Donald Trump: మోదీ, మునీర్ వల్లే యుద్ధం ఆగింది
ABN , Publish Date - Jun 20 , 2025 | 02:56 AM
భారత్-పాకిస్థాన్‌ల మధ్య గత నెలలో జరిగిన యుద్ధాన్ని తానే ఆపానంటూ పదే పదే చెప్పుకున్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తాజాగా మాట మార్చారు. భారత్, పాకిస్థాన్‌లకు చెందిన ఇద్దరు చాలా తెలివైన నాయకుల వల్లనే ఆ యుద్ధం నిలిచిందని....
వారిద్దరూ చాలా తెలివైన వ్యక్తులు
ఆపకుంటే భారత్-పాకిస్థాన్ ఘర్షణ అణుయుద్ధానికి దారి తీసి ఉండేది .
వారిద్దరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నా
ఇరాన్ గురించి పాక్‌కు తెలుసు: ట్రంప్
వైట్ హౌస్ లో మునీర్‌కు విందు ఇచ్చిన అమెరికా అధ్యక్షుడు
ట్రంప్‌కు నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాలంటూ మునీర్ డిమాండ్!
భారత్, పాక్‌లతో అమెరికా వాణిజ్య ఒప్పందాలపై కసరత్తు జరుపుతున్నాం
ప్రస్తుత పరిస్థితుల పట్ల మునీర్ నా అభిప్రాయాలతో ఏకీభవించారు: ట్రంప్
లాడెన్‌కు పాక్ ఆశ్రయం ఇచ్చిన విషయం అమెరికన్లు మర్చిపోవద్దు
కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ హెచ్చరిక
న్యూయార్క్/ఇస్లామాబాద్, జూన్ 19: భారత్-పాకిస్థాన్‌ల మధ్య గత నెలలో జరిగిన యుద్ధాన్ని తానే ఆపానంటూ పదే పదే చెప్పుకున్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తాజాగా మాట మార్చారు. భారత్, పాకిస్థాన్‌లకు చెందిన ఇద్దరు చాలా తెలివైన నాయకుల వల్లనే ఆ యుద్ధం నిలిచిందని, లేకపోతే అది అణుయుద్ధంగా మారి ఉండేదని తెలిపారు. ప్రధాని మోదీ, పాక్ సైన్యాధిపతి అసిమ్ మునీర్‌లను ఉద్దేశించి ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అమెరికా అధ్యక్ష భవనం వైట్‌హౌ్‌సలో అసిమ్ మునీర్‌కు విందు ఇచ్చిన అనంతరం ట్రంప్ మీడియాతో మాట్లాడారు. ‘భారత్‌తో యుద్ధాన్ని కొనసాగించకుండా ముగించినందుకు కృతజ్ఞతలు చెప్పటం కోసమే అసిమ్ మునీర్‌ను వైట్‌హౌ్‌సకు విందుకు ఆహ్వానించాను. భారత ప్రధాని నరేంద్రమోదీకి కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నా. భారత్, పాక్.. రెండూ పెద్ద దేశాలు. అణ్వాయుధ దేశాలు. యుద్ధం కొనసాగి ఉంటే అణుయుద్ధానికి దారి తీసే ప్రమాదం ఉండేది. కానీ, ఇద్దరు చాలా తెలివైన వ్యక్తులు దానిని నివారించారు. అది నాకు ఎంతో సంతోషం కలిగించింది. ఇరు దేశాలతోనూ అమెరికా వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోనుంది. దీనికోసం కసరత్తు జరుగుతోంది’ అని పేర్కొన్నారు.
మరోవైపు, ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం కారణంగా తలెత్తిన పరిస్థితుపై అసిమ్ మునీర్‌తో చర్చించానని ట్రంప్ వెల్లడించారు. ఇరాన్ గురించి పాకిస్థాన్‌కు చాలా దేశాలకంటే ఎక్కువగానే తెలుసని, (ఇరాన్ పట్ల) వారేమీ సంతృప్తిగా లేరని, ఇజ్రాయెల్ పట్ల వ్యతిరేకతతోనూ లేరన్నారు. ప్రస్తుతం కొనసాగుతున్న పరిస్థితులపై మునీర్ తనతో ఏకీభవించారని తెలిపారు. కాగా, ఇరాన్ మీద అమెరికా కూడా దాడికి దిగబోతోందనీ.. దాంట్లో భాగంగా పాక్‌లోని సైనిక స్థావరాలను ఉపయోగించుకోవటానికే మునీర్‌తో ట్రంప్ సమావేశమయ్యారన్న విశ్లేషణలు వెలువడ్డాయి. ట్రంప్‌తో మునీర్ భేటీపై పాక్ సైన్యం ఒక ప్రకటన విడుదల చేసింది. ఇరుదేశాలకూ దీర్ఘకాలికంగా పరస్పర ప్రయోజనం కలిగించే వాణిజ్య భాగస్వామ్య ఒప్పందానికి ట్రంప్ ఆసక్తి చూపారని ఆ ప్రకటన వెల్లడించింది. వాణిజ్యం, ఆర్థికాభివృద్ధి, గనులు, ఖనిజాలు, కృత్రిమమేధ, విద్యుత్తు, క్రిప్టోకరెన్సీ, కొత్త టెక్నాలజీలు తదితర రంగాల్లో పాకిస్థాన్-అమెరికా సహకారాన్ని మరింత బలోపేతం చేయటమే లక్ష్యంగా చర్చలు జరిగాయని పేర్కొంది. కాగా, భారత్-పాకిస్థాన్ మధ్య అణుయుధ్యం తలెత్తకుండా ట్రంప్ అడ్డుకున్నారని, ఆయనకు నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాలని అసిమ్ మునీర్ పేర్కొన్నట్లుగా వార్తలు వెలువడ్డాయి. అమెరికా అధ్యక్షుడు ఒక దేశ సైన్యాధిపతికి వైట్‌హౌ్‌సలో విందు ఇవ్వటం చాలా అరుదు. గతంలో పాక్ సైన్యాధిపతులు అయూబ్‌ఖాన్, జియాఉల్‌హక్, పర్వేజ్‌ముషారఫ్ ఈ తరహా ఆహ్వానాలు అందుకున్నప్పటికీ.. వారు ఆయా సమయాల్లో పాక్ సైన్యాధిపతిగానేగాక ఆ దేశ అధ్యక్షులుగా కూడా ఉన్నారు.
సోషల్ మీడియాలో మీమ్‌లు
వైట్ హౌస్ లో ట్రంప్-మునీర్ భేటీపై సోషల్ మీడియాలో పలు మీమ్‌లు వెలువడ్డాయి. ‘బిర్యానీతో ప్రపంచ శాంతికి యత్నం’ అంటూ వీరిద్దరి ఫొటోలు షేర్ చేస్తూ కొందరు కామెంట్ పెట్టారు. ‘సమయం వచ్చినప్పుడు ఇరాన్‌కు పాకిస్థాన్ వెన్నుపోటు పొడిచేలా ప్రేరేపించే లక్ష్యంతోనే మునీర్‌కు ట్రంప్ ఫ్రీ లంచ్ ఇచ్చాడు’ అంటూ మరికొందరు ఎద్దేవా చేశారు. త్రీ ఇడియట్స్, రిష్తే తదితర సినిమాల్లోని వీడియో క్లిప్‌లను ఎడిట్ చేస్తూ మరికొందరు కామెంట్లు పెట్టారు. కాగా, మునీర్‌తో ట్రంప్ భేటీని ప్రస్తావిస్తూ.. కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్.. అమెరికా చరిత్రలోనే అతిపెద్ద ఉగ్రదాడికి సూత్రధారి అయిన బిన్‌లాడెన్‌ను చివరి వరకూ పాకిస్థాన్ తమ దేశంలోనే దాచి పెట్టిందన్న విషయాన్ని అమెరికన్లు మర్చిపోవద్దని హెచ్చరించారు.