Trump Epstein Connection: ట్రంప్ మెడకు లొలిట ఎక్స్‌ప్రెస్ లొల్లి
ABN , Publish Date - Jul 21 , 2025 | 04:04 AM
హైస్కూలు దశ కూడా దాటని బాలికలతో తాను కామవాంఛలు తీర్చుకోవడమే కాక...
బాలికలపై లైంగికదాడులకు పాల్పడిన జెఫ్రీ ఎప్‌స్టీన్ విమానమది
అందులో ఎప్‌స్టీన్ సొంత దీవికి మైనర్ల అక్రమ రవాణా
ఆ విమానం ఎక్కినవారి జాబితాలో ట్రంప్, బిల్ క్లింటన్ పేర్లు
ట్రంప్, ఎప్‌స్టీన్ సంబంధాలపై వాల్‌స్ట్రిట్ జర్నల్ కథనం
న్యూఢిల్లీ, జూలై 20: హైస్కూలు దశ కూడా దాటని బాలికలతో తాను కామవాంఛలు తీర్చుకోవడమే కాక.. ప్రపంచ ప్రముఖులైన వ్యాపార, రాజకీయ దిగ్గజాలకు, సంపన్నులకు వారిని ఎరగా వేసిన వికృత మనస్కుడు జెఫ్రీ ఎప్‌స్టీన్! అలాంటి వ్యక్తితో ట్రంప్ సంబంధాలపై అమెరికా అట్టుడుకుతోంది. ఎప్‌స్టీన్ తన సొంతవిమానంలో హైప్రొఫైల్ వీవీఐపీలను, బాలికలను.. తన సొంత దీవికి తరలించి అక్కడ సెక్స్ పార్టీలు నిర్వహించేవాడు. పద్దెనిమిదేళ్లు కూడా లేని బాలికలను తరలించేందుకు అతడు ఉపయోగించిన విమానం ‘లొలిట ఎక్స్‌ప్రె్‌స’గా పేరొందింది (రష్యన్ రచయిత వ్లాదిమిర్ నబకోవ్ రాసిన ‘లొలిట’ నవలలో ప్రధాన పాత్రధారి 12 ఏళ్ల బాలికపై కోరిక పెంచుకుంటాడు. ఆ నవల కథాంశం ఆధారంగానే ఎప్‌స్టీన్ విమానానికి ‘లొలిట ఎక్స్‌ప్రెస్’ అనే పేరొచ్చింది). ఆ విమానంలో వెళ్లినవారి వివరాల జాబితాలో.. డోనాల్డ్ ట్రంప్, బిల్ క్లింటన్, బ్రిటన్ రాజవంశానికి చెందిన ప్రిన్స్ ఆండ్రూ, హాలీవుడ్ నటుడు కెవిన్ స్పేసీ.. ఇలా ఎందరో ప్రముఖులున్నారు. ఈ వ్యవహారానికి సంబంధించి తనపై కేసు నమోదు కావడంతో 2019 ఆగస్టులో.. ఎప్‌స్టీన్ జైల్లోనే ఉరి వేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. దానికి సంబంధించిన వీడియో ఫుటేజీని ఎఫ్‌బీఐ ఇటీవలే బయటపెట్టడం.. ‘లొలిట ఎక్స్‌ప్రె్‌స’ను పూర్తిగా ధ్వంసం చేయడానికి రంగం సిద్ధమైన నేపథ్యంలో వాల్‌స్ట్రీట్ జర్నల్ వార్తాసంస్థ ఒక కథనాన్ని ప్రచురించింది. ఎప్‌స్టీన్‌తో డోనాల్డ్ ట్రంప్ సంబంధాలపై పలు ప్రశ్నలు సంధించింది. 2003లో ఎప్‌స్టీన్ 50వ పుట్టినరోజు సందర్భంగా.. అతణ్ని పొగుడుతూ లేఖలు రాసినవారిలో ట్రంప్, బిల్ క్లింటన్ ఉన్నట్టు అందులో పేర్కొంది. దీంతో ఈ అంశం అమెరికాలో ఒక్కసారిగా వైరల్ అయ్యింది. అయితే.. ట్రంప్ మాత్రం ఆ లేఖ తాను రాయలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అదంతా ఫేక్ అంటూ.. వాల్‌స్ట్రీట్ జర్నల్‌పై పరువు నష్టం దావా కూడా వేశారాయన. ఆ విమానంలో తాను ప్రయాణించిన మాట నిజమేగానీ.. ఎప్‌స్టీన్ సొంత దీవికి వెళ్లలేదని చెబుతున్నారు. ఎప్‌స్టీన్ చనిపోయినా.. ఈ వ్యవహారం ఇంకా తనను వదిలిపెట్టకపోవడం ట్రంప్‌కు తలనొప్పిగా మారింది.

ఎవరీ ఎప్‌స్టీన్?
ఏం చేసుకోవాలో తెలియనంత డబ్బున్న వ్యక్తి.. జెఫ్రీ ఎప్‌స్టీన్. 1953లో జన్మించిన ఎప్‌స్టీన్.. డిగ్రీ పూర్తవక ముందే స్థానిక డాల్టన్ స్కూల్‌లో టీచర్‌గా చేరాడు. అక్కడ ముక్కుపచ్చలారని బాలికలతో సైతం అతడు అనుచితంగా ప్రవర్తించాడన్న ఆరోపణలు వచ్చాయి. దీంతో.. 1976లో స్కూల్ యాజమాన్యం అతడిని తొలగించింది. ఆ తర్వాత అతడు బ్యాంకింగ్, ఫైనాన్స్ రంగంలోకి అడుగుపెట్టి రాణించాడు. వర్జిన్ ఐలండ్స్‌లో.. ‘లిటిల్ సెయింట్ జేమ్స్ ఐలండ్’ను కొనుగోలు చేసి అక్కడ బాలికలతో సెక్స్ పార్టీలు నిర్వహించేవాడు. ఈ క్రమంలోనే.. 2006లో.. పద్నాలుగేళ్ల బాలిక తండ్రి ఒకరు అతడిపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఎప్‌స్టీన్ పాపం బద్దలైంది. 2008లో కోర్టు అతణ్ని దోషిగా నిర్ధారించింది 13 నెలల ఖైదు విధించింది. అదే సమయంలో.. వర్క్ రిలీజ్ పేరిట జైల్లోంచి ఎడాపెడా యథేచ్ఛగా బయటకు వచ్చే వీలు కల్పించింది. 2019లో పోలీసులు అతణ్ని మరోసారి అరెస్టు చేశారు. ఈసారి.. లొలిట ఎక్స్‌ప్రెస్‌లో బాలికలను ఫ్లోరిడా నుంచి న్యూయార్క్‌కు అక్రమంగా రవాణా చేశాడన్న ఆరోపణలపై అదుపులోకి తీసుకున్నారు. అభియోగాలను పటిష్ఠంగా నమోదు చేయడంతో.. గతంలోలాగా తప్పించుకునే చాన్స్ లేదని గ్రహించి జైల్లోనే బలవంతంగా ఉసురు తీసుకున్నాడు. అనంతరం 2020 మార్చిలో అతడి విమానాన్ని ఫ్లోరిడాకు చెందిన వరల్డ్ ఏవియేషన్ సర్వీసెస్ కొనుగోలు చేసింది. అయితే.. ఎప్‌స్టీన్ దాన్ని ఎంత నీచమైన పనికి వాడాడో తెలిసిన తర్వాత దాన్ని ఆ సంస్థ నుంచి కొనడానికి ఎవరూ ముందుకు రాలేదు. దీంతో ఇప్పుడు దాన్ని పూర్తిగా ధ్వంసం చేయడానికి సిద్ధమైనట్టు ‘డెయిలీమెయిల్’ వార్తా సంస్థ ఒక కథనంలో తెలిపింది.
ఈ వార్తలు కూడా చదవండి..
రండి.. ఆంధ్రప్రదేశ్‌ను నిర్మించుకుందాం: మంత్రి లోకేష్ పిలుపు
ఈ సమావేశాల్లో అన్ని అంశాలపై చర్చిస్తాం: కిరణ్ రిజిజు
హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం
For More AndhraPradesh News And Telugu News