Thailand Blast: థాయ్‌లాండ్‌లోని టపాసుల గోదాంలో భారీ పేలుడు.. 9 మంది మృతి, 100 మందికి పైగా గాయాలు

ABN , First Publish Date - 2023-07-29T21:43:49+05:30 IST

థాయ్‌లాండ్‌లో ఒక విషాద సంఘటన చోటు చేసుకుంది. ఒక బాణసంచా గోదాంలో పేలుడు సంభవించడంతో.. 9 మంది మృతి చెందగా, 100 మందికి పైగా గాయాలపాలయ్యారు. ఈ ఘటన శనివారం...

Thailand Blast: థాయ్‌లాండ్‌లోని టపాసుల గోదాంలో భారీ పేలుడు.. 9 మంది మృతి, 100 మందికి పైగా గాయాలు

థాయ్‌లాండ్‌లో ఒక విషాద సంఘటన చోటు చేసుకుంది. ఒక బాణసంచా గోదాంలో పేలుడు సంభవించడంతో.. 9 మంది మృతి చెందగా, 100 మందికి పైగా గాయాలపాలయ్యారు. ఈ ఘటన శనివారం నరాతీవాట్‌ దక్షిణ ప్రావిన్స్‌లోని సుంగై కొలోక్ పట్టణంలో జరిగింది. భవన నిర్మాణ పనుల్లో భాగంగా వెల్డింగ్ చేయడం వల్ల.. ఆ నిప్పురవ్వలు బాణసంచాలపై పడి, ఈ పేలుడు సంభవించి ఉంటుందని అధికారులు భావిస్తున్నారు.

ఈ పేలుడు ధాటికి చుట్టుపక్కల ఉన్న ఇళ్లు, దుకాణాలు, వాహనాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. కొన్ని వాహనాలైతే మంటల్లో దగ్ధమయ్యాయి. పెద్దఎత్తున పొగలు ఎగిసిపడ్డాయి. భారీ శబ్దంతో పేలుడు సంభవించడంతో.. ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. ప్రాణాల్ని అరచేతిలో పట్టుకొని పరుగు లంకించారు. ఈ ఘటనపై నరాతీవాట్ గవర్నర్ సనన్ పొంగక్సోర్న్ మాట్లాడుతూ.. శనివారం మధ్యాహ్నం భవనంలో వెల్డింగ్ పనుల వల్ల బాణసంగా గోదాంలో పేలుడు సంభవించిందని.. 9 మంది మృతి చెందడంతో పాటు 115 మంది గాయపడ్డారని తెలిపారు. ప్రస్తుతం మంటలు అదుపులో ఉన్నాయని.. ఈ ఘటనపై విచారణకు ఆదేశాలు జారీ చేయడం జరిగిందని పేర్కొన్నారు.


ఈ పేలుడు గురించి ఒక ప్రత్యక్ష సాక్షి మాట్లాడుతూ.. ‘‘నేను ఇంట్లో నా ఫోన్‌తో ఆడుకుంటున్న సమయంలో అకస్మాత్తుగా ఒక భారీ శబ్దం వినిపించింది. ఆ ధాటికి మా ఇల్లంతా కంపించింది’’ అని చెప్పాడు. పేలుడు ప్రాంతం నుంచి 100 మీటర్ల దూరంలో ఈ ప్రత్యక్ష సాక్షి ఇల్లు ఉంది. దీన్ని బట్టి.. ఎంత భారీ స్థాయిలో పేలుడు సంభవించిందో అర్థం చేసుకోవచ్చు. ఈ పేలుడు కారణంగా దాదాపు 500 ఇల్లు దెబ్బతిన్నాయని ఓ స్థానిక మీడియా పేర్కొంది. సహాయక బృందాలు సంఘటనా స్థలానికి చేరుకొని, సహాయక చర్యలు చేపట్టాయి.

Updated Date - 2023-07-29T21:43:49+05:30 IST