Saturn: శని గ్రహాన్ని ఏదైనా ఢీకొట్టిందా? ఆ మెరుపునకు కారణమేంటి.. పరిశోధనలో ఖగోళ శాస్త్రజ్ఞులు..
ABN , Publish Date - Jul 09 , 2025 | 03:50 PM
జులై 5వ తేదీన నాసా ఉద్యోగి, ఖగోళ శాస్త్రజ్ఞుడు నాసా డిస్క్‌పై ప్రభావవంతమైన మెరుపును గుర్తించి రికార్డు చేశాడు. శనిగ్రహాన్ని ఢీకొట్టిన వస్తువుకు సంబంధించి ఇదే మొట్ట మొదటి రికార్డింగ్ అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
మన సౌరకుటుంబంలోని ముఖ్యమైన గ్రహం అయిన శని గ్రహాన్ని (Saturn) ఏదో భారీ వస్తువు ఢీకొట్టిందా? జులై 5వ తేదీన నాసా (NASA) శాస్త్రవేత్త గుర్తించిన ఆ మెరుపు (Flash on Saturn)నకు కారణం ఏంటి? ఈ దిశగా ప్రస్తుతం ఖగోళ శాస్త్రజ్ఞులు పరిశోధనలు సాగిస్తున్నారు. జులై 5వ తేదీన నాసా ఉద్యోగి, ఖగోళ శాస్త్రజ్ఞుడు మారియో రానా నాసా డిస్క్‌పై ప్రభావవంతమైన మెరుపును గుర్తించి రికార్డు చేశాడు. శనిగ్రహాన్ని ఢీకొట్టిన శకలానికి సంబంధించి ఇదే మొట్ట మొదటి రికార్డింగ్ అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
శనిగ్రహంపై ఈ మెరుపునకు సంబంధించిన ఫుటేజ్‌ను ప్రస్తుతం ప్లానెటరీ వర్చువల్ అబ్జర్వేటరీ అండ్ లేబరేటరీ (PVOL) విభాగం ఆధ్వర్యంలో పరిశీలిస్తున్నారు. కో-ఆర్డినేటెడ్ యూనివర్సల్ టైమ్ (UTC) ప్రకారం జులై 5వ తేదీ ఉదయం 9-9:15 గంటల మధ్యలో ఈ మెరుపు కనిపించిందట. ఆ సమయంలో శనిగ్రహాన్ని చిత్రీకరించిన ఇతర వీడియోలను కూడా పరిశీలించే పనిలో శాస్త్రవేత్తలు ఉన్నారు. శనిగ్రహం ఉపరితలం పూర్తిగా హైడ్రోజన్, హీలియం వాయువులతో నిండి ఉంటుంది. దీంతో శనిగ్రహం సమీపంలోకి ఏదైన వస్తువు వెళ్లినపుడు అది మండిపోతుంది.
శాస్త్రజ్ఞుల అంచనా ప్రకారం ఒక కిలోమీటరు వెడల్పైన శకలం శనిగ్రహాన్ని ప్రతి 3,125 సంవత్సరాలకు ఒకసారి మాత్రమే ఢీకొట్టగలదట. చిన్న చిన్న శకలాలు మాత్రం శనిగ్రహాన్ని తరచుగానే ఢీకొడతాయట. నాసాకు సంబంధించిన కాస్సిని అంతరిక్ష నౌక గతంలో పంపిన డేటా ప్రకారం, శనిగ్రహం చుట్టూ ఉండే వలయాలు భారీ ఇంపాక్ట్ డిటెక్టర్‌లుగా పని చేస్తాయి. అవి శనిగ్రహం వైపునకు వచ్చే శకలాల వల్ల కలిగే తరంగాలను నమోదు చేస్తాయి.
ఈ వార్తలు చదవండి:
అరబ్బు దేశంలో ఆటోమొబైల్ ఇంజినీర్.. ఆంధ్రలో ఆదర్శ రైతుగా..
యూఎస్ఏలో ఆంధ్రా యూనివర్సిటీ పూర్వ విద్యార్థుల సమ్మేళనం
మరిన్ని అంతర్జాతీయ వార్తలు కోసం క్లిక్ చేయండి..