పెళ్లిలో కళకళలాడాలంటే.. ఎటువంటి ఆహారం తీసుకోవాలి
ABN , Publish Date - Dec 21 , 2025 | 11:41 AM
పెళ్లి పనుల హడావిడిలో ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకుండా ఈ రెండు నెలల్లో క్రమం తప్పకుండా కొన్ని అలవాట్లను పాటించాచాలి. ఆరోగ్యంగా ఉండడానికి, ముఖ్యంగా మూడు విషయాలపైన శ్రద్ధ పెట్టాలి- సమతుల ఆహారం, శారీరక వ్యాయామం, సరిపడా నిద్ర.
మరో రెండు నెలల్లో నా పెళ్లి. ఈ మధ్యలో ఎటువంటి ఆహారం తీసుకొంటే పెళ్లి నాటికి కళకళలాడుతూ, ఉత్సాహంగా ఉంటుంది?
- మనీష, కర్నూల్
పెళ్లి పనుల హడావిడిలో ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకుండా ఈ రెండు నెలల్లో క్రమం తప్పకుండా కొన్ని అలవాట్లను పాటించాచాలి. ఆరోగ్యంగా ఉండడానికి, ముఖ్యంగా మూడు విషయాలపైన శ్రద్ధ పెట్టాలి- సమతుల ఆహారం, శారీరక వ్యాయామం, సరిపడా నిద్ర. వ్యాయామం చేస్తున్నాం కాబట్టి, ఆహారం ఎలా తీసుకున్నా పర్యాలేదు అనే భ్రమ పనికిరాదు. రోజుకు అరలీటరు పాలు లేదా పెరుగు, రెండు కప్పుల కూరగాయలు, రెండు రకాల పళ్ళు, మొలకెత్తిన గింజలు మీ ఆహారంలో భాగం చేసుకోండి. ముఖ్యంగా రంగుల్లో ఆకర్షణీయంగా ఉండే దానిమ్మ, బొప్పాయి, పుచ్చ, కర్బుజా లాంటి పళ్ళను ఎక్కువగా తీసుకుంటే వాటిలో యాంటీఆక్సిడెంట్స్ వల్ల చర్మ సౌందర్యం కూడా ఇనుమడిస్తుంది.
అలాగే వీలున్నంత వరకు అన్నం బదులుగా చిరు ధాన్యాలైన రాగులు, జొన్నలు, సజ్జలు, కొర్రలు మొదలైనవి తీసుకుంటే మీ బరువును నియంత్రించు కోవచ్చు. అన్ని రకాల తీపి పదార్థాలు, జంక్ ఫుడ్స్‌కు దూరంగా ఉండాలి. వీటితో పాటు రోజుకు కనీసం రెండున్నర నుంచి మూడు లీటర్ల నీళ్లు తాగాలి. కనీసం ముప్పావుగంట నుంచి గంట వరకు వ్యాయామం చేయడం తప్పనిసరి. వ్యాయామం వల్ల బరువు నియంత్రణలో ఉండడమే కాక చర్మం మంచి మెరుపును సంతరించుకుంటుంది. అలాగే సమయానికి నిద్ర చాలా ముఖ్యం. కనీసం ఏడు నుంచి ఎనిమిది గంటలు నిద్రపోవాలి. బరువు తగ్గడానికి క్రాష్ డైట్‌లు, డీటాక్స్ డైట్‌లు లాంటి వాటిని పెళ్లి కోసం పాటిస్తే, తగ్గిన బరువు కన్నా ఎక్కువ ఆ తరవాత పెరిగే అవకాశం ఉంది. పైగా కొన్ని ఆరోగ్య సమస్యలూ రావొచ్చు.
నాకిప్పుడు అయిదో నెల. గర్భంతో ఉన్నప్పుడు చియా గింజలు తీసుకోవచ్చా? వీటివల్ల ఉపయోగాలేమిటి?
- భవ్య, కరీంనగర్
నువ్వుగింజ కన్నా చిన్నగా నలుపు, తెలుపు, బూడిద రంగుల్లో కలగలుపుగా చియా గింజలు ఉంటాయి. వీటిని నీళ్లలో నానబెట్టినప్పుడు ఆ నీటిని పీల్చుకొని ఓ జెల్ లాంటి పదార్థం తయారవుతుంది. చియా గింజల్లో పీచు పదార్థం, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ముఖ్యంగా ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ చియా గింజల నుంచి లభిస్తాయి. ఈ ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ గర్భస్థ పిండం ఎదుగుదలకు ఉపయోగపడతాయి. చియా గింజల్లో ఉండే క్యాల్షియం, ఐరన్ కూడా ప్రెగ్నెన్సీ సమయంలో ఆవశ్యక పోషకాలు. కొంత మంది గర్భిణులు నెలలు నిండేకొద్దీ మలబద్ధకం సమస్యతో బాధపడతారు. చియా గింజలలో ఉండే పీచుపదార్థాలు ఈ సమస్య తీర్చేందుకు సహాయపడ తాయి. రక్తంలో గ్లూకోజును నియంత్రించేందుకు చియా గింజలు పనిచేస్తాయి. చియా సీడ్స్‌కి నీటిని బాగా పీల్చుకునే గుణం ఉండడం వల్ల ఇవి ఆహారంలో చేర్చుకున్నప్పుడు తగినంత నీళ్లు తీసుకోకపోతే ఇబ్బందులొచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ విషయాన్ని మీరు మర్చిపోకండి.
కాకరకాయ చేదే కానీ ఆరోగ్యానికి చాలా మంచిదంటారు కదా. కాకరకాయల్లో ఉండే పోషకవిలువలు తెలపండి.
- అరుణ్ కిషోర్, విజయవాడ
కాకరకాయ చేదుగా ఉన్నప్పటికీ, ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో ఉన్నాయి. ఇందులో విటమిన్ సి అధికంగా ఉండటం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఇన్ఫెక్షన్లను దూరంగా ఉంచుతుంది. కాకరకాయలోని ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరచి, మల బద్ధకాన్ని తగ్గిస్తుంది. అలాగే అందులో ఉన్న విటమిన్ ఎ కళ్ల ఆరోగ్యాన్ని కాపాడుతుంది, చర్మాన్ని మెరుగు పరుస్తుంది. ఫోలేట్, ఐరన్ లాంటి పోషకాలు రక్త కణాల నిర్మాణానికి, రక్తహీనత తగ్గించడానికి ఉపయోగపడతాయి.
అదనంగా, పొటాషియం, మెగ్నీషియం, జింక్ లాంటి ఖనిజాలు గుండె ఆరోగ్యాన్ని, మెటబాలిజం, హార్మోన్ల సమతుల్యతను మెరుగు పరుస్తాయి. కాకరకాయలో ఉండే యాంటీఆక్సిడెంట్లు శరీరంలోని ఇన్‌ఫ్లమేషన్‌ను నియంత్రించేందుకు సహాయపడతాయి. వీటిల్లో ఉండే పాలీ పెప్‌టైడ్ లు రక్తంలో గ్లూకోజును నియంత్రించి డయాబెటీస్ అదుపులో ఉండేలా సహాయపడతాయి. కాకర కాయలు వండేప్పుడు చేదు తగ్గించ డానికి వాటిలోని నీటిని పిండేస్తే ఈ ఆరోగ్య ప్రయోజనాలను అందించే చాలా పదార్థాలు వృథా అయిపో తాయి. బాగా వేడి నూనెల్లో డీప్ ఫ్రై చేయడం వల్ల విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్ల పరిమాణం తగ్గిపోతుంది. అందుకే తక్కువ నూనెతో, ఆవిరిపై లేదా నీళ్లతో ఉడికించి కూరగా చేసుకొని తీసుకోవడం మేలు.
డా. లహరి సూరపనేని
న్యూట్రిషనిస్ట్, వెల్‌నెస్ కన్సల్టెంట్
(పాఠకులు తమ సందేహాలను
sunday.aj@gmail.com కు పంపవచ్చు)
ఈ వార్తలు కూడా చదవండి..
బీఆర్‌ఎస్, కాంగ్రెస్‌లకు రాజ్యాంగంపై గౌరవం లేదు
చిరిగిన జీన్స్.. స్లీవ్‌లెస్ పై నిషేధం
Read Latest Telangana News and National News