Share News

NRI: అరబ్బు దేశంలో ఆటోమొబైల్ ఇంజినీర్.. ఆంధ్రలో ఆదర్శ రైతుగా..

ABN , Publish Date - Jul 08 , 2025 | 07:24 PM

సౌదీలో ఇంజినీర్‌గా చేస్తున్న ఓ ఎన్నారై ఏలూరులోని తన స్వగ్రామంలోని రైతులకు అండగా నిలిచారు. రెండో పంటకు సాగు చేసుకునేందుకు వీలుగా సొంత ఖర్చులతో బోరుబావి తవ్వించి చుట్టుపక్కల ఉన్న పొలాలకు సాగు నీటి సౌకర్యం కల్పించారు.

NRI: అరబ్బు దేశంలో ఆటోమొబైల్ ఇంజినీర్.. ఆంధ్రలో ఆదర్శ రైతుగా..
Ramireddy

ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి: అపసవ్య విధానాలు, ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా కుంటుపడుతున్న వ్యవసాయానికి తోడుగా శరవేగంగా కొనసాగుతున్న వలసల వల్ల గ్రామీణ వాతావరణం మారిపోతుంది. దీనికి తోడుగా మెరుగయిన విద్య, ఉపాధి అవకాశాల అన్వేషణలో పుట్టి పెరిగిన ఊళ్ళను మరిచిపోతున్న ఈ కాలంలో విదేశాలలో ఉంటూ కూడా ఆంధ్రప్రదేశ్‌లో తాను పుట్టి పెరిగిన గ్రామంలో వ్యవసాయం గురించి ఆలోచించడమే కాకుండా తన వంతుగా సన్నకారు రైతులకు తోడ్పాటునందించే వారున్నారంటే అశ్చర్యం కలుగక మానదు.

ఇంటిల్లపాదీ కాయకష్టం చేసే సన్నకారు పేద రైతు కుటుంబాలే తెలుగునాట 75 శాతానికి పైగా వ్యవసాయం చేస్తున్నా వారికి ఆశించిన విధంగా సహాయం అందడం లేదని వాపోతున్నారు ప్రవాసీయుడు పామిరెడ్డి రామిరెడ్డి.


ఆటోమొబైల్ ఇంజినీరింగ్ విద్యనభ్యసించిన ఆయన గల్ఫ్‌లో ఉన్నత ఉద్యోగం చేస్తున్నా ప్రవృత్తిరీత్యా కష్టాలలో ఉన్న తెలుగు వారికి సహాయం చేస్తుంటారు. వీటన్నింటికి మించి ఆయన నిరంతరం ఆలోచించేది తను పుట్టిన ఊరు, దాని బాగోగుల గురించే. ఏలూరు జిల్లా పెద్దపాడు మండలం కలపార్రు గ్రామానికి చెందిన రామిరెడ్డి సౌదీ అరేబియాలోని దమ్మాం నగరంలో పని చేస్తూ కుటుంబ సమేతంగా నివసిస్తున్నారు. ఏలూరు హైవే కారణంగా జరుగుతున్న అభివృద్ధి వలన నగర సమీపంలో ఉన్న తమ గ్రామంలో భూగర్భ జలాలు అడుగంటుతున్నాయని ఆందోళన చెందిన ఆయన తన సొంత ఖర్చుతో ఒక బోరుబావిని తవ్వించారు.

ఈ బోరు బావి వలన తన పొలంతో పాటు చుట్టు పక్కల ఉన్న మరో ఎనిమిది మంది సన్నకారు రైతుల పంట పొలాలకు కూడా సాగు నీరందించనున్నట్లుగా రామిరెడ్డి తెలిపారు. వాస్తవానికి తన చుట్టు పక్కల ఉన్న రైతులందరు కూడా వివిధ చిన్న చితకా పనులు చేస్తారని, వీరికి వారసత్వంగా ఈ భూమి సంక్రమించిందని తెలిపారు. ఈ భూమిని విక్రయించకుండా అందులో వ్యవసాయం చేస్తుండడంతో వారికి తన వంతుగా ఈ సహాయం చేశానని రామిరెడ్డి వెల్లడించారు.

సాగు నీరు లేకపోవడంతో తమ గ్రామంలో వర్షాధారిత సార్వ పంటలు మాత్రమే పండిస్తారని తెలిపారు. కానీ ప్రస్తుతం వేయించిన బోర్ బావి కారణాంగా మరో పంట పండించడానికి అవకాశం ఏర్పడిందని ఆయన చెప్పారు.


ప్రపంచవ్యాప్తంగా చిన్న కమతాలలో పేద రైతుల కుటుంబాల ద్వారా 30 శాతం వ్యవసాయ వనరుల ఖర్చుతో 70 శాతం జనాభాకు సరిపోయే ఆహారం పండుతోందని, అదే పెద్ద కమతాలలో ధనిక రైతులు, భూస్వామ్యుల ద్వారా 70 శాతం వ్యవసాయ వనరుల ఖర్చుతో కేవలం 30 శాతం జనాభాకు సరిపోయే ఆహారం మాత్రమే పండుతోందని రామిరెడ్డి పేర్కొన్నారు. ఈ కారణంగా విదేశాలలో ఉంటున్న ప్రవాసీయులు తమకు వీలైన విధంగా తమ తమ గ్రామాల్లో సన్నకారు రైతులకు సహకరించాలని విజ్ఞప్తి చేసారు.

సౌదీ అరేబియాకు రాక ముందు దుబాయి, భారత ఆటోమొబైల్ సంస్థల్లో పని చేసిన రామిరెడ్డి తెలుగు ప్రవాసీ సంఘమైన సాటాలో కూడా కీలక పాత్ర వహిస్తున్నారు.

ఈ వార్తలు చదవండి:

నేను తానా సైనికుడిని...మీ విశ్వాసాన్ని వమ్ము చేయను: ప్రెసిడెంట్ నరేన్ కొడాలి

తానా ముగింపు వేడుకల్లో సమంత జోష్.. అదిరిపోయిన తమన్‌ సంగీతం

Read Latest and NRI News

Updated Date - Jul 08 , 2025 | 07:47 PM