Totakura Liver Fry: సూపర్ టేస్టీ తోటకూర లివర్ ఫ్రై .. ఒక్కసారి ట్రై చేయండి!
ABN , Publish Date - Oct 04 , 2025 | 11:05 AM
తోటకూర లివర్ ఫ్రై ఎప్పుడైన తిన్నారా? దీని టేస్ట్ సూపర్‌గా ఉంటుంది. ఒక్కసారి మీరు కూడా ఇంట్లో ఇలా ట్రై చేయండి.!
ఇంటర్నెట్ డెస్క్: లివర్ ఫ్రై అంటే ఇష్టపడని వారు ఎవ్వరూ ఉండరు. అలాంటిది, ఆరోగ్యకరమైన ఆకుకూరలతో లివర్ ఫ్రై చేస్తే వచ్చే ఆ టేస్ట్ వేరే లెవల్. మీరు తోటకూర లివర్ ఫ్రైని ఎప్పుడైన తిన్నారా? ఒక్కసారి ఇలా ఇంట్లో ట్రై చేయండి. ఇది సూపర్ టేస్టీగా ఉంటుంది. సో లేట్ చేయకుండా తోటకూర లివర్ ఫ్రైని ఎలా చేయాలో తెలుసుకుందాం..
కావాల్సిన పదార్థాలు
లేత తోటకూర కట్టలు- నాలుగు
పుట్నాల పొడి- అర కప్పు
అల్లం ముక్కలు- చిన్నవి రెండు
వెల్లుల్లి రెబ్బలు- మూడు
పచ్చి మిర్చి- ఆరు
జీలకర్ర- ఒక చెంచా
కార్న్‌ఫ్లోర్- రెండు చెంచాలు
ఉప్పు- తగినంత
నూనె- తగినంత
సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు- ఒక కప్పు
కరివేపాకు- కొద్దిగా
పసుపు- అర చెంచా
అల్లం వెల్లుల్లి పేస్టు- ఒక చెంచా
ధనియాల పొడి- ఒక చెంచా
కారం- ఒక చెంచా
గరం మసాల పొడి- ఒక చెంచా
పెరుగు- అర కప్పు
మిరియాల పొడి- అర చెంచా
కొత్తిమీర తరుగు- కొద్దిగా
నిమ్మకాయ- ఒకటి

తయారీ విధానం
తోటకూరలో లావుపాటి కాడలను తొలగించాలి. తరువాత నీళ్లు పోస్తూ రెండు లేదా మూడు సార్లు శుభ్రంగా కడగాలి. స్టవ్ మీద గిన్నె పెట్టి సగానికి పైగా నీళ్లు పోసి మరిగించాలి. అందులో తోటకూర వేసి రెండు నిమిషాలు ఉడికించి వెంటనే ఒక పళ్లెంలోకి తీసి చల్లార్చాలి. మిక్సీలో అల్లం ముక్కలు, వెల్లుల్లి రెబ్బలు, అర చెంచా జీలకర్ర, పచ్చి మిర్చి, పావు చెంచా ఉప్పు, ఉడికించిన తోటకూర వేసి మెత్తగా గ్రైండ్ చేయాలి. వెడల్పాటి గిన్నెలో కార్న్‌ఫ్లోర్, పుట్నాల పొడి, తోటకూర పేస్టు వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ఒక గిన్నెలో సమంగా పరచాలి. స్టవ్ మీద ఇడ్లీ కుక్కర్ పెట్టి అందులో నీళ్లు పోసి మరిగించాలి. ఆపైన తోటకూర మిశ్రమం ఉన్న గిన్నెను ఉంచి పది నిమిషాలపాటు ఆవిరి మీద ఉడికించి దించాలి. ఈ మిశ్రమం పూర్తిగా చల్లారాక చిన్న ముక్కలుగా కోయాలి. స్టవ్ మీద మూకుడు పెట్టి సగానికి పైగా నూనె పోసి వేడిచేయాలి. అందులో తోటకూర మిశ్రమంతో చేసిన ముక్కలు వేసి, దోరగా వేయించి పళ్లెంలోకి తీయాలి. ఇవి అచ్చం లివర్ ముక్కల్లాగే ఉంటాయి.

స్టవ్ మీద మందపాటి గిన్నె పెట్టి అందులో నాలుగు చెంచాల నూనె వేసి వేడిచేయాలి. ఆపైన జీలకర్ర, కరివేపాకు, పసుపు, ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్టు వేసి బాగా కలపాలి. ఉల్లిపాయ ముక్కలు ఎర్రగా వేగిన తరువాత ధనియాల పొడి, కారం, కొద్దిగా ఉప్పు, గరం మసాల పొడి, పెరుగు వేసి కలపాలి. నూనె పైకి తేలేవరకూ కలుపుతూనే ఉండాలి. తరువాత వేయించిన ముక్కలు, కొత్తిమీర వేసి పైకి కిందికి టాస్ చేయాలి. మూతపెట్టి అయిదు నిమిషాలు మగ్గించాలి. చివరగా మిరియాల పొడి చల్లి స్టవ్ మీద నుంచి దించాలి. తరువాత నిమ్మరసం చిలకరించి వేడివేడిగా సర్వ్ చేయాలి.
Also Read:
దసరాకు 101 వంటకాలతో భోజనం.. చిన్న పొరపాటు జరగడంతో కొత్త అల్లుడికి తులం బంగారం
విషమిచ్చి చంపారు.. సింగర్ జుబీన్ మృతి కేసులో అనూహ్య ట్విస్ట్
For More Latest News