్పటికే నష్టపోయారు. వారికి మరో దెబ్బ తగిలింది.
పంజాబ్, సెప్టెంబర్ 03: భారీ వర్షాలతోపాటు ఎగువ నుంచి వచ్చిన నీటి ప్రవాహంతో రావి నదికి వరద పోటెత్తింది. ఈ నేపథ్యంలో పంజాబ్‌లోని గురుదాస్‌పూర్ జిల్లాలోని రావి నది పరివాహక ప్రాంతంలోని పలు గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చేతికి వచ్చిన పంటలు పోయి వారు ఆందోళన చెందుతుంటే.. మరోవైపు వారికి ఇంకో సమస్య వచ్చిపడింది. ఈ ప్రాంతంలోని ఉస్ పార్ గ్రామాల్లోని రైతులకు చెందిన దాదాపు 60 బైకులు భూమిలోకి దిగబడి పోయాయి. అది కూడా ఆరు నుంచి ఎనిమిది అడుగులు లోతులోకి వెళ్లిపోయాయి. తొలుత తమ బైకులు పార్క్ చేసిన ప్రాంతంలో అవి కనిపించకపోవడంతో రైతులు తీవ్ర ఆందోళన చెందారు. అయితే కొన్ని బైకులకు భూమిలోకి చొచ్చుకు వెళ్లినట్లు వారు గుర్తించారు. దీంతో రైతులు బృందాలుగా ఏర్పడి.. వాటిని బయటకు తీసేందుకు ప్రయత్నాలు చేపట్టారు. దాదాపుగా ఆ ప్రాంతాలోని రైతులంతా తమ తమ వాహనాలను వెలికి తీసే పనిలో నిమగ్నమై ఉన్నారు. అందుకోసం వారంతా తవ్వకాలు చేపట్టారు.
ఈ ఉస్ పార్.. ఏడు గ్రామాల సమూహం. ఈ గ్రామాల్లో దాదాపు నాలుగు వేల మంది ప్రజలు నివసిస్తున్నారు. ఈ ప్రాంతం పాకిస్థాన్ సరిహద్దులకు అనుకుని ఉంది. అయితే తామంతా బ్యాంకు లోన్ ద్వారా ఈ వాహనాలను కొనుగోలు చేసినట్లు చెప్పారు. మరో వైపు పంట మొత్తం పోవడం.. అలాగే బైకులు సైతం ఇలా భూమిలో కూరుకు పోవడంతో ఆ రైతుల బాధను వర్ణించ లేని పరిస్థితి నెలకొంది. తీసుకున్న లోన్‌కు నగదుతోపాటు వడ్డి చెల్లించకుంటే.. సిబిల్ స్కోర్ పడిపోతుందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. తీసుకున్న ఈ లోన్ చెల్లించకుంటే.. మళ్లీ పంటకు రుణం తీసుకునే వెసులుబాటు లేదని రైతులు ఆవేదన చెందుతున్నారు. వరదల కారణంగా తమ పశువులు సైతం మృతి చెందాయని రైతులు కన్నీటిపర్యంతమవుతున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
మణిపూర్‌లో పర్యటించనున్న ప్రధాని మోదీ..!
For More National News And Telugu News