New Year Visit These Temples: కొత్త సంవత్సరం.. ఈ దేవాలయాలను సందర్శిస్తే అష్టైశ్వర్యాలు మీ సొంతం..! ..!
ABN , Publish Date - Dec 31 , 2025 | 04:20 PM
2026 నూతన సంవత్సరంలో ఈ దేవాలయాలను సందర్శిస్తే అష్టైశ్వార్యాలతో సంతోషంగా ఉంటారని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. కొత్త సంవత్సరం రోజున ప్రసిద్ధి చెందిన ఈ దేవాలయాలను సందర్శించడం చాలా మంచిదని అంటున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: కొత్త సంవత్సరం అందరూ ఆనందం, శాంతి, ఆరోగ్యం, శ్రేయస్సు కావాలని కోరుకుంటారు. ఆ కోరికలు నెరవేరాలని ఆశిస్తూ చాలా మంది దేవుని దర్శనంతో కొత్త సంవత్సరాన్ని ప్రారంభించాలనుకుంటారు. దేవుడిపై నమ్మకంతో సంవత్సరం మొదలుపెడితే మనసుకు ధైర్యం వస్తుంది, జీవితంలో ముందుకు వెళ్లే శక్తి పెరుగుతుంది. అందుకే ప్రతి సంవత్సరం జనవరి 1న చాలా మంది దేవాలయాలకు వెళ్లి పూజలు చేస్తారు.
ఆలయానికి వెళ్లడం వల్ల మనసుకు ప్రశాంతత లభిస్తుంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. జీవితంలో మంచి మార్పులు రావాలనే ఆశ బలపడుతుంది. 2026 సంవత్సరం ఆనందంగా, శ్రేయస్సుతో ఉండాలని కోరుకునేవారు కొత్త సంవత్సరం రోజున ప్రసిద్ధి చెందిన దేవాలయాలను సందర్శించవచ్చు. ఇలా దేవుని ఆశీస్సులతో సంవత్సరాన్ని ప్రారంభించడం ఒక మంచి అలవాటు, మంచి ఆరంభం అని చాలా మంది నమ్ముతారు.

అయోధ్యలోని రామాలయం
అయోధ్యలోని రామాలయం చాలా పవిత్రమైనది. ఇది శ్రీరాముడు జన్మించిన భూమిగా భావిస్తారు. రామ్ లల్లా ప్రతిష్ట అయిన తర్వాత భక్తుల సంఖ్య మరింత పెరిగింది. జనవరి 1న రామ్ లల్లా దర్శనం చేస్తే మనసు భక్తితో, సానుకూల ఆలోచనలతో నిండిపోతుంది. కొత్త సంవత్సరం ప్రారంభంలో శ్రీరాముడిని దర్శించుకుంటే జీవితంలో గౌరవం, శాంతి, విజయం లభిస్తాయని నమ్ముతారు.
సిద్ధి వినాయక ఆలయం
ఏ కొత్త పని ప్రారంభించాలన్నా ముందుగా గణేశుడిని పూజించడం మంచి సంప్రదాయం. ముంబైలోని సిద్ధి వినాయక ఆలయం దేశంలోనే అత్యంత ప్రసిద్ధ గణేశ ఆలయాల్లో ఒకటి. జనవరి 1న ఇక్కడకు పెద్ద సంఖ్యలో భక్తులు వస్తారు. గణేశుడు జీవితంలోని అడ్డంకులను తొలగిస్తాడని నమ్మకం. కొత్త సంవత్సరం మొదటి రోజున గణేశ దర్శనం చేస్తే సమస్యలు తగ్గి సరైన దారి దొరుకుతుందని విశ్వసిస్తారు. 2026లో అడ్డంకులు లేకుండా జీవితం సాగాలంటే సిద్ధి వినాయక ఆలయాన్ని సందర్శించవచ్చు.

కాశీ విశ్వనాథ ఆలయం
వారణాసిలోని కాశీ విశ్వనాథ ఆలయం శివుడికి అంకితం చేయబడింది. ఇది 12 జ్యోతిర్లింగాల్లో ఒకటి. ఈ ఆలయం గంగానది ఒడ్డున ఉంటుంది. జనవరి 1న గంగానదిలో స్నానం చేసి శివుని దర్శించుకోవడం చాలా శుభప్రదమని అంటారు. శివుడి ఆశీస్సులతో పాపాలు తొలగి, కొత్త శక్తి లభిస్తుందని నమ్మకం. మనశ్శాంతి, ఆధ్యాత్మిక బలం కావాలనుకునే వారు కాశీని సందర్శించవచ్చు.
షిర్డీ సాయిబాబా ఆలయం
మహారాష్ట్రలోని షిర్డీ సాయిబాబా ఆలయం చాలా ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రం. ఇక్కడ సాయిబాబా సమాధి ఉంది. ప్రతి సంవత్సరం లక్షలాది మంది భక్తులు ఇక్కడికి వస్తారు. సాయిబాబా ప్రేమ, నమ్మకం, సమానత్వానికి ప్రతీకగా భావిస్తారు. కొత్త సంవత్సరాన్ని సాయిబాబా దర్శనంతో ప్రారంభిస్తే జీవితంలో శాంతి, సమతుల్యత వస్తుందని నమ్మకం. 2026ను ప్రశాంతంగా, సానుకూలంగా గడపాలనుకునే వారు షిర్డీని సందర్శించవచ్చు.

ఉజ్జయిని మహంకాళి దేవాలయం
మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో మహంకాళి ఆలయం ఉంది. ఇది దక్షిణం వైపు ఉన్న ఏకైక జ్యోతిర్లింగం. ఇక్కడి భస్మ ఆరతి చాలా ప్రసిద్ధి చెందింది. మహాకాలుడిని దర్శిస్తే కాలభయం, మరణభయం తొలగిపోతాయని నమ్మకం ఉంది. 2026లో స్థిరత్వం, ఆత్మవిశ్వాసం, శ్రేయస్సు కోరుకునే వారు ఉజ్జయిని మహాకాల ఆలయాన్ని సందర్శించవచ్చు.
(Note: ఇందులోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా మీకు అందించడం జరుగుతుంది. కేవలం మీ అవగాహన కోసమే.. ABN ఆంధ్రజ్యోతి దీనిని ధృవీకరించలేదు )
Also Read:
న్యూ ఇయర్ పార్టీ.. ఇండియాలో బెస్ట్ బీచ్ డెస్టినేషన్స్ ఏవో తెలుసా?
కొలెస్ట్రాల్ పెరిగినప్పుడు శరీరంలో కనిపించే సంకేతాలు ఇవే.!
For More Latest News