India Vs Pakistan: భారత్‌పై పాక్ మిలటరీ అధికారి సంచలన వ్యాఖ్యలు
ABN , Publish Date - May 23 , 2025 | 08:15 AM
India Vs Pakistan: భారత్‌కు వ్యతిరేకంగా పాక్ మిలటరీ ప్రతినిధి అహ్మద్ షరీఫ్ చౌదరి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన.. లష్కరే తోయిబా చీఫ్ హఫీజ్ సయీద్ చేసిన వ్యాఖ్యలే దాదాపుగా ప్రస్తావించారు.
ఇస్లామాబాద్, మే 23: భారత్‌ను ఉగ్రవాదులు ఎలా రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నారో.. అదే తరహాలో పాక్ మిలటరీ అధికారులు సైతం వ్యాఖ్యలు చేస్తున్నారు. తాజాగా పాకిస్థాన్ మిలటరీ ప్రతినిధి లెఫ్టినెంట్ జనరల్ అహ్మద్ షరీఫ్ చౌదరి అదే రీతిలో వ్యవహరించారు. భారత్‌పై ఆగ్రహాన్ని ఆయన తన మాటల్లో వ్యక్తపరిచారు. గురువారం పాకిస్థాన్‌లోని ఒక యూనివర్సిటీలో అహ్మద్ షరీఫ్ చౌదరి ప్రసంగిస్తూ.. మీరు మా నీటిని నిలిపి వేస్తే.. మేము మీ ఊపిరిని ఆపేస్తామంటూ భారత్‌కు వ్యతిరేకంగా కీలక వ్యాఖ్యలు చేశారు. అయితే ఈ వ్యాఖ్యలు దాదాపుగా లష్కరే తోయిబా చీఫ్ హఫీజ్ సయీద్ చేసిన వ్యాఖ్యలను పోలి ఉన్నాయి. పాక్ మిలటరీ ప్రతినిధి చేసిన ఈ వ్యాఖ్యలు భారత్‌ను బెదిరించినట్లుగా ఉందనే ఓ చర్చ సైతం సాగుతోంది.
పహల్గాం ఉగ్రదాడి అనంతరం పాకిస్థాన్‌కు వ్యతిరేకంగా భారత్ తీసుకున్న అతిపెద్ద నిర్ణయాల్లో సింధూ జలాల ఒప్పందాన్ని నిలిపివేయడం ఒకటి. ఈ నిర్ణయం తీసుకున్న అనంతరం ఇదే రీతిలో దాదాపుగా ఇదే తరహాలో లష్కరే తోయిబా చీఫ్ స్పందించిన విషయం విదితమే. పహల్గాంలో ఉగ్రదాడి జరిగిన సరిగ్గా నెల రోజులకే పాకిస్థాన్ మిలటరీ ప్రతినిధి అహ్మద్ షరీఫ్ చౌదరి ఈ తరహా వ్యాఖ్యలు చేయడం గమనార్హం. మరోవైపు ఆయన చేసిన ఈ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఏప్రిల్ 22వ తేదీ పహల్గాంలో పర్యాటకులే లక్ష్యంగా ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో 26 మంది మరణించారు. సీమాంతర ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్థాన్.. ఈ ఘటన వెనుక ఉందనేందుకు కీలక సాక్ష్యాధారాలను భారత్ సంపాదించింది. దీంతో ఆ మరునాడే సింధూ జలాల ఒప్పందాన్ని నిలిపివేస్తున్నట్లు భారత్ ప్రకటించింది. అంతేకాదు.. నీరు, రక్తం ఒకేసారి ప్రవహించవంటూ భారత్ కీలక వ్యాఖ్యలు చేసింది.
భారత్ తీసుకున్న ఈ నిర్ణయంపై లష్కరే తోయిబా చీఫ్ హఫీజ్ సయీద్ తన అక్కసును వెళ్లగక్కిన సంగతి తెలిసిందే. ఆ క్రమంలో అతను సైతం ఇవే వ్యాఖ్యలు చేశారు. కాగా, 2008లో ముంబై ఉగ్రదాడికి కీలక సూత్రధారిగా హఫీజ్ వ్యవహరించడమే కాకుండా.. భారత్, అమెరికాలకు వ్యతిరేకంగా రెచ్చగొట్టే ప్రసంగాలు చేయడంలో సిద్దహస్తుడన్న సంగతి అందరికీ తెలిసిందే.
ఈ వార్తలు కూడా చదవండి..
బుగ్గమఠం భూములపై దేవదాయ ట్రైబ్యునల్’ను ఆశ్రయించండి
స్కామ్‌లు బయటపడేకొద్దీ జగన్‌లో భయం
For International News And Telugu News