Pakistan: మీ సాయం మరువలేనిది.. ట్రంప్‌కు పాక్ కృతజ్ఞతలు ..
ABN , Publish Date - May 11 , 2025 | 04:51 PM
Pakistan Thanks Trump: భారత్-పాక్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిర్చేందుకు మధ్యర్తిత్వం వహించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు పాకిస్థాన్ కృతజ్ఞతలు తెలిపింది.
Trump Pakistan India Kashmir issue: ఆపరేషన్ సిందూర్ తర్వాత భారత్-పాక్ మధ్య వివాదం ముదురుతున్న వేళ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన వెలువరించారు. ఇరు దేశాలు కాల్పుల విరమణ ఒప్పందానికి అంగీకరించినట్లు ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. అయితే, కొన్ని గంటల్లోనే దాయాది దేశం ఒప్పంద నియమాలను గంగలో కలిపేసింది. యధావిధిగా పాక్ సేనలు సరిహద్దుల వద్ద డ్రోన్లు, బుల్లెట్లతో విరుచుకుపడ్డాయి. పొరుగు దేశం దొంగచాటు వ్యవహారం భారత బలగాలు ముందే పసిగట్టి వేగంగా స్పందించడంతో ఎలాంటి నష్టం వాటిల్లలేదు. అయితే, అంతలోనే పాకిస్థాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ఎక్స్ వేదికగా కీలక పోస్ట్ చేసింది.
భారత్‌తో కాల్పుల విరమణ ఒప్పందం కుదుర్చుకోవడంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పాత్రను స్వాగతిస్తున్నట్లు పాకిస్తాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ఎక్స్ వేదికగా ఆదివారం పోస్ట్ చేసింది. అదే విధంగా కశ్మీర్ సమస్యపై మధ్యవర్తిత్వం వహించడానికి ట్రంప్ చొరవ చూపించడంపై కృతజ్ఞతలు తెలిపింది.
"పాకిస్థాన్, భారతదేశం మధ్య ఇటీవలి కాల్పుల విరమణ ఒప్పందానికి యునైటెడ్ స్టేట్స్, ఇతర మిత్ర దేశాలు కలిసి పోషించిన నిర్మాణాత్మక పాత్రను మేము కృతజ్ఞతతో అంగీకరిస్తున్నాము. ఉద్రిక్తతలను తగ్గించి శాంతి నెలకొల్పేందుకు ఇదొక ముందడుగు. అలాగే దక్షిణాసియా శాంతి భద్రతలకు భంగం కలిగిస్తున్న దీర్ఘకాల సమస్య జమ్మూ కశ్మీర్ వివాద పరిష్కారం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సంసిద్ధతను వ్యక్తం చేయడాన్ని మేం అభినందిస్తున్నాము. జమ్మూ కశ్మీర్ వివాదానికి సంబంధించిన ఏదైనా న్యాయమైన, శాశ్వత పరిష్కారం ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి తీర్మానాలకు అనుగుణంగా ఉండాలని.. కాశ్మీరీ ప్రజల ప్రాథమిక హక్కులను, వారి స్వయం నిర్ణయాధికార హక్కును సాధించేలా చూసుకోవాలని పాకిస్థాన్ పునరుద్ఘాటిస్తుంది" అని ఆ పాక్ విదేశాంగ శాఖ ఈ సుదీర్ఘ పోస్టులో పేర్కొంది.
శాంతి, భద్రత, శ్రేయస్సును ప్రోత్సహించే ప్రయత్నాలకు మా దేశం 'కట్టుబడి' ఉందని పాకిస్థాన్ ఆ ప్రకటనలో పేర్కొంది. ముఖ్యంగా వాణిజ్యం, పెట్టుబడి, ఆర్థిక సహకార రంగాలలో అమెరికాతో తన భాగస్వామ్యాన్ని మరింతగా పెంచుకోవాలని పాకిస్థాన్ ఎదురుచూస్తున్నట్లు వెల్లడించింది.
ఇక భారత్-పాక్ కాల్పుల విరమణ ఒప్పందం విషయానికి వస్తే, పాకిస్థాన్ సైన్యం డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ (DGMO) భారత విదేశాంగ కార్యదర్శికి ఫోన్ చేసి అభ్యర్థించాకే ఇరు దేశాల మధ్య ఒప్పందం కుదిరిందని విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ శనివారం స్పష్టం చేశారు. కశ్మీర్ సమస్యపై మూడో వ్యక్తి జోక్యం లేకుండా ద్వైపాక్షికంగా పరిష్కరించుకోవాలనేది భారత్ ఆకాంక్ష. 1971 యుద్ధం తరువాత, 1972లో రెండు పొరుగు దేశాలు సంతకం చేసిన సిమ్లా ఒప్పందంలో కూడా ఇందుకు సంబంధించిన నిబంధన ఉంది .