Share News

MROs: ఆ ఆఫీసులో పని చేయాలంటే భయపడుతున్న అధికారులు.. ఎందుకంటే..

ABN , Publish Date - Sep 03 , 2025 | 10:12 AM

విశాఖపట్నం.. ఆంధ్రప్రదేశ్‌కు ఆర్థిక రాజధానిగా మారుతోంది. దీంతో ఆ ప్రాంతంతోపాటు పరిసర ప్రాంతాల్లోని భూముల ధరలు భారీగా పెరిగాయి. విశాఖలో అంతర్భాగమైన అనకాపల్లి కొత్త జిల్లాగా ఏర్పాటు అయింది. దీంతో ఈ జిల్లాలో సైతం భూముల ధరలు ఆకాశానంటాయి.

MROs: ఆ ఆఫీసులో పని చేయాలంటే భయపడుతున్న అధికారులు.. ఎందుకంటే..
Anakapalle MROs

అనకాపల్లి, సెప్టెంబర్ 03 : జిల్లా కేంద్రం అనకాపల్లి పట్టణంలో తహశీల్దారు ఉద్యోగమంటే ప్రత్యేక గుర్తింపు ఉంటుంది. ఇక్కడ తహ శీల్దారుగా పనిచేయడానికి చాలా మంది ఆసక్తి చూపుతారు. కానీ కొంతకాలంగా ఇక్కడ పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. అనకాపల్లి తహశీల్దారు పోస్టు అంటేనే చాలా మంది వెనకడుగు వేస్తున్నారు. స్థానిక నేతల ఒత్తిళ్లే ఇందుకు ప్రధాన కారణమని తెలుస్తోంది. మూడు నెలల కిందట జరిగిన బదిలీల సందర్భంగా అనకాపల్లి తహశీల్దారుగా వచ్చేందుకు ఒక్కరు కూడా ఆప్షన్ ఇవ్వలేదు. దీంతో ఆర్డీఓ కార్యాలయం ఏఓ.. తహశీల్దారు విధులు నిర్వహించారు.


పరిపాలనా పరమైన ఇబ్బందులు ఎదురవుతున్నాయని పలువురు ఫిర్యాదులు చేయడంతో జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ చొరవ తీసుకొని ఎస్. రాయవరం తహశీల్దారుగా పనిచేస్తున్న విజయకుమార్‌ను అనకాపల్లికి బదిలీ చేశారు. కొద్ది రోజులకే ఆయనపై రాజకీయ ఒత్తిళ్లు పెరిగిపోవడంతో కలెక్టరేట్ ఏఓగా ఆయన బదిలీ చేయించుకుని వెళ్లిపోయారు. ఆ తర్వాత అల్లూరి సీతారామరాజు జిల్లా నుంచి బదిలీపై జిల్లాకు వచ్చిన భాస్కర అప్పారావును అనకాపల్లి తహశీల్దారుగా నియమించారు. ఆయన కూడా ఇక్కడ ఎక్కువ రోజులు పని చేయలేకపోయారు. స్థానిక నేతల నుంచి తీవ్ర ఒత్తిళ్లు రావడంతో రెండు రోజుల కిందట అనారోగ్య సమస్యల పేరుతో ఆయన దీర్ఘకాలిక సెలవుపై వెళ్లిపోయారు.


అనకాపల్లి మండల పరిధిలోని పలు గ్రామాల్లో ల్యాండ్ పూలింగ్, 22ఏ జాబితా నుంచి భూముల తొలగింపు, పట్టాదారు పాసు పుస్తకాలు జారీ, మ్యుటేషన్లు, ప్రభుత్వం సేకరించిన భూములకు పరిహారం చెల్లింపుల్లో బినామీ పేర్లు చేర్చడం వంటివి భారీగా పెరిగినట్లు తెలుస్తోంది. కోడూరు, కుంచంగి, కుండ్రం, అనకాపల్లి ఆవఖండం పరిసరాల్లో భూముల ధరలు పెరగడంతో క్రయవిక్రయాలు సైతం భారీగా పెరిగాయి.


జిల్లాకు చెందిన ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు, ప్రభుత్వ భూముల ఆన్లైన్ రికార్డుల్లో మార్పులు చేయాలని తీవ్ర ఒత్తిడి తేవడం వల్లే తహశీల్దారు భాస్కర అప్పారావు దీర్ఘకాలిక సెలవుపై వెళ్లినట్టు తెలిసింది. జిల్లా అధికారులు ఎంత నచ్చజెప్పినప్పటికీ ఆయన ససేమిరా అన్నట్టు సమాచారం. భాస్కర అప్పారావు స్థానంలో పాయకరావుపేట నుంచి డిప్యూటీ తహశీల్దారును నియమించారు. ఒకటి, రెండు రోజుల్లో ఆయన ఇన్‌చార్జి తహశీల్దారుగా బాధ్యతలు చేపట్టనున్నారని తెలుస్తోంది.

ఈ వార్తలు కూడా చదవండి..

పోటా పోటీగా అన్నా చెల్లెలు..

భూమిలోపల 60 బైకులు.. అసలేమైందంటే..

For More Andhra Pradesh News and Telugu News..

Updated Date - Sep 03 , 2025 | 10:30 AM