Share News

Donald Trump Imposes Additional Trariff: మరో 25శాతం సుంకం

ABN , Publish Date - Aug 07 , 2025 | 03:49 AM

భారత్‌పై దిగుమతి సుంకాలను మరో 25% పెంచుతూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ బుధవారం నిర్ణయం

Donald Trump Imposes Additional Trariff: మరో  25శాతం సుంకం

  • భారత్‌పై ట్రంప్‌ సుంకాల బాంబు.. ఇప్పటికే ప్రకటించిన 25 శాతానికి అదనం.. మొత్తంగా 50 శాతానికి పెంపు

  • వస్త్ర, ఆక్వా, పాదరక్షల పరిశ్రమలకు దెబ్బ!.. అదనపు టారిఫ్‌ ఈనెల 27వ తేదీ నుంచి అమల్లోకి

  • ప్రతీకార సుంకాలు విధిస్తే మరింతగా పెంచుతామని హెచ్చరికలు.. తొలి 25శాతం టారిఫ్‌ నేటి నుంచే అమల్లోకి

  • ఉక్కు, అల్యూమినియం, ఫార్మా ఉత్పత్తులు సహా ఇప్పటికే ఉన్న మినహాయింపులు కొనసాగింపు

  • అదనపు సుంకాలు అసమంజసం: భారత్‌.. మిత్రదేశం భారత్‌ను దూరం చేసుకోవద్దు: నిక్కీ హేలీ

  • అదానీపై అమెరికాలో దర్యాప్తు.. అందువల్లే ట్రంప్‌ బెదిరింపులకు మోదీ దీటుగా స్పందించడం లేదు: రాహుల్‌

వాషింగ్టన్‌/ న్యూఢిల్లీ, ఆగస్టు 6: భారత్‌పై దిగుమతి సుంకాలను మరో 25ు పెంచుతూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ బుధవారం నిర్ణయం తీసుకున్నారు. మొత్తంగా భారత్‌పై సుంకాలను 50 శాతానికి పెంచారు. రష్యా నుంచి చమురు కొనుగోళ్లను భారత్‌ కొనసాగిస్తున్నందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రకటించారు. ఒకవేళ భారత్‌ ప్రతీకార సుంకాలేమైనా విధిస్తే... తమ టారి్‌ఫలను మరింతగా పెంచుతామని హెచ్చరించారు. ‘24 గంటల్లో భారత్‌పై సుంకాలు పెంచుతాన’ంటూ మంగళవారం ప్రకటించిన ట్రంప్‌.. అన్నట్టుగానే బుధవారం సుంకాల పెంపు ఉత్తర్వులపై సంతకం చేశారు. ఈ ఉత్తర్వులు ఈ నెల 27వ తేదీ నుంచి అమల్లోకి రానున్నాయి. అయితే ఇప్పటికే విడిగా సుంకాలను నిర్ధారించిన ఉక్కు, అల్యూమినియం, ఫార్మా వంటి ఉత్పత్తులపై మినహాయింపులు కొనసాగుతాయని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. రష్యా నుంచి భారత్‌ చమురు కొనుగోలు చేస్తుండటంతో ఉక్రెయిన్‌పై యుద్ధం కోసం రష్యాకు నిధులు సమకూరుతున్నాయని ట్రంప్‌ ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే జూలై 30న భారత్‌పై 25శాతం సుంకాలను విధించారు. అవి ఆగస్టు 7వ తేదీ నుంచి అమల్లోకి రానున్నాయి. రష్యా చమురు కొనుగోళ్లపై భారత్‌ వెనక్కి తగ్గకపోవడం, రష్యాతో యూరోపియన్‌ యూనియన్‌, అమెరికా కూడా వాణిజ్యం జరుపుతుండటాన్ని భారత్‌ ఎత్తిచూపడంతో.. మరో 25శాతం కలిపి 50శాతం సుంకాలు విధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఆయా ఉత్పత్తులపై ఇప్పటికే ఉన్న సుంకాలకు ఈ 50 శాతం అదనం కావడం ఆందోళనకరం. కాగా.. భారత్‌, పాక్‌ మధ్య యుద్ధాన్ని తానే ఆపానంటూ ట్రంప్‌ మరోసారి వ్యాఖ్యలు చేశారు. 2028లో అమెరికాలోని లాస్‌ఏంజిలి్‌సలో జరిగే ఒలింపిక్స్‌కు సంబంధించి మీడియా సమావేశం ఏర్పాటు చేసిన ట్రంప్‌.. ‘‘రష్యా, ఉక్రెయిన్‌ మధ్య యుద్ధాన్ని ఆపడానికి గట్టిగా ప్రయత్నిస్తున్నాం. ఇప్పటికే గత ఐదు నెలల్లో.. భారత్‌, పాక్‌ యుద్ధం సహా ఐదు యుద్ధాలను ఆపాను. ఇది ఆరోది అవుతుంది..’’ అని పేర్కొన్నారు. మరోవైపు ప్రస్తుత ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌ 2028లో జరిగే ఎన్నికల్లో రిపబ్లికన్‌ పార్టీ తరఫున అధ్యక్ష అభ్యర్థిగా నిలిచే అవకాశం ఉందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ పేర్కొన్నారు. ఆయనతోపాటు విదేశాంగ మంత్రి మార్కో రూబియో కూడా అధ్యక్ష అభ్యర్థిత్వం కోసం పోటీపడే అవకాశం ఉందని చెప్పారు. అమెరికాలో నిబంధనల ప్రకారం.. ఎవరైనా సరే రెండుసార్లకు మించి అధ్యక్షుడు కావడానికి వీల్లేదు. ప్రస్తుతం రెండోసారి అధ్యక్షుడిగా ఉన్న ట్రంప్‌ మళ్లీ పోటీ చేయలేరు. మరో అభ్యర్థిని రిపబ్లికన్‌ పార్టీ తరఫున రంగంలోకి దింపాల్సిందే.


ఇది ఆర్థిక బ్లాక్‌ మెయిలింగ్‌: రాహుల్‌

ట్రంప్‌ సుంకాల పెంపు భారత్‌పై ఆర్థిక బ్లాక్‌ మెయిలింగ్‌ అని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ మండిపడ్డారు. అసమంజసమైన వాణిజ్య ఒప్పందం దిశగా భారత్‌ను నెట్టే ప్రయత్నమని విమర్శించారు. ప్రధాని మోదీ తన బలహీనతలను అధిగమించి అయినా.. భారత ప్రయోజనాలను దెబ్బతీసే ఈ చర్యను అడ్డుకోవాలంటూ ‘ఎక్స్‌’లో పోస్టు పెట్టారు. ట్రంప్‌ పదే పదే బెదిరింపులు చేస్తున్నా ప్రధాని మోదీ దీటుగా స్పందించడం లేదని... అదానీ వ్యవహారంపై అమెరికాలో దర్యాప్తు జరుగుతుండటమే దీనికి కారణమని రాహుల్‌ ఆరోపించారు.

మోదీతోనే మాట్లాడుతా: డసిల్వా

తమ దేశంపై సుంకాలకు సంబంధించి అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తో తాను మాట్లాడే ప్రసక్తే లేదని బ్రెజిల్‌ అధ్యక్షుడు ఇనాసియో లులా డసిల్వా స్పష్టం చేశారు. ఇటీవల బ్రెజిల్‌పై సుంకాలు విధిస్తూ, ఆ దేశ అధ్యక్షుడు తనతో ఎప్పుడైనా చర్చించవచ్చని ట్రంప్‌ ప్రకటించడంపై డసిల్వా స్పందించారు. ‘‘సుంకాలపై చర్చించేందుకు నేను ట్రంప్‌కు కాల్‌ చేసి మాట్లాడే ప్రసక్తే లేదు. ఆయన మేం చెప్పేది వినరు. దానికి బదులు భారత ప్రధాని మోదీ, చైనా అధ్యక్షుడు షి జిన్‌పింగ్‌తో మాట్లాడుతాను.


అదనపు సుంకాలు అసమంజసం: భారత్‌

సుంకాల పెంపు పూర్తిగా అసమంజసం, అన్యాయమని అమెరికాకు భారత్‌ స్పష్టం చేసింది. ఈ అంశంలో దేశ ప్రజల ప్రయోజనాలకు అనుగుణంగా తగిన చర్యలు చేపడతామని స్పష్టం చేసింది. భారత్‌పై 25శాతం అదనపు సుంకాలు విధిస్తూ ట్రంప్‌ ఉత్తర్వులు జారీ చేయడంపై.. మన విదేశాంగ శాఖ స్పందించింది. ‘‘రష్యా నుంచి భారత్‌ చమురు దిగుమతులను అమెరికా కొన్ని రోజులుగా టార్గెట్‌ చేస్తోంది. ఈ అంశంపై మేం ఇప్పటికే మా వైఖరిని స్పష్టం చేశాం. 140 కోట్ల మంది దేశ ప్రజలకు ఇంధన భద్రత కోసం మార్కెట్‌ పరిస్థితులకు అనుగుణంగా మా చమురు దిగుమతులు ఉన్నాయి. ఇతర దేశాలు వారి జాతీయ ప్రయోజనాల కోసం చేపట్టిన చర్యలకు సంబంధించి.. భారత్‌పై అదనపు సుంకాలు విధించాలని అమెరికా నిర్ణయించడం తీవ్ర దురదృష్టకరం. ఇది పూర్తిగా అన్యాయం, అసమంజసం. జాతీయ ప్రయోజనాలకు అనుగుణంగా అవసరమైన అన్ని చర్యలను భారత్‌ చేపడుతుంది’’ అని ప్రకటించింది.

వస్త్ర, ఆక్వా పరిశ్రమలకు దెబ్బ!

ట్రంప్‌ అదనంగా విధించిన సుంకాల ప్రభావం భారత్‌పై గణనీయంగానే ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. అయితే ప్రస్తుత పెంపుతో కలిపి గంపగుత్తగా 50 శాతం సుంకాలు వర్తించే కొన్ని రంగాలపైనే అధిక ప్రభావం ఉంటుందని.. నిర్ణీత టారి్‌ఫలు ఉన్న రంగాలకు ఇబ్బంది రాకపోవచ్చని అంటున్నారు. గంపగుత్త సుంకాలు వర్తించే ఉత్పత్తుల్లో.. వస్త్రాలు, రొయ్యలు ఇతర ఆక్వా ఉత్పత్తులు, రత్నాలు, ఆభరణాలు, తోలు ఉత్పత్తులు, పాదరక్షలు, జంతు ఉత్పత్తులు, రసాయనాలు, ఎలక్ట్రిక్‌, మెకానికల్‌ యంత్రాలు ఉన్నాయి. ఉత్పత్తులను బట్టి నిర్ణీత సుంకాలు (10 శాతం, 15 శాతం, 30 శాతం.. ఇలా) వర్తించేవాటిలో... చమురు, పెట్రోలియం ఉత్పత్తులు, బొగ్గు, కీలక ఖనిజాలు, కంప్యూటర్లు, మొబైల్‌ ఫోన్లు, స్ర్కీన్లు, హార్డ్‌ డిస్కులు వంటి ఎలకా్ట్రనిక్‌ ఉత్పత్తులు ఉన్నాయి. ఇందులో గంపగుత్త సుంకాలు వర్తించే భారత ఉత్పత్తుల ధరలు అమెరికాలో పెరిగిపోతాయి. తక్కువ సుంకాలున్న దేశాల నుంచి వచ్చే ఇవే ఉత్పత్తులు తక్కువ ధరకే లభిస్తాయి. దీనితో భారత ఎగుమతులపై ప్రభావం పడుతుంది. ఉదాహరణకు భారత్‌పై 50 శాతం సుంకం వల్ల.. అమెరికాలో మన వస్త్రాల ధరలు ఒక్కసారిగా 50శాతం పెరుగుతాయి.


అంటే ఇప్పటివరకు 20 డాలర్లకు దొరికే భారత టీషర్టు ధర 30 డాలర్లు అవుతుంది. అదే ఫిలిప్పీన్స్‌, వియత్నాంలపై 20శాతమే సుంకం వల్ల.. ఆ దేశాల నుంచి వచ్చే అదేస్థాయి టీషర్టు ధర 20 డాలర్ల నుంచి 24 డాలర్లకు మాత్రమే పెరుగుతుంది. ధర ఎక్కువగా ఉండటంతో భారత ఉత్పత్తులకు డిమాండ్‌ తగ్గి.. ఇక్కడి నుంచి ఎగుమతులు తగ్గిపోతాయి. ఆంధ్రప్రదేశ్‌ నుంచి అమెరికాకు ఎగుమతి అయ్యే రొయ్యల ధర పరిస్థితి కూడా ఇలాగే ఉండనుంది.

  • ప్రస్తుతం అమెరికా టారి్‌ఫలు మలేసియాపై 25శాతం, చైనా, శ్రీలంకలపై 30శాతం, ఇండోనేషియాపై 32ు, బంగ్లాదేశ్‌పై 35శాతం, థాయ్‌లాండ్‌, కాంబోడియాలపై 36 శాతం, మయన్మార్‌పై 40శాతంగా ఉన్నాయి. దీనితో అమెరికాలో ఆయా దేశాల ఉత్పత్తుల కంటే భారత ఉత్పత్తుల ధర ఎక్కువగా ఉండే అవకాశముంది.

  • ట్రంప్‌ సుంకాల నిర్ణయం షాక్‌కు గురిచేసిందని, దీనివల్ల దాదాపు 55శాతం భారత ఎగుమతులపై ప్రభావం పడుతుందని ‘భారత ఎగుమతి సంస్థల ఫెడరేషన్‌ (ఎఫ్‌ఐఈఓ)’ ప్రకటించింది. వస్త్ర పరిశ్రమ, ఆక్వా, తోలు ఉత్పత్తులు, పాదరక్షలు, రసాయనాలు, యంత్ర పరికరాల పరిశ్రమలకు దెబ్బతగులుతుందని పేర్కొంది.

  • అమెరికా సుంకాల ప్రభావం భారత్‌లో ద్రవ్యోల్బణంపై తీవ్ర ప్రభావమేమీ చూపుతుందని భావించడం లేదని రిజర్వు బ్యాంకు గవర్నర్‌ సంజయ్‌ మల్హోత్రా పేర్కొన్నారు. భారత్‌ ప్రతీకార సుంకాలు విధిస్తే.. ఏదైనా ప్రభావం పడే అవకాశం ఉందని, కానీ ఇప్పుడా పరిస్థితి కనిపించడం లేదని చెప్పారు.


ఈ వార్తలు కూడా చదవండి..

ఊటీలో పర్యాటక ప్రాంతాల మూసివేత.. కారణం ఏంటంటే..

అమిత్‌షాపై పరువునష్టం వ్యాఖ్యలు.. రాహుల్‌కు బెయిల్

Read Latest Telangana News and National News

Updated Date - Aug 07 , 2025 | 06:00 AM