Medical Student In Kolkata: వైద్య విద్యార్థిపై గ్యాంగ్ రేప్.. నిందితులు అరెస్ట్
ABN , Publish Date - Oct 12 , 2025 | 08:49 AM
కోల్‌కతాలో వైద్య విద్యార్థిపై సామూహిక అత్యాచారం కేసులో ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.
కోల్‌కతా, అక్టోబర్ 12: కోల్‌కతాలో ఒడిశాకు చెందిన వైద్య విద్యార్థిపై సామూహిక అత్యాచార ఘటనకు సంబంధించిన కేసులో ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆదివారం వీరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. అనంతరం పోలీస్ స్టేషన్‌కు తరలించి విచారిస్తున్నారు.
ఒడిశాలోని బాలేశ్వర్ జిల్లాకు చెందిన యువతి దుర్గాపుర్‌లోని ప్రైవేట్ వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. శుక్రవారం రాత్రి తన స్నేహితులతో కలిసి భోజనం చేసేందుకు బయటకు వెళ్లింది. ఆ సమయంలో దుండగులు వారిని వెంబడించి.. వారిలోని ఒక విద్యార్థిని అటవీ ప్రాంతంలోకి బలవంతంగా తీసుకుని వెళ్లారు. అనంతరం ఆమెపై సామూహిక అత్యాచారానికి తెగబడ్డారు. ఈ విషయాన్ని బహిర్గతం చేస్తే.. తీవ్ర పరిణామాలు ఎదుర్కోవలసి వస్తుందంటూ ఆమెను హెచ్చరించి.. అక్కడి నుంచి పరారయ్యారు.
అయితే వైద్య విద్యార్థి అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. తీవ్ర రక్తస్రావంతో స్పృహ తప్పి పడి ఉన్న ఆమెను స్థానికులు గమనించి.. సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఐసీయూలో ఆమెకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మరోవైపు ఈ సామూహిక అత్యాచార ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనమైంది. దీంతో వైద్య కళాశాల వద్దకు భారీగా వైద్య విద్యార్థులు చేరుకుని ఆందోళనకు దిగారు.
బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని.. అలాగే నిందితులను కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేశారు. దీంతో వైద్య కళాశాల వద్ద ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. వైద్య కళాశాల వద్ద పోలీసులు భారీగా మోహరించారు. ఇంకోవైపు ఈ ఘటనపై జాతీయ మానవ హక్కుల సంఘం స్పందించింది. రాష్ట్రంలో మహిళలపై నేరాలు పెరుగుతున్నాయంటూ ఆందోళన వ్యక్తం చేసింది. వీటిని కట్టడి చేసేందుకు చర్యలు చేపట్టాలని మమతా బెనర్జీ ప్రభుత్వాన్ని కోరింది. వైద్య విద్యార్థిపై అత్యాచార ఘటన విషయం తెలుసుకున్న ఆమె తల్లిదండ్రులు.. ఆసుపత్రికి చేరుకున్నారు.
2024, ఆగస్టు 9వ తేదీన కోల్‌కతాలో ఆర్జీ కార్ మెడికల్ కాలేజీలో పీజీ వైద్య విద్యార్థిని హత్యాచారానికి గురైంది. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ కేసులో నిందితుడికి కోర్టు శిక్ష ఖరారు చేసిన సంగతి తెలిసిందే.
ఈ వార్తలు కూడా చదవండి..
తురకపాలెం మృతుల కుటుంబాలకు సాయం
ఎమ్మెల్యే కాలేజీలో భారీ చోరీ.. దర్యాప్తు ముమ్మరం
For More National News And Telugu News