Share News

Yemen Houthi Rebels Attack: కార్గో నౌకపై హూతీ దాడి.. టైటానిక్‌లా మునిగిన నౌక.. వీడియో వైరల్..!

ABN , Publish Date - Jul 09 , 2025 | 06:07 PM

ఎర్ర సముద్రంపై కార్గో నౌక దాడికి సంబంధించిన వీడియోను యెమెన్ హూతీ తిరుగుబాటుదారులు విడుదల చేశారు. టైటానిక్ షిప్‌ను తలపించే భారీ నౌక రెప్పపాటులో నీటిలో మునిగిపోతున్న దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

Yemen Houthi Rebels Attack: కార్గో నౌకపై హూతీ దాడి.. టైటానిక్‌లా మునిగిన నౌక.. వీడియో వైరల్..!
Yemen Houthi Cargo Ship attack Video

Yemen Houthi Rebels Attack Video: యెమెన్ హూతీ తిరుగుబాటుదారులు జులై 6, 2025న ఎర్ర సముద్రంలో లైబీరియా జెండాతో వెళుతున్న కార్గో నౌకపై భయంకరమైన దాడి చేశారు. గ్రీక్ యాజమాన్యంలోని బల్క్ క్యారియర్ ‘మ్యాజిక్‌ సి’పై డ్రోన్లు, క్షిపణులు, రాకెట్‌ ప్రొపెల్డ్‌ గ్రెనేడులు, ఇతర ఆయుధాలతో విరుచుకుపడ్డారు. క్షణాల్లోనే ఓడ మంటల్లో చిక్కుకుని భారీ పేలుడు సంభవించింది. అనంతరం టైటానిక్ తరహాలోనే కార్గో నౌక ముక్కలు ముక్కలుగా విరిగి సముద్రంలో మునిగిపోయింది. ఈ దాడికి సంబంధించిన పూర్తి వీడియోను హూతీ రెబల్స్ తాజాగా విడుదల చేశారు.


గ్రీక్ యాజమాన్యంలోని బల్క్ క్యారియర్ ‘మ్యాజిక్‌ సి’పై యెమెన్ హూతీ తిరుగుబాటుదారులు జులై 6, 2025న దాడి చేశారు. సూయజ్‌ కాలువ దిశగా వెళుతుండగా చిన్న పడవల్లో వచ్చిన దుండగులు తొలుత కాల్పులు జరిపారు. అనంతరం నౌకపై డ్రోన్లు, క్షిపణులు, రాకెట్‌ ప్రొపెల్డ్‌ గ్రెనేడులు, ఇతర ఆయుధాలతో పెద్ద ఎత్తున దాడి చేయగా.. క్షణాల వ్యవధిలో భారీ పేలుడు సంభవించి కార్గో నౌక సముద్రంలో మునిగిపోయింది. ఓడలోని 22 మంది సిబ్బందిలో ముగ్గురు మృతి చెందగా.. ఇద్దరు తీవ్రంగా గాయపడినట్టు యురోపియన్‌ యూనియన్‌ నేవల్‌ ఫోర్స్‌ ధృవీకరించింది. మిగతా సిబ్బంది ఓడ నుంచి దూకి తమ ప్రాణాలను నిలబెట్టుకున్నారు. దాడికి బాధ్యత వహిస్తూ హూతీలు తాజాగా ఓ వీడియోను విడుదల చేశారు.


ప్రపంచ దేశాల వాణిజ్యానికి సూయజ్ కాలువ అత్యంత కీలకమైనది. కానీ, ఈ దారిలో ఓడలు పయనించకుండా హూతీ రెబల్స్ పదే పదే దాడులు చేస్తుండటంతో.. అంతర్జాతీయంగా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ దాడి సముద్ర భద్రతను సవాలు చేయడమే కాకుండా మధ్యప్రాచ్యంలో ఇప్పటికే సంక్లిష్టంగా ఉన్న భౌగోళిక రాజకీయ పరిస్థితిని కూడా క్లిష్టతరం చేస్తోంది.


ఇవి కూడా చదవండి..

శని గ్రహాన్ని ఏదైనా ఢీకొట్టిందా? ఆ మెరుపునకు కారణమేంటి.. పరిశోధనలో ఖగోళ శాస్త్రజ్ఞులు..

కనిపిస్తే కాల్చేయండి.. బంగ్లా మాజీ ప్రధాని షేక్ హసీనా ఆడియో లీక్
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jul 09 , 2025 | 06:51 PM