Chitrajyothi: ఈ ఏడాది అంతా అదరగొట్టేశారుగా..!
ABN , Publish Date - Dec 28 , 2025 | 07:12 AM
ఎంటర్‌టైన్‌మెంట్ పోర్టల్ ‘ఇంటర్నెట్ మూవీ డేటాబేస్’ (ఐఎమ్‌డీబీ)... ఈ ఏడాది అత్యంత ప్రజాదరణ పొందిన భారతీయ సినీతారల జాబితాను ప్రకటించింది. అందం, అభినయంతో ప్రేక్షకులను మెప్పించి, టాప్-10లో చోటు దక్కించుకున్న భామలే వీళ్లు...
యువరాణిగా అలరించింది...
అందాల తార రుక్మిణీ వసంత్ ఈ ఏడాది ‘ఏస్’, ‘మదరాసి’, ‘కాంతార: ఛాప్టర్ 1’ సినిమాలతో పలకరించింది. ముఖ్యంగా ‘కాంతార’లో యువరాణి కనకవతి పాత్రకు ప్రాణం పోసి ప్రేక్షకులను కట్టిపడేసింది. సినీ ప్రముఖులు మొదలు ఫ్యాన్స్ దాకా ‘రుక్మిణి ఓ అద్భుతమైన నటి’ అంటూ పొగడ్తలతో ముంచెత్తారు. రాబోయే ఎన్టీఆర్- ప్రశాంత్ నీల్ సినిమాలోనూ ఈమే కథానాయిక. యశ్ కొత్త సినిమా ‘టాక్సిక్’లోనూ ఉందనే వార్తలు సోషల్ మీడియాలో విపరీతమైన క్రేజ్‌ను తెచ్చిపెట్టాయి. దాంతో ‘మోస్ట్ పాపులర్ స్టార్స్’ లిస్ట్‌లో తొమ్మిదో స్థానంలో ఉంది.
అదే ‘స్పిరిట్’

‘యానిమల్’ సినిమాతో నేషనల్ క్రష్‌గా గుర్తింపు తెచ్చుకుంది త్రిప్తి దిమ్రీ. ఒకే ఒక్క విజయంతో అన్ని భాషల్లోనూ అభిమానులను సంపాదించుకుంది. ఆమె నటించిన ‘ధడక్ 2’ ఓటీటీలో దుమ్మురేపింది. సెన్షేషనల్ దర్శకుడు సందీప్‌రెడ్డి వంగా రూపొందిస్తున్న ‘స్పిరిట్’లో ప్రభాస్ సరసన ఆఫర్ కొట్టేసి, పాపులారిటీ జాబితాలో ఎనిమిదో స్థానం దక్కించుకుంది.
‘లోకం’ మెచ్చింది

‘లోక చాప్టర్ 1: చంద్ర’ (తెలుగులో ‘కొత్త లోక’) చిత్రంతో ఈ ఏడాది థియేటర్లలో సందడి చేసింది కల్యాణి ప్రియదర్శన్. దేశంలోనే తొలి ఫీమేల్ సూపర్ హీరో సినిమా ఇదే కావడం విశేషం. చిన్న చిత్రంగా విడుదలై... అత్యధిక వసూళ్లు రాబట్టిన తొలి మలయాళీ చిత్రంగానూ రికార్డు సృష్టించింది. మలయాళ హీరో దుల్కర్ సల్మాన్ కేవలం రూ. 30 కోట్ల బడ్జెట్‌తో నిర్మించిన ఈ చిత్రం విడుదలైన 40 రోజుల్లో రూ. 300 కోట్లు వసూలు చేసి ఔరా అనిపించింది. కల్యాణి జాబితాలో ఏడో స్థానంలో నిలిచింది.
ఒకే ఒక్క సినిమాతో...

‘సైయారా’తో ఈ ఏడాది ‘టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ’గా మారింది అనీత్ పడ్డా. అల్జీమర్స్ బాధితురాలిగా తన అభినయంతో తెరపై భావోద్వేగాల్ని పండించి, యువతరం హృదయం కొల్లగొట్టిన అనీత్ లిస్ట్‌లో ‘టాప్ 2’లో నిలిచింది. ‘నా జీవితాన్ని మలుపు తిప్పింది ‘సైయారా’. ఆ విజయం నుంచి నా జీవితంలో వచ్చిన మార్పును నేను ఇప్పుడిప్పుడే అర్థం చేసుకుంటున్నా. ప్రేక్షకుల ఆదరణే ఈ విజయాన్ని నాకు సాధ్యమయ్యేలా చేసింద’ని చెప్తూ తెగ సంబరపడిపోతోందీ బ్యూటీ.
‘విజయ’ నామ సంవత్సరం

ఈ ఏడాది రష్మికకు ‘విజయ’ నామ సంవత్సరంగా చెప్పొచ్చు. ఐదు విభిన్న చిత్రాలతో పాన్ ఇండియా స్థాయిలో మెరుపులు మెరిపించింది. ఈ ఏడాది ఆరంభంలో ‘ఛావా’లో మరాఠీ రాణి ఏసుబాయిగా రాజసం ఒలికించి అందర్నీ మెప్పించింది. ఆ తర్వాత సల్మాన్‌ఖాన్ ‘సికిందర్’లో, ధనుష్‌తో ‘కుబేర’లో కనిపించింది. ‘థామా’లో భేతాళ యువతిగా అందర్నీ భయపెడుతూనే.. మరోవైపు యాక్షన్‌తోనూ ఆశ్చర్యపరిచింది. అదే జోరును ‘ది గర్ల్‌ఫ్రెండ్’తోనూ కొనసాగించింది. మరోవైపు విజయ్ దేవరకొండతో నిశ్చితార్థం వార్తలతో ట్రెండింగ్‌లో నిలిచి, జాబితాలో ఆరో స్థానం దక్కించుకుంది.
ఈ వార్తలు కూడా చదవండి..
బ్రేకులే లేనట్టు దూసుకుపోతున్న పసిడి, వెండి!
ఆ మావోయిస్టులకు ఆశ్రయం ఇవ్వొద్దు
Read Latest Telangana News and National News