Thailand-Cambodia Clashes: ట్రంప్‌నకు షాక్.. కాల్పుల విరమణ లేదన్న థాయ్‌లాండ్
ABN , Publish Date - Dec 13 , 2025 | 10:19 PM
థాయ్‌లాండ్, కాంబోడియాల మధ్య గత వారం రోజులుగా సరిహద్దు వెంబడి ఘర్షణలు కొనసాగుతున్నాయి. అయితే, ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ జరిగిందని ట్రంప్ తాజాగా ప్రకటించారు. అయితే, ఆయన ప్రకటన వాస్తవ పరిస్థితిని ప్రతిబింబించడం లేదని థాయ్ ఆపద్ధర్మ ప్రధాని పేర్కొన్నారు. కాంబోడియా మాత్రం మౌనాన్నే ఆశ్రయించింది.
ఇంటర్నెట్ డెస్క్: ఎన్నో యుద్ధాలను ఆపానని తరచూ చెప్పుకునే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌నకు తాజాగా షాక్ తగిలింది. ట్రంప్ ప్రకటించినట్టు కాంబోడియాతో తమకు ఎలాంటి కాల్పుల విరమణ ఒప్పందం కుదరలేదని థాయ్‌లాండ్ ఆపద్ధర్మ ప్రధాని అనూటిన్ చర్ణ్‌విరకుల్ స్పష్టం చేశారు. కాల్పుల విరమణ జరిగిందని ట్రంప్ ఎక్స్ వేదికగా ప్రకటించాక ప్రధాని ఈ స్టేట్‌మెంట్ ఇచ్చారు (Thai Rejects Trump Cease Fire statement).
థాయ్‌లాండ్, కాంబోడియా మధ్య గత కొన్ని రోజులుగా సరిహద్దు వెంబడి ఉద్రిక్తతలు నెలకొన్నాయి. శనివారం సరిహద్దు వెంబడి థాయ్‌లాండ్ వైమానిక దాడులు జరపకగా కాంబోడియా ఇందుకు ప్రతిగా రాకెట్ దాడులు చేసింది. ఈ దాడుల్లో ఇద్దరు థాయ్‌పౌరులు మరణించినట్టు ప్రభుత్వం పేర్కొంది. అయితే, ట్రంప్ చెప్పినట్టు తమ మధ్య ఎలాంటి కాల్పుల విరమణ జరగలేదని థాయ్ ప్రధాని స్పష్టం చేశారు.
జులైలో ఇరు దేశాల మధ్య సరిహద్దు ఘర్షణలు మొదలైన విషయం తెలిసిందే. ఆ తరువాత ట్రంప్ జోక్యంతో ఇరు దేశాలు పరస్పర దాడులను తాత్కాలికంగా ముగించాయి. కొన్ని నెలల పాటు శాంతి నెలకున్నా మళ్లీ డిసెంబర్ 7న ఘర్షణలు భగ్గుమన్నాయి. ఈ ఘర్షణల్లో ఇద్దరు థాయ్ సైనికులు కన్నుమూశారు. గత వారం రోజుల్లో పరస్పర దాడులు పెరగడంతో రెండు డజన్లకు పైగా జనాలు కన్నుమూశారు. సరిహద్దు ప్రాంతాల్లోని దాదాపు 5 లక్షల మంది నిర్వాసితులుగా మారారు.
ఈ క్రమంలో శుక్రవారం ట్రంప్ మరోసారి కాల్పుల విరమణను ప్రకటించారు. కానీ ఈ స్టేట్‌మెంట్‌పై ఇరు దేశాల నుంచి ఆశించిన స్పందన కరువైంది. స్థానిక పరిస్థితులను ట్రంప్ ప్రకటన సరిగా ప్రతిబింబించలేదని థాయ్‌లాండ్ విదేశాంగ శాఖ మంత్రి అన్నారు. కాంబోడియా కూడా ట్రంప్ ప్రకటనపై స్పందించకపోవడం గమనార్హం.
ఇవీ చదవండి:
50 శాతం సుంకాల విధింపు.. మెక్సికోతో చర్చలు జరుపుతున్నామన్న కేంద్ర ప్రభుత్వ వర్గాలు
కెనడాకు ఫారిన్ స్టూడెంట్‌ల రాకలో 60 శాతం కోత
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి