KTR Vs Kavitha: పోటా పోటీగా అన్నా చెల్లెలు..
ABN , Publish Date - Sep 03 , 2025 | 09:48 AM
అన్నా చెల్లెలు కేటీఆర్, కవిత రాజకీయంగా దారులు వేరయ్యాయి. దీంతో ఈ ఇద్దరు పోటా పోటీగా రంగంలోకి దిగి.. అధికారాన్ని చేపట్టేందుకు శాయశక్తుల కృషి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు.
హైదరాబాద్, సెప్టెంబర్ 03: బీఆర్ఎస్ పార్టీ సస్పెన్షన్ వేటు వేయడంతో కల్వకుంట్ల కవిత మీడియా ముందుకు రానున్నారు. బుధవారం మధ్యాహ్నం ఆమె మీడియాతో మాట్లాడనున్నారు. ఆ క్రమంలో తన ఎమ్మెల్సీ సభ్యత్వం రద్దుపై ఆమె నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే సస్పెన్షన్‌తోపాటు తన భవిష్యత్ కార్యాచరణపై సైతం ఆమె స్పందించే అవకాశం ఉంది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతుందంటూ తన కుమార్తె, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మంగళవారం పార్టీ నుంచి సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే.
మరోవైపు బుధవారం మధ్యాహ్నం 2.00 గంటలకు తెలంగాణ భవన్‌తో సింగరేణి కార్మికుల సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరు కానున్నారు. ఈ సమావేశం వేదికగా ఎమ్మెల్సీ కవిత సస్పెన్షన్.. తదితర పరిణామాలపై కేటీఆర్ స్పందించే అవకాశం ఉందని సమాచారం.
మరోవైపు నిన్న మొన్నటి వరకు అన్నాచెల్లెలు కేటీఆర్, కవిత ఒక తాటిపై ఉన్నట్లుగా ఉన్నారు. కానీ ఇటీవల కవిత వైఖరిలో తీవ్ర మార్పులు వచ్చాయి. అందులోభాగంగా బీఆర్ఎస్ రజితోత్సవ సభ అనంతరం చోటు చేసుకున్న వరుస పరిణామాలతో.. వీరిద్దరి మధ్య గ్యాప్ బాగా పెరిగినట్లు ఒక చర్చ అయితే సాగుతోంది. అదీకాక తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం (టీబీజీకేఎస్) గౌరవాధ్యక్షురాలిగా కల్వకుంట్ల కవిత కొనసాగుతున్నారు. అయితే ఆమె అమెరికా పర్యటనలో ఉన్న సమయంలో.. సదరు సంఘానికి అధ్యక్షునిగా కొప్పులు ఈశ్వర్‌ను నియమించారు.
దీనిపై యూఎస్ పర్యటనలో ఉన్న కవిత ఒక లేఖను విడుదల చేశారు. ఈ సందర్భంగా కొత్త అధ్యక్షుడు కొప్పుల ఈశ్వర్‌కు శుభాకాంక్షలు తెలియజేస్తూనే.. మరోవైపు పార్టీలో అగ్రనేతలు తన పట్ల వ్యవహరిస్తున్న తీరును సున్నితంగా విమర్శించారు. దీంతో బీఆర్ఎస్ పార్టీలో అది కూడా కేసీఆర్ ఫ్యామిలీలోని లుకలుకలు మరోసారి వెలుగులోకి వచ్చినట్లయింది. ఇక అమెరికా పర్యటన ముగించుకుని హైదరాబాద్ చేరుకున్న కొన్ని గంటలకే కవిత మీడియాతో మాట్లాడుతూ.. తన తండ్రి కేసీఆర్‌కు అవినీతి మరక అంటడానికి బీఆర్ఎస్ పార్టీలోని అగ్రనేతలు హరీష్ రావు, సంతోష్ రావులే కారణమంటూ కుండ బద్దలు కొట్టింది. అంతేకాకుండా.. తన వివాహ సమయంలో కేసీఆర్ పడిన ఇబ్బందులను ఈ సందర్భంగా కవిత గుర్తు చేసుకున్నారు.
ఇక కవిత కొత్త పార్టీ స్థాపిస్తారనే ప్రచారం జరుగుతుంది. దీంతో అన్నా చెలెళ్ల మధ్య రాజకీయంగా ప్రధాన పోరు జరిగే అవకాశం ఉంది. మరి ఈ ఇద్దరు పోటీ పడి.. ఎవరోఒకరు నెగ్గుతారో? లేకుంటే.. ప్రత్యర్థులకు అధికారాన్ని అప్పగిస్తారనేది మాత్రం కాలమే చెబుతుందనడంలో ఎటువంటి సందేహం లేదు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఆ ఆఫీసులో పని చేయాలంటే భయపడుతున్న అధికారులు.. ఎందుకంటే..
భూమిలోపల 60 బైకులు.. అసలేమైందంటే..
For More TG News and Telugu News..