Share News

Russia Airstrike Hits Train: ఉక్రెయిన్‌లో ప్రయాణికుల రైలుపై రష్యా డ్రోన్ దాడి.. 30 మందికి గాయాలు

ABN , Publish Date - Oct 04 , 2025 | 04:56 PM

సామాన్య ప్రజలను లక్ష్యంగా చేసుకుని రష్యా దాడులు చేస్తోందని, ప్రతి రోజూ రష్యా ఎంతో మంది ప్రాణాలు తీస్తోందని జెలెన్‌స్కీ ఆగ్రహం వ్యక్తం చేశారు. రష్యా ఉన్మాద చర్య పట్ల ప్రపంచం నిర్లక్ష్య ధోరణితో వ్యవహరించరాదని అన్నారు.

Russia Airstrike Hits Train: ఉక్రెయిన్‌లో ప్రయాణికుల రైలుపై రష్యా డ్రోన్ దాడి.. 30 మందికి గాయాలు
Ukraine railway station

కీవ్: ఉక్రెయిన్‌-రష్యా యుద్ధం (Ukraine-Russia War) అంతకంతకూ తీవ్రమవుతోంది. తాజాగా ఉక్రెయిన్‌లోని ఉత్తర సమీ ప్రాంతంలో రష్యా దళాలు డ్రోన్లతో విరుచుకుపడ్డాయి. ప్రయాణికుల రైలుపై బాంబులు పడటంతో పలు బోగాలు మంటల్లో కాలిపోగా, సుమారు 30 మంది ప్రయాణికులు గాయపడ్డారు. దీంతో హుటాహుటిన రెస్క్యూ టీమ్‌లు రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టాయి. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ (Zelenskyy) ఈ విషయాన్ని ధ్రువీకరిస్తూ రష్యా చర్యపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు.


'సమీ ప్రాంతంలోని రైల్వేస్టేషన్‌పై రష్యా క్రూరమైన డ్రోన్ దాడి జరిపింది. అత్యవసర సర్వీసులన్నీ ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. గాయపడిన వారి సమాచారం తెలుసుకుంటున్నాం. ఇంతవరకూ 30 మంది గాయపడినట్టు సమాచారం అందింది' అని ఆ ట్వీట్‌లో జెలెన్‌స్కీ పేర్కొన్నారు.


సామాన్య ప్రజలను లక్ష్యంగా చేసుకుని రష్యా దాడులు చేస్తోందని, ప్రతి రోజూ రష్యా ఎంతో మంది ప్రాణాలు తీస్తోందని జెలెన్‌స్కీ ఆగ్రహం వ్యక్తం చేశారు. రష్యా ఉన్మాద చర్య పట్ల ప్రపంచం నిర్లక్ష్య ధోరణితో వ్యవహరించరాదని, యుద్ధ పరిష్కారం కోసం ఐరోపా, అమెరికా నుంచి ఎన్నో ప్రకటనలు వింటున్నప్పటికీ మాట సాయం సరిపోదని అన్నారు. బలమైన చర్యలు అవసరమని పేర్కొన్నారు. కాగా, రీజినల్ గవర్నల్ ఒలేహ్ హ్రిహోరోవ్ ప్రయాణికుల రైలుపై రష్యా దాడి ఘటనను ధ్రువీకరించారు. వైద్యులు, రెస్క్యూ టీమ్ ఘటనా స్థలి వద్ద సహాయక చర్యలు చేపట్టినట్టు వెల్లడించారు. డ్రోన్ దాడిలో కాలిపోతున్న ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.


ఇవి కూడా చదవండి..

హమాస్‌ శాంతి ఒప్పందానికి సిద్ధమన్న ట్రంప్.. ఇంతలో మళ్లీ ఇజ్రాయెల్ దాడులు

హెచ్-1బీ వీసా పెంపునకు వ్యతిరేకంగా మొదలైన పోరాటం.. ఫెడరల్ కోర్టులో పిటిషన్

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Oct 04 , 2025 | 05:21 PM