Share News

Special Trains: ప్రయాణికులకు రైల్వేశాఖ గుడ్‌న్యూస్.. పండుగ‌ల సంద‌ర్భంగా ప్రత్యేక రైళ్లు..

ABN , Publish Date - Oct 03 , 2025 | 06:52 AM

విశాఖ టు దానాపూర్ ఎక్స్‌ప్రెస్ స్పెష‌ల్ ట్రైన్ నవంబర్ నెల 4వ తేదిన ఉదయం 9.10 గంటలకు విశాఖలో బయలుదేరుతోంది. ఆ మరుసటి రోజు ఉదయం 11 గంటలకు దానాపూర్ చేరుకుంటుంది.

Special Trains: ప్రయాణికులకు రైల్వేశాఖ గుడ్‌న్యూస్.. పండుగ‌ల సంద‌ర్భంగా ప్రత్యేక రైళ్లు..
Train

ఇంటర్నెట్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు రైల్వేశాఖ గుడ్‌న్యూస్ చెప్పింది. దీపావళితో పాటూ ఛత్ వంటి పండుగల సందర్భంగా పలు ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు ప్రకటించింది. పండుగ‌ల వేళ ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని రైల్వేశాఖ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. విశాఖ టు దానాపూర్, దానాపూర్ టు విశాఖ మధ్య ప‌లు స్పెష‌ల్ ట్రైన్స్‌, విశాఖ-భువనేశ్వర్‌-విశాఖ మధ్య అన్‌రిజర్వుడ్‌ ప్రత్యేక రైలు నడుపుతున్నట్లు తెలిపింది. ఈ మేరకు ఆ ట్రైన్ల వివ‌రాల‌తో కూడిన ప్రకటనను రైల్వేశాఖ విడుదల చేసింది.


విశాఖ టు దానాపూర్..

విశాఖ టు దానాపూర్ ఎక్స్‌ప్రెస్ స్పెష‌ల్ ట్రైన్ నవంబర్ నెల 4వ తేదిన ఉదయం 9.10 గంటలకు విశాఖలో బయలుదేరుతోంది. ఆ మరుసటి రోజు ఉదయం 11 గంటలకు దానాపూర్ చేరుకుంటుంది. అక్కడి నుంచి మళ్లీ నవంబరు 5వ తేదిన మధ్యాహ్నం 12.30 గంటలకు దానాపూర్ టు విశాఖ స్పెష‌ల్ ట్రైన్‌ బయలుదేరుతోంది. అక్కడి నుంచి తిరుగు ప్రయాణంలో ఆ మ‌రుస‌టి రోజు మధ్యాహ్నం 2.42 గంటలకు విశాఖ స్టేష‌న్‌కు చేరుకుంటుంది. ఈ ట్రైన్‌లో 3 థర్డ్‌ ఏసీ, 12 స్లీపర్, 5 జనరల్‌ సెకండ్‌ క్లాస్‌ సిట్టింగ్, 2 సెకండ్‌ క్లాస్‌ కమ్‌ దివ్యాంగజన్‌ బోగీలు ప్రయాణికుల‌కు అందుబాటులో ఉంటాయని రైల్వేశాఖ తెలిపింది.


విశాఖ టు భువనేశ్వర్..

విశాఖపట్నం టు భువనేశ్వర్ అన్‌రిజర్వుడ్ స్పెష‌ల్ ట్రైన్ నవంబరు 15వ తేదీ వరకు ప్రతి రోజు మధ్యాహ్నం 12 గంటలకు విశాఖలో అందుబాటులో ఉండనుంది. అక్కడి నుంచి బయలుదేరి అదే రోజు రాత్రి 7.45గంటలకు భువనేశ్వర్ చేరుకుంటుంది. మళ్లీ తిరుగు ప్రయాణంలో భువనేశ్వర్ టు విశాఖపట్నం అన్‌రిజర్వుడ్ స్పెష‌ల్ ట్రైన్ అదే రోజు రాత్రి 10.30 గంటలకు భువనేశ్వర్‌లో బయలుదేరుతోంది. మ‌రుస‌టి రోజు ఉదయం 8.45 గంటలకు విశాఖపట్నం స్టేష‌న్‌కు వస్తుంది. ఈ ట్రైన్‌లో 1 దివ్యాంగజన్, 1 మోటార్‌ కార్‌ బోగీలు, 10 జనరల్‌ సెకండ్‌ క్లాస్‌ సిట్టింగ్ అందుబాటులో ఉంటాయి.


స్పెష‌ల్ రైళ్లు..

దేశవ్యాప్తంగా దీపావళి, ఛత్ పండ‌గుల సమయంలో ప్రయాణీకుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ఇండియ‌న్ రైల్వే మ‌రో ఏడువేల ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు తెలిపింది. వీటితోపాటు రైల్వేస్టేష‌న్లలో ప‌లు కొత్త విధానాల‌ను కూడా అమ‌ల్లోకి తీసుకొచ్చింది. రైళ్లలోని జనరల్ బోగీల్లో ఎక్కే ప్రయాణికుల సౌకర్యార్థం రైల్వే స్టేషన్లలో ప్లాట్‌ఫాంలపై క్యూలైన్ విధానాన్ని అమలు చేయనున్నట్లు సమాచారం.

అయితే.. పండుగల నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే మొత్తం 26 స్పెష‌ల్ రైళ్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. కాచిగూడ టు నిజాముద్దీన్‌‌‌‌, నాందేడ్‌‌‌‌ -పానిపట్‌‌‌‌, నాందేడ్‌‌‌‌-పాట్నా, ఛాప్రా-యశ్వంత్‌‌‌‌పూర్‌‌‌‌, చెన్నైటు అంబాలా కంటోన్మెంట్‌‌‌‌ మార్గాల్లో దీపావళి పండుగ స్పెష‌ల్ ట్రైన్స్‌ను తీసుకొచ్చారు. ఈ ప్రత్యేక రైళ్లతో పాటుగా పలు ప్రధాన రైల్వే స్టేషన్లలో 14 అదనపు కౌంటర్లను కూడా ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. ఇందుకోసం సికింద్రాబాద్, హైదరాబాద్, కాచిగూడ, విజయవాడ, గుంటూరు, తిరుపతి తదితర స్టేషన్లలో అదనపు సిబ్బందిని కూడా నియమించినట్లు అధికారులు వెల్లడించారు.


ఇవి కూడా చదవండి..

Ind-China Flight Service: కుదిరిన అంగీకారం.. భారత్, చైనా మధ్య ఈ నెలాఖరు నుంచీ..

President Murmu At Red Fort Dasara: ఉగ్రవాదంపై విజయానికి ప్రతీక ఆపరేషన్ సిందూర్

Updated Date - Oct 03 , 2025 | 06:57 AM